Telangana High Court : గ్రూప్-1 మెయిన్స్‌కు లైన్ క్లియర్.. సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించిన హైకోర్టు డివిజన్ బెంచ్
Telangana High Court : గ్రూప్-1 మెయిన్స్‌కు లైన్ క్లియర్ అయ్యింది. తాజాగా తెలంగాణ హైకోర్టు మెయిన్స్ పరీక్షల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్ 1 వ్యవహారంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును.. డివిజన్ బెంచ్ సమర్థిస్తూ.. నిర్ణయం వెల్లడించింది. దీంతో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్‌కు లైన్ క్లియర్ అయ్యింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. గ్రూప్-1 పరీక్షపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. దీంతో షెడ్యూల్ ప్రకారమే ఈనెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయని తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ అధికారులు స్పష్టం చేశారు.
అయితే.. తెలంగాణ గ్రూప్1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై న్యాయవిదాలు కొనసాగుతున్నాయి. సోమవారం నుంచి ప్రారంభం కానున్న మెయిన్స్ పరీక్షల్ని వాయిదా వేయాలంటూ న్యాయవాది మోహిత్ రావు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై విచారణను సోమవారం చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఇటు గ్రూప్స్ అభ్యర్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వారికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రకటించారు. గ్రూప్-1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. గ్రూప్-1 అభ్యర్థులపై లాఠీఛార్జ్ చేయడం దారుణమన్న బండి.. న్యాయం కోరితే రక్తం కళ్లజూస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు.. జీవో 29 గొడ్డలిపెట్టు అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
మరోవైపు తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 21 నుంచి 27 వరకు గ్రూప్-1 పరీక్షలు జరుగుతాయని షెడ్యూల్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 46 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో.. పరీక్షా కేంద్రాల దగ్గర పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
టీజీపీఎస్సీ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తుంటే.. హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. గల్లీల్లో కొందరిని పోలీసులు లాఠీలతో కొట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసుల లాఠీ ఛార్జ్‌తో అశోక్ నగర్ ఏరియాలో టెన్షన్ వాతావరణం నెలకొంది.