IND vs AUS T20 Match: హైదరాబాద్‌కు బీసీసీఐ షాక్ - ఇండియా, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ బెంగళూరుకు షిఫ్ట్?
IND vs AUS T20 Match: డిసెంబర్ 3న హైదరాబాద్ వేదికగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగనున్న టీ20 మ్యాచ్‌ను బెంగళూరకు షిఫ్ట్ చేయాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అందుకు కారణం ఏమిటంటే...
IND vs AUS T20 Match: వరల్డ్ కప్‌లో టీమిండియా ఆడిన మ్యాచ్‌లకు హైదరాబాద్‌లో ఆతిథ్యం కల్పించకుండా తెలుగు క్రికెట్ అభిమానులకు షాకిచ్చింది బీసీసీఐ. తాజాగా డిసెంబర్ 3న ఇండియా, ఆస్ట్రేలియా మధ్య హైదరాబాద్‌లో జరుగనున్న టీ20 మ్యాచ్‌ను ఇక్కడి నుంచి బెంగళూరుకు షిఫ్ట్ చేయాలని ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.
వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ఆస్ట్రేలియాతో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. నవంబర్ 23 నుంచి ఈ టీ20 సిరీస్ మొదలుకానుంది. ఈ టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్‌కు హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్‌నేషనల్ స్టేడియాన్ని వేదికగా ఫిక్స్ చేశారు. తెలంగాణలో ఎలెక్షన్స్ జరుగనున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను హైదరాబాద్ లో కాకుండా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.
బెంగళూరుతో పాటు మరికొన్ని ప్రత్యామ్నాయ వేదికలను పరిశీలిస్తోన్నట్లు సమాచారం. వేదిక మార్పుకు సంబంధించిన నిర్ణయంపై మరో రెండు, మూడు రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. కాగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు సీనియర్ ప్లేయర్లకు విశ్రాంతి నివ్వాలని బీసీసీఐ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ టీ20 సిరీస్ లో భువనేశ్వర్ కుమార్, సంజూశాంసన్‌తో పాటు వరల్డ్ కప్‌కు దూరమైన పలువురు ఆటగాళ్లకు చోటు కల్పించనున్నట్లు తెలిసింది.