IPL 2024 points table: ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఐపీఎల్ 2024 లేటెస్ట్ పాయింట్ల టేబుల్ ఇదీ
IPL 2024 points table: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ రేసు రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం తర్వాత పాయింట్ల టేబుల్లో ఆసక్తికర మార్పులు చోటు చేసుకున్నాయి.
IPL 2024 points table: ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్ లో ప్రతి రోజూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. లీగ్ దశ ముగియడానికి సమయం దగ్గర పడుతుండటంతో ప్రతి మ్యాచ్ కీలకంగా మారుతోంది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ ను ఢిల్లీ క్యాపిటల్స్ ఓడించిన తర్వాత కూడా పాయింట్ల టేబుల్ మారడంతోపాటు ప్లేఆఫ్స్ రేసు కూడా మరింత రసవత్తరంగా మారింది.
ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్
రాజస్థాన్ రాయల్స్ తో మంగళవారం (మే 7) జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో క్యాపిటల్స్ మొదట 221 పరుగులు చేయగా.. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్స్ 201 పరుగుల దగ్గరే ఆగిపోయింది. ఈ విజయం తర్వాత ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఐదో స్థానానికి దూసుకొచ్చింది.
ఒక్క మ్యాచ్ గెలిచినా ప్లేఆఫ్స్ ను బెర్తును ఖాయం చేసుకుంటుంది అనుకున్న తరుణంలో రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండింట్లో ఓడిపోయింది. ప్రస్తుతం ఆ టీమ్ రెండో స్థానంలోనే కొనసాగుతోంది. మొదట 9 మ్యాచ్ లలో 8 గెలిచిన రాయల్స్.. తర్వాత వరుసగా రెండు ఓడి ప్రస్తుతం 11 మ్యాచ్ లలో 8 విజయాలు, మూడు ఓటములతో 16 పాయింట్లు సాధించి రెండో స్థానంలో ఉంది.
ఈ విజయం తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా ఐదో స్థానానికి రావడంతో ప్లేఆఫ్స్ బెర్తుకు చేరువైంది. ప్రస్తుతం ఆ టీమ్ 12 మ్యాచ్ లు ఆడేసింది. ఆరు విజయాలు, ఆరు ఓటములతో క్యాపిటల్స్ 12 పాయింట్లు, -0.316 నెట్ రన్ రేట్ తో ఐదో స్థానంలో ఉంది. ఈ దెబ్బకు లక్నో సూపర్ జెయింట్స్ ఆరో స్థానానికి పడిపోయింది. ఆ టీమ్ ఖాతాలోనూ 12 పాయింట్లే ఉన్నా నెట్ రన్ రేట్ (-0.371) తక్కువగా ఉంది.
టాప్ 4లో ఎవరు?
ఐపీఎల్ 2024లో ప్రతి రోజూ పాయింట్ల టేబుల్లో టీమ్స్ స్థానాలు తారుమారు అవుతూనే ఉన్నాయి. దీంతో టాప్ 4లో ఎవరు ప్లేఆఫ్స్ కు క్వాలిఫై అవుతారన్నది చెప్పడం కష్టంగా మారుతోంది. ప్రస్తుతం కోల్‌కతా నైట్ రైడర్స్ 11 మ్యాచ్ లలో 8 విజయాలు, 16 పాయింట్లు, 1.453 నెట్ రన్ రేట్ తో టాప్ లో కొనసాగుతోంది. తర్వాత రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఉన్నాయి.
ఈ సీజన్లో మొదటి నుంచీ ఈ నాలుగు టీమ్సే టాప్ 4లో ఉంటూ వస్తున్నా.. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ లాంటి టీమ్స్ తో టాప్ 4లోని టీమ్స్ కు ముప్పు పొంచి ఉన్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ మాంచి ఊపు మీదుంది. చివరి ఐదు మ్యాచ్ లలో మూడు గెలిచింది. తాను ఆడబోయే మిగిలిన రెండు కూడా గెలిస్తే.. క్యాపిటల్స్ కు ప్లేఆఫ్స్ అవకాశాలు స్పష్టంగా ఉంటాయి.
చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లకు ఎక్కువ ప్రమాదంలో ఉన్నట్లు తాజాగా పాయింట్ల టేబుల్ చూస్తే తెలుస్తోంది. మరి ఈ రెండు టీమ్స్ ఎలా పుంజుకుంటాయో చూడాలి. లక్నో సూపర్ జెయింట్స్ తో బుధవారం (మే 8) సన్ రైజర్స్ కీలకమైన మ్యాచ్ ఆడబోతోంది. ఇందులో ఓడితే సన్ రైజర్స్ టాప్ 4 నుంచి దిగజారుతుంది. గెలిస్తే మూడో స్థానానికి చేరుతుంది.