Ashwin on Hardik Pandya: వాళ్ల ఫ్యాన్స్ ఎప్పుడైనా గొడవలు పడ్డారా?: హార్దిక్ విషయంలో స్పందించిన అశ్విన్
Ashwin on Hardik Pandya: ఐపీఎల్ 2024 సీజన్‍లో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ప్రేక్షకుల నుంచి చేదు అనుభవం ఎదురవుతోంది. రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్సీ చేపట్టిన అతడికి కొందరు ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత వస్తోంది. ఈ విషయంలో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు.
Ashwin on Hardik Pandya: ఐపీఎల్ 2024 సీజన్‍లో ముంబై ఇండియన్స్ జట్టు వ్యవహారం గందరగోళంగా మారింది. ఈ సీజన్ కోసం రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు ఆ బాధ్యతలను ఫ్రాంచైజీ అప్పగించింది. ముంబైకు ఐదు టైటిళ్లు సాధించిపెట్టిన రోహిత్‍ను కెప్టెన్సీ నుంచి తప్పించడం అతడి అభిమానులకు కోపం తెప్పించింది. దీంతో ఈ సీజన్‍లో హార్దిక్ పాండ్యాకు చేదు అనుభవం ఎదురవుతోంది. ఇప్పటి వరకు ఈ ఐపీఎల్ 2024 సీజన్‍లో ముంబై ఇండియన్స్ రెండు మ్యాచ్‍లు ఆడగా.. ప్రేక్షకులు చాలాసార్లు బూ అంటూ అరుస్తూ హార్దిక్‍పై అసంతృప్తి వ్యక్తం చేశారు. హర్దిక్ వచ్చినప్పుడు రోహిత్.. రోహిత్.. అని అరిచారు. అయితే, ఈ విషయంపై భారత సీనియర్ స్పిన్నర్, రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు.
ఫ్యాన్స్ వార్ అపండి
అభిమానులు ఫ్యాన్స్ వార్ ఆపాలని, ఇది ఘోరంగా మారుతోందని అశ్విన్ అన్నారు. క్రీడలు అంటే సినిమాలు కాదని చెప్పాడు. తమ ఫేవరెట్ ప్లేయర్ గురించి అభిమానులు గొప్పగా చెప్పుకోవచ్చని.. అయితే, అందుకోసం ఇతర ఆటగాళ్లను తక్కువ చేసి చూడకూడదని అశ్విన్ సూచించాడు. తన యూట్యూబ్ ఛానెల్ లైవ్ ఎనాలిసిస్‍లో హార్దిక్ పాండ్యా విషయంపై అశ్విన్ స్పందించాడు.
ఇతర దేశాల్లో క్రికెట్ ప్లేయర్ల అభిమానుల మధ్య ఇలాంటి గొడవలు లేవని, ఎక్కడైనా ఇలాంటివి చూశారా అని అశ్విన్ ప్రశ్నించాడు. “ఏ దేశంలో అయినా ఇలా జరగడం చూశారా? జో రూట్, జాక్ క్రాలీ ఫ్యాన్స్ ఫైట్ చేసుకోవడం చూశారా? జో రూట్, జాస్ బట్లర్ ఫ్యాన్స్ గొడవ పడడం గమనించారా? ఆస్ట్రేలియాలో ప్యాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్ ఫ్యాన్స్ ఫైట్ చూశారా? నేను చాలాసార్లు చెప్పాను.. ఇది క్రికెట్. అది సినిమా కల్చర్ (ఫ్యాన్ వార్స్). అభిమానుల మధ్య గొడవ ఎప్పటికీ హద్దులు దాటి అభ్యంతరకరంగా మారకూడదు. ఈ ఆటగాళ్లు (రోహిత్, హార్దిక్) ఏ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో గుర్తు పెట్టుకోవాలి. మన దేశానికే కదా.. అలాంటప్పుడు ఒక క్రికెటర్‌పై బూ అని అరవాలని ఎందుకు అనిపిస్తోంది?” అని అశ్విన్ చెప్పాడు.
ధోనీ కెప్టెన్సీలో దిగ్గజాలు ఆడలేదా?
భారత క్రికెట్‍లో తమ కంటే యువ ఆటగాళ్ల కెప్టెన్సీలో కొందరు దిగ్గజ ప్లేయర్లు ఆడారని రవిచంద్రన్ అశ్విన్ గుర్తు చేశాడు. ఆ సమయాల్లో ఎప్పుడూ ఇలా జరగలేదని అన్నాడు. “నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ మీకు ప్లేయర్ నచ్చక బూ అని అపిస్తే.. ఆ టీమ్ ఎందుకు వివరణ ఇవ్వాలి? ఇలాంటివి ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలో సౌరవ్ గంగూలీ ఆడాడు. గంగూలీ సారథ్యంలో సచిన్ ఆడాడు. వారిద్దరూ ద్రవిడ్ కెప్టెన్సీలో ఆడారు. ఆ ముగ్గురూ అనిల్ కుంబ్లే సారథ్యంలో బరిలోకి దిగారు. వారందరూ కూడా ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో ఆడారు. ధోనీ కెప్టెన్సీ చేస్తున్న సమయంలో వారందరూ చాలా పెద్ద ప్లేయర్లు. ధోనీ కూడా విరాట్ కెప్టెన్సీలో ఆడాడు” అని అశ్విన్ గుర్తు చేశాడు.
సినిమాలతో నిజమైన క్రీడలను పోల్చకూడదని రవిచంద్రన్ అశ్విన్ చెప్పాడు. ఇష్టమైన ప్లేయర్లను అభిమానులు ప్రశంసించవచ్చని.. కానీ ఇతర ఆటగాళ్లను తక్కువ చేయవద్దని కోరాడు. ఫ్యాన్ వార్స్ ఆపాలని అందరికీ సూచించాడు.
ఐపీఎల్ 2024లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‍ల్లో ఓడింది. గుజరాత్, హైదరాబాద్ చేతిలో పరాజయం పాలైంది. ఈ సీజన్‍లో తన తదుపరి మ్యాచ్‍ను ఏప్రిల్ 1న రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ముంబై ఆడనుంది.