DC vs RR: ఫ్రేజర్, పోరెల్ మెరుపులు.. ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు.. ఒకే ఓవర్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్స్‌లు-delhi capitals batters jake fraser mcgurk porel stunning hitting big target for rajasthan royals dc vs rr ipl 2024 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Dc Vs Rr: ఫ్రేజర్, పోరెల్ మెరుపులు.. ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు.. ఒకే ఓవర్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్స్‌లు

DC vs RR: ఫ్రేజర్, పోరెల్ మెరుపులు.. ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు.. ఒకే ఓవర్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్స్‌లు

Chatakonda Krishna Prakash HT Telugu
May 07, 2024 09:32 PM IST

DC vs RR IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్‍లో ఇరగదీసింది. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోరు చేసింది. ఢిల్లీ ఓపెనర్లు ఫ్రేజర్ మెక్‍గుర్క్, అభిషేక్ పోరెల్ అద్భుత హాఫ్ సెంచరీలు చేశారు.

DC vs RR: ఫ్రేజర్, పోరెల్ మెరుపులు.. ఢిల్లీ భారీ స్కోరు
DC vs RR: ఫ్రేజర్, పోరెల్ మెరుపులు.. ఢిల్లీ భారీ స్కోరు (AP)

DC vs RR IPL 2024: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ రేసులో నిలువాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్‍లో మెరిసింది. రాజస్థాన్ రాయల్స్‌తో పోరు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ సొంత గడ్డపై దుమ్మురేపింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నేటి (మే 7) మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్‍కు దిగిన డీసీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 221 పరుగుల భారీ స్కోరు చేసింది. మొదట్లో ఓపెనర్లు జేక్ ఫ్రేజర్ మెక్‍గుర్క్, అభిషేక్ పోరెల్ అర్ధ శతకాలతో మెరిపిస్తే.. చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ దుమ్మురేపాడు. రాజస్థాన్ ముందు భారీ టార్గెట్ నిలిచింది.

రెచ్చిపోయిన ఫ్రేజర్, పోరెల్

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‍కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు అద్భుతమైన ఆరంభం దక్కింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్, ఆస్ట్రేలియా యంగ్ స్టార్ జేక్ ఫ్రేజర్ మెక్‍గుర్క్ మరోసారి ధనాధన్ ఆటతో సత్తాచాటాడు. అభిషేక్ పోరెల్ కూడా దుమ్మురేపాడు. 20 బంతుల్లో 50 పరుగులతో ఫ్రేజర్ అర్ధ శకతంతో అదరగొట్టాడు. 7 ఫోర్లు, 3 సిక్స్‌లు బాదాడు. అభిషేక్ పోరెల్ 36 బంతుల్లోనే 65 పరుగులతో దూకుడు చూపాడు. 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో మెరిపించాడు. ఆరంభంలో మెక్‍గుర్క్ ఎడాపెడా బాదేశాడు. దీంతో 3.5 ఓవర్లలోనే ఢిల్లీ 50 పరుగులను క్రాస్ చేసింది. ఆవేశ్ ఖాన్ వేసిన నాలుగో ఓవర్లో 4,4,4,6,4,6తో వీర హిట్టింగ్ చేశాడు ఫ్రేజర్. నాలుగు ఫోర్లు, రెండు సిక్స్‌లతో ఆ ఓవర్లో 28 పరుగులు పిండుకున్నాడు. దీంతో ఐదో ఓవర్లోనే 19 బంతుల్లో ఫ్రేజర్ అర్ధ శకతం పూర్తి చేసుకున్నాడు ఫ్రేజర్ మెక్‍గుర్క్. అయితే, దూకుడుగా ఆడుతున్న అతడిని రాజస్థాన్ సీనియర్ స్పిన్నర్ అశ్విన్ ఔట్ చేసి.. బ్రేత్ త్రూ ఇచ్చాడు.

ఫ్రేజర్ ఔటయ్యాక అభిషేక్ పోరెల్ దుమ్మురేపాడు. వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టింటాడు. దీంతో 8.2 ఓవర్లోనే ఢిల్లీ స్కోరు 100 దాటింది. 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేరాడు పోరెల్. ఆ తర్వాత కాసేపు దూకుడుగా ఆడినా.. 13వ ఓవర్లో పోరెల్‍ను అశ్వినే పెవిలియన్ పంపాడు.

పంత్ విఫలం.. స్టబ్స్ మెరుపులు

పోరెల్ ఔటయ్యాక ఢిల్లీ స్కోరు బోర్డు వేగంగా ముందుకు కదలలేదు. అక్షర్ పటేల్ (15) త్వరగానే ఔటవగా.. కెప్టెన్ రిషబ్ పంత్ (13 బంతుల్లో 15) నెమ్మదిగా ఆడాడు. భారీ షాట్‍కు యత్నించి చాహల్ బౌలింగ్‍లో క్యాచ్ ఔటయ్యాడు. దీంతో ఢిల్లీకి పరుగుల రాక మందగించింది. అయితే, చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ 20 బంతుల్లోనే 41 పరుగులతో (3 ఫోర్లు, 3 సిక్స్‌లు) దుమ్మురేపాడు. ఢిల్లీ స్కోరు బోర్డును పరుగులు పెట్టింటాడు. చివరి ఓవర్లో ఔటయ్యాడు. గుల్బాదిన్ నైబ్ (19) పర్వాలేదనిపించాడు.

తిప్పేసిన అశ్విన్

ఈ సీజన్‍లో అంతగా ఫామ్‍లో లేని రాజస్థాన్ సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ మ్యాచ్‍లో మెరిశాడు. 4 ఓవర్లలో 24 పరుగులే ఇచ్చి 3 వికెట్లు దక్కించుకున్నాడు. ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజువేంద్ర చాహల్ తలా ఓ వికెట్ తీసుకున్నారు.

Whats_app_banner