TRS Win in Munugodu: మునుగోడులో టీఆర్ఎస్ ఎలా గెలిచింది..? కారణాలేంటి..?-what are the reasons for trs party win in munugodu by poll 2022 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Trs Win In Munugodu: మునుగోడులో టీఆర్ఎస్ ఎలా గెలిచింది..? కారణాలేంటి..?

TRS Win in Munugodu: మునుగోడులో టీఆర్ఎస్ ఎలా గెలిచింది..? కారణాలేంటి..?

HT Telugu Desk HT Telugu
Nov 06, 2022 05:23 PM IST

Munugodu Bypoll Results 2022: మునుగోడులో టీఆర్ఎస్ విక్టరీ కొట్టింది. ప్రతిష్టాత్మక పోరులో గులాబీ పార్టీ గుబాళించింది. అసలు టీఆర్ఎస్ గెలుపునకు ప్రధాన కారణాలేంటి..? అనుకున్నట్లే కామ్రేడ్లు కలిసివచ్చారా..? సంక్షేమ పథకాలే గట్టెక్కించాయా..? అనే వాటిపై ఓ లుక్కేద్దాం…..

మునుగోడులో టీఆర్ఎస్ విజయం
మునుగోడులో టీఆర్ఎస్ విజయం

TRS Win in Munugodu Bypoll 2022: మునుగోడు.... తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తిని రేపిన ఉపఎన్నిక. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో వచ్చిన ఈ ఎన్నిక... టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకే కాకుండా బీజేపీకి పెద్ద సవాల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికను అధికార టీఆర్ఎస్ మాత్రం... అత్యంత సీరియస్ గా తీసుకుంది. భారీగా నేతలను మోహరించింది. ఏ మాత్రం పట్టు సడలించకుండా పని చేసింది. ఫలితంగా మునుగోడు గడ్డపై మరోసారి గులాబీ జెండాను ఎగరవేసింది. అయితే దీని వెనక గులాబీ బాస్ కేసీఆర్... పెద్ద కసరత్తే చేశారు. అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తూ... బీజేపీని డిఫెన్స్ లో పడేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అయితే మునుగోడులో టీఆర్ఎస్ విజయం సాధించడానికి గల ప్రధాన కారణాలను కొన్నింటిని చూస్తే.....

పక్కా వ్యూహం...

రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఇవ్వగానే స్పీకర్ క్షణాల్లోనే ఆమోదముద్ర వేసేశారు. ఆయన రాజీనామా ఇవ్వటానికి ముందే టీఆర్ఎస్ అలర్ట్ అయింది. గ్రౌండ్ లోకి మంత్రి జగదీశ్ రెడ్డిని రంగంలోకి దింపింది. నేతలందర్నీ అప్రమత్తం చేసింది. కూసుకుంట్ల కూడా ప్రతి పల్లెను చుట్టేడయంలో బిజీ అయ్యారు. కళ్యాణలక్ష్మీతో పాటు ఇతర చెక్కుల పంపిణీనిలోనూ స్పీడ్ పెంచింది. సంక్షేమ పథకాల అమలు, దళిత బంధు, గిరిజన బంధు వంటి పథకాలపై చర్చ జరిగేలా చేసింది. ప్రగతి భవన్ వేదికగా గులాబీ బాస్ కేసీఆర్... ఎప్పటికప్పుడూ నేతల నుంచి సమాచారం తీసుకున్నారు. నల్గొండ జిల్లా నేతలతోనూ భేటీ అయ్యారు. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.

