KCR Strategy: మునుగోడులో కేసీఆర్ వ్యూహం సక్సెస్ ..! నెక్స్ట్ కూడా అలాగేనట..!-trs chief kcr implemented different strategy in munugodu bypoll ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Trs Chief Kcr Implemented Different Strategy In Munugodu Bypoll

KCR Strategy: మునుగోడులో కేసీఆర్ వ్యూహం సక్సెస్ ..! నెక్స్ట్ కూడా అలాగేనట..!

Mahendra Maheshwaram HT Telugu
Nov 09, 2022 06:05 AM IST

TRS Strategy: మునుగోడు విషయంలో కేసీఆర్ ముందునుంచే ఓ క్లారిటీతో ఉన్నారు. గ్రౌండ్ లోని పరిస్థితులను పక్కాగా అంచనా వేసిన ఆయన... పార్టీ గెలుపు విషయంలో క్లియర్ కట్ గా వ్యూహన్ని అమలు చేశారనేది స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇదే స్ట్రాటజీని రాబోయే ఎన్నికల్లోనూ అమలు చేసే దిశగా పావులు కదిపే పనిలో ఉన్నారట గులాబీ బాస్..!

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (ఫైల్ ఫొటో)
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (ఫైల్ ఫొటో) (twitter)

KCR Strategy in Telangana: కేసీఆర్..... వ్యూహాలు రచించటంలో దిట్ట..! తన ఎత్తులు పైఎత్తులతో ప్రత్యర్థులను చిత్తు చేసే గులాబీ బాస్... మునుగోడు విషయంలోనూ ఓ క్లారిటీతోనే పావులు కదిపారట..! రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత పరిణామాలను పక్కాగా అంచనా వేసిన ఆయన... అభ్యర్థి ఎంపిక, ప్రచారంలో అనుసరించాల్సిన పద్ధతులు, ప్రత్యర్థి బలబలాల విషయంలోనూ ఓ క్లారిటీతో కార్యాచరణను రూపొందించారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఓ అంశంలో మాత్రం ఆయన వ్యూహం పక్కాగా వర్కౌట్ అయిందనే టాక్ వినిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లోనూ ఇదే ప్లాన్ తో ముందుకు వస్తారని తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరి పదవికి రాజీనామా చేస్తారని, ఉప ఎన్నికలు వస్తాయన్న అంచనాలతో కొన్ని నెలల ముందు నుంచే మునుగోడుపై దృష్టి కేంద్రీకరించారు కేసీఆర్. 2018 ఎన్నికల్లో కోల్పోయిన ఈ స్థానాన్ని తిరిగి సొంతం చేసుకోవాలని... గతంలో దుబ్బాక, హుజూరాబాద్‌లో ఎదురైన అనుభవాలను గుణపాఠంగా తీసుకొని పక్కా వ్యూహంతో అడుగులు వేయాలని భావించారు. ఈ సీటును అనేకమంది నేతలు ఆశించినప్పటికీ వాళ్లను కాదని 2014లో ఇక్కడ గెలుపొందిన కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డినే అభ్యర్థిగా రంగంలోకి దింపారు కేసీఆర్. అయితే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఎంపిక చేసుకుని ముందుకు సాగడంపై మొదట్లో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. టీఆర్ఎస్ స్థానిక నేతలు వ్యతిరేకించినా.. కేసీఆర్ మాత్రం వెనక్కి తగ్గలేదు. అంతిమంగా మునుగోడు సీటు టీఆర్ఎస్ ఖాతాలో పడింది.

మునుగోడులో అభ్యర్థి ప్రకటనను జాప్యం చేయటంలోనూ ఓ లెక్క ఉందట..! అభ్యర్థి పేరుపై కాకుండా... టీఆర్ఎస్ అన్నట్లే పోరు జరగాలని కేసీఆర్ భావించారట..! అందుకు అనుగుణంగానే... అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించారు. అంతలోపే టీఆర్ఎస్ ప్రచారాన్ని హోరెత్తించే పనిలో పడింది. ఫైనల్ గా కూడా టీఆర్ఎస్ వర్సెస్ రాజగోపాల్ రెడ్డి అన్నట్లుగానే పరిస్థితి ఏర్పడింది. తాజాగా మునుగోడులో ప్రభాకర్ రెడ్డి గెలుపు పూర్తిగా టీఆర్ఎస్ విజయం మాత్రమే అన్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

టీఆర్ఎస్ పై ప్రజల్లో నమ్మకం కలిగించటమే లక్ష్యంగా కేసీఆర్ పావులు కదుపుతుంటే... బీజేపీ మాత్రం బలమైన అభ్యర్థులను ఎంపిక చేసుకుని ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. హుజురాబాద్ లో ఈటల, మునుగోడులో రాజగోపాల్ రెడ్డి వంటి బలమైన నేతలపై ఆధారపడి బరిలోకి దిగింది. అదే హుజుర్ నగర్, నాగార్జున సాగర్ లో పరిస్థితేంటో అందరికీ తెలుసు..! ఇక్కడే కేసీఆర్... సక్సెస్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. అభ్యర్థులు కాకుండా... టీఆర్ఎస్ సర్కార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పాటు కేసీఆర్ ఇమేజ్ తోనే ఎన్నికల బరిలోకి దిగేలా ప్లాన్ చేస్తున్నారట..! నిజానికి 2018 ఎన్నికల్లోనూ ఇదే ఫార్మూలాను తెరపైకి తీసుకువచ్చారు. ప్రతిచోట కేసీఆరే అభ్యర్థి అన్నట్లు సీన్ క్రియేట్ చేశారు. సో... బంపర్ మెజార్టీని సొంతం చేసుకున్నారు. ఇక మునుగోడులో చాలా మంది కూసుకుంట్లను తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ.... ఆయన్నే అభ్యర్థిగా దింపి... విక్టరీని సొంతం చేసుకున్నారు గులాబీ బాస్.

WhatsApp channel