Telugu News  /  Telangana  /  No Sitting Mla Dares To Resign In The Remaining Period Due To Munugode Results Impact
మునుగోడు ఉప ఎన్నికలో ఆశించని ఫలితం రాకపోవడంతో బీజేపీలో నిరాశ
మునుగోడు ఉప ఎన్నికలో ఆశించని ఫలితం రాకపోవడంతో బీజేపీలో నిరాశ (HT_PRINT)

Telangana Politics: ఇక ఉప ఎన్నికలు ఉండవా? మునుగోడు ఫలితం ఏం చెబుతోంది?

08 November 2022, 7:48 ISTHT Telugu Desk
08 November 2022, 7:48 IST

మునుగోడులో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి మరీ మునుగోడులో కోరి ఉప ఎన్నిక తెచ్చుకున్నారు. కానీ ఫలితం షాక్ ఇచ్చింది.

తెలంగాణ రాజకీయాల్లో ఉప ఎన్నికలకు చాలా ప్రాముఖ్యత వచ్చింది. ఉప ఎన్నికలు అనివార్యమయ్యే రాజకీయ పరిస్థితులను సృష్టించి, వాటి ఫలితాలను తమ వాదనలకు అనుగుణంగా వాడుకున్న సందర్భాలు తెలంగాణ ఉద్యమంలో కీలకమైలు రాళ్లుగా నిలిచాయి. ఇలాంటి వాటిలో 2006లో జరిగిన కరీంనగర్ ఉప ఎన్నిక చాలా కీలకమైంది. తెలంగాణ వాదం కోసం రాజీనామా చేసి కరీంనగర్‌ ఉప ఎన్నికలో కేసీఆర్ గెలిచారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మరింత బలపడేందుకు, తమ వాదనలకు బలం చేకూర్చేందుకు కేసీఆర్ తీసుకున్న నిర్ణయం దోహదపడింది. ఇలాంటి సందర్భాలు తెలంగాణలో పునరావృతమయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు

దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కమలం గెలవడంతో అదే ఫార్ములాను ఉపయోగించి మరికొన్ని నియోజకవర్గాల్లో పాగా వేయాలని బీజేపీ భావించింది. చాలా రోజులుగా కాంగ్రెస్‌ నాయకత్వంపై విమర్శలు చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఆకర్షించింది. పార్టీలో చేరితే ఉప ఎన్నిక ఎదుర్కోవాలని సూచించింది. ఆ సమయంలో మరికొందరు ఎమ్మెల్యేలు కూడా రాజగోపాల్ రెడ్డి వెంట వస్తారని ఆశించింది. రాజగోపాల్ రెడ్డి కూడా తాను గెలిస్తే తెలంగాణ బీజేపీలో కీలక పాత్ర దక్కుతుందని ఆశించారు.

కానీ మునుగోడు ఉప ఎన్నిక ఫలితం రాజగోపాల్ రెడ్డిని, బీజేపీని నివ్వెర పరిచింది. హుజురాబాద్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఈటెల రాజేందర్ బీజేపీ నుంచి గెలుపొందారు. కానీ మునుగోడులో సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. హుజురాబాద్, దుబ్బాక స్థానాల్లో తమ అభ్యర్థులపై ఉన్న సానుభూతి, ప్రత్యర్థులు బలహీనంగా ఉండడం వంటి కారణాల వల్ల బీజేపీకి గెలుపు సాధ్యమైంది. మునుగోడులో బలమైన అభ్యర్థి ఉన్నప్పటికీ, 8 ఏళ్ల అనంతరం ప్రభుత్వ వ్యతిరేకతకు అవకాశాలు ఉన్నప్పటికీ బీజేపీ అభ్యర్థి గెలవలేకపోయారు. దీంతో తాము ఆశించిన ఫలితాన్ని బీజేపీ సాధించలేకపోయింది. వ్యక్తిగతంగా ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నష్టమే అయినప్పటికీ.. బీజేపీకి ఇది చాలా నష్టం. తాము రెండో స్థానానికి ఎదిగామని సమర్థించుకునే ఆస్కారం ఉంటుంది. కానీ పార్టీ విస్తరణకు ఇది సరిపోదు. రాజగోపాల్ రెడ్డి వంటి బలమైన అభ్యర్థులే గెలవకపోతే టీఆర్ఎస్‌ను ఢీకొట్టే బలమైన అభ్యర్థులను రాష్ట్రవ్యాప్తంగా సమీకరించుకోవడం ఆ పార్టీకి సాధ్యం కాదు.

రాజగోపాల్ రెడ్డి ఉప ఎన్నికలో గెలిస్తే మరికొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఆకట్టుకుని ఉప ఎన్నికలను అనివార్యమయ్యే పరిస్థితి సృష్టించాలని బీజేపీ భావించిందని విపక్షాలు పలుమార్లు ఆరోపించాయి. అయితే ఎన్నికలు మరొక ఏడాదిలోపే ఉండడంతో ఇక ఉప ఎన్నికలకు సాహసించే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండరు. ఈ కారణంతో బీజేపీకి భారీ వలసలకు బ్రేక్ పడ్డట్టు అవుతుంది. ఇంకోవైపు అసెంబ్లీ కాలపరిమితి ఏడాది మాత్రమే ఉంటే.. సీటు ఖాళీ అయినా ఎన్నికల సంఘం ఎన్నిక నిర్వహించదు. సాధారణంగా 6 నెలల్లోపు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. కానీ అసెంబ్లీ కాలపరిమతి ఏడాది మాత్రమే ఉంటే ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పని ఉండదు. ఈలెక్కన తెలంగాణలో శాసనసభ్యుల రాజీనామా ఉన్నా ఉప ఎన్నిక జరిగే పరిస్థితి ఉండదు.