ఇక అభ్యర్థి ప్రకటన విషయంలోనూ టీఆర్ఎస్ సుదీర్ఘ కసరత్తే చేసింది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు కనిపించింది. చాలా మండలాల్లోని నేతలు... ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. ఈ క్రమంలోననే పలువురు అభ్యర్థుల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ.. సర్వేల ఆధారంగా కూసుకుంట్లకే టికెట్ ప్రకటించింది టీఆర్ఎస్. ఇదే సమయంలో అసంతృప్తులను దారిలోకి తీసుకవచ్చే ప్రయత్నం చేసింది. ప్రగతి భవన్ వేదికగా బుజ్జగింపుల పర్వం కూడా కొనసాగింది. ఇక మంత్రి జగదీశ్ రెడ్డి కూడా... సదరు నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ శాంతింపజేశారు. అంతర్గత పోరును నియంత్రించటంలో టీఆర్ఎస్ అధినాయకత్వం సక్సెస్ అయిందనే చెప్పొచ్చు.

సంక్షేమ పథకాలే అజెండా...

ఇక సంక్షేమ పథకాలను బలంగా నమ్ముకుంది టీఆర్ఎస్. రైతుబంధు, రైతుబీమా, ఆసరా పెన్షన్లపై ప్రధానంగా ఫోకస్ చేసింది. ఇదే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ప్రతి సభలోనూ ఈ విషయాలనే ప్రస్తావిస్తూ వచ్చారు. ఇక మోటర్లకు మీటర్లు రావొద్దంటే టీఆర్ఎస్ ను గెలిపించాలంటూ రైతులను ఆలోచనలో పడేసింది. ఈ అంశాన్ని ఆ పార్టీ అధినేత కేసీఆర్ కూడా పదే పదే చెప్పారు.

కేసీఆర్ సభలు..!

గతంలో జరిగిన దుబ్బాక, హుజురాబాద్ లో ప్రచారం చేయని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్... మునుగోడుకు మాత్రం రెండుసార్లు వచ్చారు. బహిరంగ సభలో పాల్గొన్నారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి తమతోనే సాధ్యమని చెప్పారు. గెలిపిస్తే... ఇక్కడి డిమాండ్లను నెరవేర్చేస్తామని హామీనిచ్చారు. చండూరు రెవెన్యూ డివిజన్, శివన్నగూడెం, కిష్టారాయంపల్లి రిజర్వాయర్ల ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

కలిసివచ్చిన కామేడ్ల్రు....

ఈ ఎన్నికలో కమ్యూనిస్టు పార్టీలు... టీఆర్ఎస్ కు మద్దతునిచ్చాయి. నాటి నుంచి ఇక్కడ అత్యంత బలంగా ఉండే కమ్యూనిస్టులు పార్టీలు క్రమంగా బలహీనపడుతూ వచ్చాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అభ్యర్థిని నిలబెడితే బీజేపీకి కలిసివచ్చే అవకాశం ఉందని భావించిన ఆ పార్టీ... టీఆర్ఎస్ వైపు నిలిచింది. సీపీఐ, సీపీయం పార్టీలు కూడా సీరియస్ గా ప్రచారం చేశాయి. బీజేపీ టార్గెట్ గా తెగ ప్రచారం చేస్తూ వచ్చింది. టీఆర్ఎస్ గెలుపులో కామ్రేడ్ల ఓట్లు అత్యంక కీలకమనే చెప్పొచ్చు.

పోల్ మేనేజ్ మెంట్ పై గురి...

ఇక పోల్ మేనేజ్మెంట్ లో టీఆర్ఎస్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఇందుకోసం భారీగా ఆ పార్టీ ప్రజాప్రతినిధులను మోహరించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లను గ్రామాలు, వార్డులకు ఇంఛార్జ్ లు గా నియమించింది. నెల రోజులకు పైగా స్థానికంగా మోహరించిన వీరు... స్థానిక నాయత్వంలో కలిసి పని చేసేలా కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా... ప్రతి ఓటర్ ను కలిసే ప్రయత్నం చేసింది. ప్రతి గడపకు వెళ్లటం కూడా టీఆర్ఎస్ కు కలిసివచ్చిందనే చెప్పొచ్చు. పోలింగ్ ప్రక్రియ ముగిసే అంతవరకు కూడా… అలర్ట్ గా ఉన్నారు. ఎప్పటికప్పుడు స్థానిక నేతలను అప్రమత్తం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో పోలింగ్ విషయంలో అత్యంత జాగ్రత్త వహించింది.

