Munugodu: రంగంలోకి కేసీఆర్, అమిత్ షా, రేవంత్ - ఇక నుంచే అసలు కథ!-political heat rise in munugodu over top leaders public meeting ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Munugodu: రంగంలోకి కేసీఆర్, అమిత్ షా, రేవంత్ - ఇక నుంచే అసలు కథ!

Munugodu: రంగంలోకి కేసీఆర్, అమిత్ షా, రేవంత్ - ఇక నుంచే అసలు కథ!

Mahendra Maheshwaram HT Telugu
Aug 19, 2022 08:52 PM IST

మునుగోడు గడ్డపై అగ్రనేతలు అడుగుపెట్టే సమయం అసన్నమైంది. శనివారం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. మరోవైపు కాంగ్రెస్ సారథి రేవంత్ రెడ్డి కూడా మునుగోడులో పర్యటించనున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం బీజేపీ తలపెట్టిన భారీ బహిరంగ సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాల్గొననున్నారు.

<p>మునుగోడు ఉప ఎన్నిక</p>
మునుగోడు ఉప ఎన్నిక (HT)

Munugodu political war: మునుగోడు.... రాజకీయ యుద్ధానికి వేదికైన నేపథ్యంలో అగ్రనేతలు రంగంలోకి దిగబోతున్నారు. ఇప్పటి వరకు పార్టీ కార్యాలయాల్లోనే చర్చలు, వ్యూహాలు, కౌంటర్లు, చేరికలపై వర్కౌట్ చేసిన పార్టీ రథ సారథలు... ఇక నేరుగా గ్రౌండ్ లోకి వచ్చేస్తున్నారు. ఫలితంగా మునుగోడు బరి... బస్తీమే సవాల్ గా మారబోతుంది. అగ్రనేతల రాకతో సరైన ఆట మొదలకావటం ఖాయంగా కనిపిస్తోంది.

కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు..?

kcr meeting in munugodu: శనివారం టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను తలపెట్టింది. మునుగోడు వేదికగా జరగబోయే సభకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ హాజరుకాబోతున్నారు. ఈ నేపథ్యంలో గులాబీ దళపతి ప్రసంగం అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. అసలు ఆయన ఎవర్ని టార్గెట్ చేయబోతున్నారు..? వరాల జల్లు కురిపిస్తారా..? ఏకంగా అభ్యర్థిని ప్రకటించి... యుద్ధానికి సిద్ధమంటూ సవాల్ విసురుతారా అన్న చర్చ జోరుగా జరుగుతోంది. ఇప్పటికే జిల్లా నేతలు... ఏర్పాట్లను దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. లక్ష మందితో సభ నిర్వహించి... కాంగ్రెస్, బీజేపీకి తమ సత్తా ఏంటో చూపాలని చూస్తున్నారు.

రేవంత్ రెడ్డి రాక...

ఇప్పటికే చండూరు సభతో ఎంట్రీ ఇచ్చిన కాంగ్రెస్... ఓ దఫా పాదయాత్ర కూడా చేపట్టింది. అయితే ఈ పాదయాత్రలో రేవంత్ పాల్గొంటారని అందరూ భావించినప్పటికీ అనారోగ్య కారణంగా ఆయన రాలేదు. అయితే 20 నుంచి మునుగోడులోనే ఉంటానంటూ రేవంత్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో శనివారమే ఆయన కూడా.... మునుగోడులో ల్యాండ్ కాబోతున్నారు. శనివారం నుంచే మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. ఒకే రోజు 5 మండలాల్లో పాదయాత్రకు ప్లాన్‌ చేశారు. ఇక అదే సమయంలో నియోజకవర్గంలోని 175 గ్రామాల్లో కాంగ్రెస్‌ శ్రేణులు పాదయాత్రలు చేయనున్నారు. ఈ నెల 21 నుంచి మండలాల వారీగా రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. రేపు రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలోని... 175 గ్రామాల్లో జయంతి వేడుకలు నిర్వహించనుంది హస్తం పార్టీ.

బీజేపీ సభ - అమిత్ షా ఆగయా

bjp meeting in munugodu: ఇప్పటికే మునుగోడుపై ఫోకస్ పెట్టి చేరికలతో జోష్ నింపుతున్న బీజేపీ... ఆదివారం భారీ బహిరంగ సభను నిర్వహించబోతుంది. అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరబోతున్నారు. మండలాల వారీగా ఇంఛార్జ్ లను ప్రకటించిన ఆ పార్టీ నాయకత్వం... సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని భావిస్తోంది. అమిత్ షా ఎంట్రీతో... ఉప ఎన్నిక యుద్ధానికి సమరశంఖం పూరించాలని చూస్తోంది. టీఆర్ఎస్ సభ కంటే భారీగా జనాలను తరలించి... బలమైన సందేశాన్ని ఇవ్వాలని వ్యూహాలు రచిస్తోంది.

మొత్తంగా ప్రధాన పార్టీలుగా ఉన్న టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకి చెందిన కీలక నేతలు నేరుగా గ్రౌండ్ లోకి అడుగుపెట్టబోతున్న క్రమంలో మాటల తుటాలు పేలటం ఖాయంగా కనిపిస్తోంది. కేసీఆర్ స్పీచ్ పై కాంగ్రెస్, బీజేపీ ఎలా స్పందిస్తాయో అన్న చర్చ మొదలైంది. ఇప్పటి వరకు ఓ దశలో సాగుతున్న మునుగోడు రాజకీయం.... రేపటితో మరో లెవల్ కి వెళ్లటం పక్కాగా కనిపిస్తోంది.

Whats_app_banner