Prithvi Shaw: ‘ఎన్నిసార్లు ఇలా ఔట్ అవుతావ్’: వృథ్వి షాపై నెటిజన్ల ఆగ్రహం
Prithvi Shaw: యంగ్ బ్యాటర్ పృథ్వి షాపై నెటిజన్లు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. రంజీ ట్రోఫీ ఫైనల్‍లో అతడు ఔటైన తీరుపై ఫైర్ అయ్యారు. ఇంకా ఎన్నిసార్లు ఇలా తీరులో ఔటవుతావంటూ కొందరు కామెంట్లు చేశారు.
Prithvi Shaw: భారత యువ ఆటగాడు, ముంబై ఓపెనర్ పృథ్వి షా.. రంజీ ట్రోఫీ ఫైనల్‍లో నిరాశ పరిచాడు. ముంబై వేదికగా విదర్భతో జరుగుతున్న దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ తుదిపోరులో రెండో రోజైన నేడు (మార్చి 11) రెండో ఇన్నింగ్స్‌లో ముంబై స్టార్ పృథ్వి (11) విఫలమయ్యాడు. అయితే, వృథ్వి షా ఔటైన తీరుపై కొందరు నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అలాంటి బంతికే ఔట్ అవుతావంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ వివరాలివే..
ఔట్ ఇలా..
విదర్భ బౌలర్ యశ్ ఠాకూర్ వేసిన ఏడో ఓవర్ రెండో బంతికి ముంబై బ్యాటర్ వృథ్వి షా బౌల్డ్ అయ్యాడు. ఇన్‍స్వింగ్ అయిన బంతిని హైబ్యాక్ లిఫ్ట్‌తో ఫ్రంట్ ఫుట్‍లో ఆడేందుకు పృథ్వి షా ప్రయత్నించాడు. అయితే, బ్యాట్, ప్యాడ్ మధ్య ఉన్న గ్యాప్‍లో బంతి దూసుకెళ్లి వికెట్లకు తగిలింది. దీంతో పృథ్వి బౌల్డ్ అయ్యాడు. ఇదే విధంగా దేశవాళీ క్రికెట్‍తో పాటు ఐపీఎల్, భారత జట్టులోనూ కొన్నిసార్లు బౌల్డ్ అయ్యాడు పృథ్వి. ఇన్‍స్వింగింగ్ బంతులకు చాలాసార్లు ఇబ్బందులు పడ్డాడు. ఈ విషయంలో టెక్నిక్ మార్చుకోవాలని కొందరు మాజీలు కూడా అతడికి సూచించారు.
2020లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ సమయంలో ఇన్‍స్వింగింగ్ బంతికే పృథ్వి ఔట్ అవుతాడని రికీ పాంటింగ్ చెప్పాడు. అతడు చెప్పినట్టే ఫస్ట్ టెస్టులో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‍లో బౌల్డ్ అయ్యాడు భారత బ్యాటర్ పృథ్వి షా. దేశవాళీ, ఐపీఎల్ సహా గత నాలుగేళ్లుగా ఇదేరీతిలో పలుమార్లు ఔటయ్యాడు.
ఇంకెన్నిసార్లు ఇలా..
రంజీ ట్రోఫీ ఫైనల్‍లో ఇన్‍స్వింగింగ్ బంతికే పృథ్వి షా ఔటవడం కొందరు నెటిజన్లకు కోపం తెప్పించింది. తప్పుల నుంచి నేర్చుకోకుండా.. చాలాసార్లు ఒకే రకంగా ఔటవుతుండడం పట్ల కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్ల నుంచి ఒకే తీరుగా ఔటవుతున్నాడంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. ‘ఐదేళ్లయింది.. ఇంకా లోపలికి వచ్చే బంతులతో ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు’ అని మరికొందరు రాసుకొచ్చారు. ఇన్‍స్వింగింగ్ బంతులకు టెక్నిక్ మెరుగుపరుచుకోవాలని అతడికి కొందరు సూచించారు.
పృథ్వి షాకు కొండంత టాలెంట్ ఉంది. గతంలో దేశవాళీ క్రికెట్‍లో పరుగుల వరద పారించాడు. అయితే, ఫిట్‍నెస్ సమస్యలు, కొంత టెక్నిక్ లోపాలతో కొంతకాలంగా స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతున్నాడు. మళ్లీ టీమిండియాలో చోటు దక్కించుకునేందుకు కష్టపడుతున్నా.. ఆ స్థాయిలో రాణించలేకపోతున్నాడు.
ముంబై ఆధిపత్యం
విదర్భతో జరుగుతున్న ప్రస్తుత రంజీ ట్రోఫీ ఫైనల్‍లో ముంబై జట్టు ఆధిపత్యం చూపుతోంది. రెండో రోజు ఆట ముగిసే సరికి రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 141 పరుగుుల చేసింది ముంబై. దీంతో ఆ జట్టు ఆధిక్యం 260 పరుగులకు చేరింది. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు పృథ్వి (11), భుపేన్ లల్వానీ (18) విఫలమైనా.. కెప్టెన్ అజింక్య రహానే (58 నాటౌట్), ముషీర్ ఖాన్ (51 నాటౌట్) అర్ధ శతకాలతో అదరగొట్టారు. మంగళవారం మూడో రోజు ఆటను వారిద్దరూ కొనసాగించనున్నారు.
ఈ రంజీ ట్రోఫీ ఫైనల్‍లో తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 224 పరుగులకు ఆలౌటైంది. శార్దూల్ ఠాకూర్ (74) కీలకమైన అర్ధ శతకం చేసి ముంబైని ఆదుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో విదర్భ 105 పరుగులకే ఆలౌటవటంతో ముంబైకు భారీ ఆధిక్యం దక్కింది.