Wasim Akram on Prithvi Shaw: పార్టీలు తర్వాత.. ముందు ఆడు: పృథ్వీ షాపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఫైర్-former pakistan captain wasim akram slams prithvi shaw after his poor outing in ipl 2024 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Wasim Akram On Prithvi Shaw: పార్టీలు తర్వాత.. ముందు ఆడు: పృథ్వీ షాపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఫైర్

Wasim Akram on Prithvi Shaw: పార్టీలు తర్వాత.. ముందు ఆడు: పృథ్వీ షాపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఫైర్

Hari Prasad S HT Telugu
May 10, 2024 03:41 PM IST

Wasim Akram on Prithvi Shaw: టీమిండియా, ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షాకు గట్టిగానే క్లాస్ పీకాడు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్. పార్టీలు తర్వాత ముందు ఆటపైన దృష్టి పెట్టు అని అనడం గమనార్హం.

పార్టీలు తర్వాత.. ముందు ఆడు: పృథ్వీ షాపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఫైర్
పార్టీలు తర్వాత.. ముందు ఆడు: పృథ్వీ షాపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఫైర్ (AP)

Wasim Akram on Prithvi Shaw: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ టీమిండియా, ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా ఆటతీరుపై తీవ్రంగా మండిపడ్డాడు. ఎలాంటి మొహమాటం లేకుండా పార్టీలు పక్కన పెట్టు, ఆటపై దృష్టి సారించు అని చెప్పడం గమనార్హం. ఈ సీజన్ ఐపీఎల్లోనూ పృథ్వీ వరుసగా విఫలమవుతూ.. ఢిల్లీ జట్టులో చోటు కోల్పోవడంతో అక్రమ్ ఈ కామెంట్స్ చేశాడు.

పార్టీలు తర్వాత.. ముందు ఆడు

ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఐపీఎల్ 2024లో ఎలాగోలా ప్లేఆఫ్స్ చేరడానికి బాగానే శ్రమిస్తోంది. మొదట్లో వరుసగా ఓడినా.. తర్వాత గాడిలో పడింది. 12 మ్యాచ్ లలో ఆరు గెలిచి, ఆరు ఓడి ఇంకా ప్లేఆఫ్స్ రేసులో ఉంది. ఫ్రేజర్ మెక్‌గర్క్ లాంటి ఆస్ట్రేలియా యువ ఓపెనర్ ఢిల్లీ టీమ్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తుంటే.. టీమిండియాకు ఆడిన ఓపెనర్ పృథ్వీ షా మాత్రం వరుస వైఫల్యాలతో జట్టులో చోటు కోల్పోయాడు.

గతేడాది 8 మ్యాచ్ లు కలిపి 100 పరుగులు కూడా చేయని పృథ్వీ షా.. ఈసారి అదే 8 మ్యాచ్ లలో 198 రన్స్ మాత్రమే చేశాడు. రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో ఢిల్లీ అతని పక్కన పెట్టింది. దీనిపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ స్పందించాడు. టాలెంట్ ఉన్న నిలకడ లేమితో ఇండియన్ టీమ్ లో చోటు కోల్పోయిన పృథ్వీ.. ఇప్పుడు ఐపీఎల్లోనూ అలాగే ఆడుతున్నాడు.

దీంతో స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడిన అక్రమ్.. పృథ్వీ ఆటతీరుపై స్పందించాడు. "ఈ ఏడాది అతని ఆట సరిగా చూడలేదు. కానీ అతడు మళ్లీ బేసిక్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ క్లాస్ క్రికెట్ కు వెళ్లి భారీగా రన్స్ చేయాలి. క్రికెట్ పై దృష్టి సారించాలి పార్టీలపై కాదు. అతడు ఇంకా చాలా కాలం క్రికెట్ ఆడగలడు. ముందు వెళ్లి ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాలి. అక్కడ సెంచరీలు చేసి మళ్లీ రావాలి. అదొక్కటే మార్గం. షార్ట్ కట్ ఏమీ లేదు. అతని దగ్గర టైమ్ ఉంది. అది అతనికి సానుకూలాంశం" అని అక్రమ్ అన్నాడు.

పృథ్వీ ఆడుతూనే ఉండాలి

పృథ్వీ షా డొమెస్టిక్ క్రికెట్ లో మెరుపులు మెరిపించి ఇండియన్ టీమ్ లోకి వచ్చాడు. అయితే నిలకడ లేమి వల్ల చోటు కోల్పోయాడు. చివరిసారి మూడేళ్ల కిందట 2021లో అతడు ఇండియన్ టీమ్ తరఫున ఆడాడు. అయితే ఇలా జరగకూడదంటే పృథ్వీ క్రమం తప్పకుండా క్రికెట్ ఆడుతూనే ఉండాలని, ఫీల్డ్ బయట కూడా తన గురించి తాను కాస్త పట్టించుకోవాలని అక్రమ్ అన్నాడు.

"అతడు క్రమం తప్పకుండా ఆడాలి. ఫీల్డ్ బయటకు కూడా కాస్త తనను తాను నియంత్రించుకోవాలి. రిటైరైన తర్వాత ఎన్ని పార్టీలైనా చేసుకో. ఎవరొద్దన్నారు. కానీ ఇప్పుడైతే క్రికెట్ పై దృష్టి సారించు" అని అక్రమ్ సూటిగా చెప్పాడు. ముంబైకి చెందిన పృథ్వీ ఎంతో టాలెంట్ ఉన్న ప్లేయరే అయినా.. నిలకడగా రాణించకపోవడంతో అతడు తరచూ జట్టులో స్థానం కోల్పోతున్నాడు.

IPL_Entry_Point