కేటీఆర్ దత్తత హామీ....

ఇక తమను గెలిపిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇవ్వటం కూడా టీఆర్ఎస్ కు బాగా కలిసివచ్చింది. అభివృద్ధి విషయంలో వెనకిపడిన తమ ప్రాంతం అభివృద్ధి అవుతుందని ఓటర్లు ఆలోచించినట్లు కూడా తెలుస్తోంది. కేటీఆర్ ఇచ్చిన హామీని కూడా ఆ పార్టీ శ్రేణులు బలంగా తీసుకెళ్లాయి. ఈ అంశంపై టీఆర్ఎస్ కలిసివచ్చింది.

మరోవైపు కుల సంఘాల సమ్మేళనాలు కూడా… టీఆర్ఎస్ కు బలం చేకూర్చిందనే చెప్పొచ్చు. మునుగోడులో అత్యధికంగా ఉండేది బీసీ ఓటర్లు. ఈ నేపథ్యంలో... బలంగా ఉన్న గౌడ్, ముదిరాజ్, పద్మశాలి, యాదవ సామాజికవర్గాలతో సమ్మేళనాలను నిర్వహించింది. ఆయా సంఘాలకు కీలక హామీలు ఇచ్చింది. టీఆర్ఎస్ గెలుపు ఆవశ్యకతను వివరించే ప్రయత్నం చేసింది. ఈ బాధ్యతలను మంత్రి కేటీఆర్ దగ్గరుండి చూశారు. వీరిలో మెజార్టీ ప్రజలు… టీఆర్ఎస్ వైపు నిలిచినట్లు తెలుస్తోంది.

టీఆర్ఎస్ లోకి చేరికలు...

ఇక బూర నర్సయ్య గౌడ్ రాజీనామా టీఆర్ఎస్ గట్టిషాక్ లా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వెంటనే అలర్ట్ అయిన టీఆర్ఎస్ అధినాయకత్వం... బీజేపీ నేతలపై గురి పెట్టింది. బీసీ సామాజికవర్గాలకు చెందిన స్వామి గౌడ్, బిక్షమయ్య గౌడ్, దాసోజు శ్రవణ్, రాపోల్ ఆనంద భాస్కర్ వంటి నేతలను పార్టీలోకి రప్పించింది. ఫలితంగా ఓ పాజిటివ్ వేవ్ ను క్రియేట్ చేయగలిగింది. ఈ పరిణామం బీజేపీకి భారీ షాక్ నే ఇచ్చిందని చెప్పొచ్చు.

గతంలో రోటీ మేకర్, రోడ్డు రోలర్ గుర్తులు టీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టాన్ని చేకూర్చాయి. ఈ గుర్తులకు భారీగా ఓట్లు నమోదయ్యాయి. అయితే మునుగోడులో ఇలా జరగకూడదని భావించిన టీఆర్ఎస్... మొదట్నుంచే అప్రమత్తమైంది. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లింది. ఇక ఓటర్లు గందరగోళానికి గురికాకుండా.. డమ్మీ ఈవీఎంలతో ప్రచారం మొదలుపెట్టింది. ఓటర్ల వద్దకు తీసుకెళ్లి... ఎక్కడా వేయాలి..? పార్టీ గుర్తు నెంబర్ ఏంటనే విషయాలపై విస్తృతంగా ప్రచారం చేసింది. మొత్తంగా పక్కా ప్లాన్ తో ముందుకెళ్లిన టీఆర్ఎస్... విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన మూడో ఉపఎన్నికలోనూ గెలిచి... తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించటంపై ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

టీ20 వరల్డ్ కప్ 2024