PBKS vs RCB: పంజాబ్‌ను ఇంటికి పంపించిన కోహ్లి - ప్లేఆఫ్స్ రేసులో నిలిచిన బెంగళూరు
PBKS vs RCB: ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో బెంగళూరు అసమాన రీతిలో పోరాడింది. పంజాబ్‌పై 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. కోహ్లి 92 పరుగులతో చెలరేగి బెంగళూరుకు విక్టరీ అందించాడు.
PBKS vs RCB: ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బెంగళూరు అద్భుతంగా పోరాడింది. పంజాబ్ కింగ్స్‌పై 60 పరుగులు భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి 92 పరుగులతో దంచికొట్టగా...రజత్ పాటిదార్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. వీరిద్దరి మెరుపులతో బెంగళూరు ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో తడబడిన పంజాబ్ కింగ్స్ 17 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది.
రూసో ఎదురుదాడి....
భారీ టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలో దిగిన పంజాబ్ ఆరంభంలో పోరాడింది. కానీ కీలక సమయంలో వరుసగా వికెట్లు కోల్పోవడం పంజాబ్‌ను దెబ్బకొట్టింది. ప్రభ్‌సిమ్రాన్ (6 రన్స్) తొందరగానే ఔట్ అయినా జానీ బెయిర్ స్టో, రైలీ రూసో ఎదురుదాడికి దిగి బెంగళూరును భయపెట్టారు. ముఖ్యంగా రూసో ఏడాపెడా ఫోర్లతో రెచ్చిపోయాడు. 27 బాల్స్‌లోనే 9 ఫోర్లు, మూడు సిక్సర్లతో 61 రన్స్ చేశాడు.
బెయిర్ స్టో 16 బాల్స్‌లో నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 27 రన్స్ చేసి ఔటయ్యాడు. బెయిర్ స్టో ఔట్ అయినా శశాంక్ సింగ్ సహాయంతో పంజాబ్ ను రూసో ముందుకు నడిపించాడు. ఫామ్‌లో ఉన్న శశాంక్ సింగ్‌ను కోహ్లి రనౌట్ చేసి బెంగళూరుకు బ్రేకిచ్చాడు. 19 బాల్స్‌లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 37 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు శశాంక్ సింగ్. ఈ రనౌట్ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.
పంజాబ్ పతనం ఆరంభం...
ఆ తర్వాత పంజాబ్ పతనం ఆరంభమైంది. మిగిలిన బ్యాట్స్‌మెన్స్ అందరూ సింగిల్ డిజిట్ స్కోరుకే ఔటయ్యారు. కరణ్ శర్మ బౌలింగ్‌లో రూసో కూడా వెనుదిరగడంతో పంజాబ్ ఓటమి ఖాయమైంది. 17 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ మూడు, కరణ్ శర్మ, ఫెర్గ్యూసన్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
సున్నా పరుగులకే క్యాచ్...
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరుకు కోహ్లి, రజత్ పాటిదార్ కలిసి భారీ స్కోరు అందించారు. సున్నా తో పాటు 10 పరుగుల కోహ్లి ఇచ్చిన క్యాచ్‌లను పంజాబ్ ఫీల్డర్లు నేలపాలు చేశారు. అందుకు తగ్గ మూల్యం చెల్లించుకున్నారు. 47 బాల్స్‌లో ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్లతో కోహ్లి 92 రన్స్ చేశాడు. తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు.
రజత్ పాటిదార్ 23 బాల్స్‌లో ఆరు సిక్సర్లు, మూడు ఫోర్లతో 55 ర న్స్‌తో దంచికొట్టాడు. కామెరూన్ గ్రీన్ 46, దినేష్ కార్తిక్ 18 రన్స్‌తో చెలరేగడంతో బెంగళూరు 241 రన్స్ చేసింది. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు, కావేరప్ప రెండు వికెట్లు తీసుకున్నారు.
ప్లేఆఫ్స్ రేసులో బెంగళూరు...
ఈ మ్యాచ్‌లో గెలుపుతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ప్లే ఆఫ్స్ ఆశలు నిలుపుకోగా...పంజాబ్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఐపీఎల్ పాయింట్ల పట్టింకలో 12 మ్యాచుల్లో ఐదు విజయాలు, ఏడు ఓటములతో పది పాయింట్లు దక్కించుకున్న ఆర్‌సీబీ ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో ఏడో స్థానంలో నిలిచింది. 12 మ్యాచుల్లో నాలుగు విజయాలతో తొమ్మిదో స్థానంలో నిలిచి పంజాబ్ కింగ్స్ నిరాశపరిచింది.