Vijayawada : అంబులెన్స్‌లో భక్తులు.. అవాక్కైన పోలీసులు.. అసలు కథ ఇదీ!-108 staff moved the devotees in an ambulance in vijayawada ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vijayawada : అంబులెన్స్‌లో భక్తులు.. అవాక్కైన పోలీసులు.. అసలు కథ ఇదీ!

Vijayawada : అంబులెన్స్‌లో భక్తులు.. అవాక్కైన పోలీసులు.. అసలు కథ ఇదీ!

Basani Shiva Kumar HT Telugu
Oct 12, 2024 05:45 PM IST

Vijayawada : విజయవాడలో నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. అటు పోలీసులు అమ్మవారి ఆలయం వద్ద ఆంక్షలు విధించారు. ఈ సమయంలో ఓ అంబులెన్స్ అక్కడికి వచ్చి ఆగింది. దాంట్లో నుంచి కొందరు కిందకు దిగారు. అసలు విషయం తెలిసి పోలీసులు అవాక్కయ్యారు.

108 వాహనంలో భక్తులు
108 వాహనంలో భక్తులు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై విజయదశమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దసరా రోజున అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీ నేపథ్యంలో.. పోలీసులు ఆలయ పరిసరాలకు వాహనాలను అనుమతించడం లేదు. ఆంక్షలు విధించారు. కేవలం అత్యవసరం వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు.

సరిగ్గా ఇదే సమయంలో ఆలయం దగ్గరకు ఓ అంబులెన్స్ వచ్చింది. దాంట్లో చాలామంది ఉన్నారు. అనుమానం వచ్చి 108 వాహనాన్ని ఘాట్ రోడ్డు ఎంట్రన్స్‌లో పోలీసులు ఆపారు. తనిఖీ చేయగా.. అంబులెన్స్‌లో భక్తులను గుర్తించిన కంగుతిన్నారు. చాలామంది భక్తులు 108 వాహనం నుంచి కిందకు దిగారు. దీంతో పోలీసులు, అక్కడున్న అధికారులు ముక్కున వేలేసుకున్నారు.

మూడు నెలలుగా జీతాల్లేవ్..

అయితే.. ఈ విషయం గురించి 108 సిబ్బందిని ప్రశ్నించగా.. తమకు మూడు నెలల నుంచి జీతాలు రావడం లేదని వాపోయారు. ప్రభుత్వం జీతాలు ఇవ్వని కారణంగా.. డబ్బుల కోసం ఇలా భక్తులను తరలించామని చెబుతున్నారు. భక్తులు డబ్బులు ఇస్తే.. వాటితో పండగ ఖర్చులు వెళ్లదీసుకోవచ్చనే ఇలా చేశామని 108 వాహన సిబ్బంది వివరించారు.

ఈసారి బ్రేక్..

ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలు చివ‌రి రోజు అమ్మవారు కృష్ణా నదిలో హంస వాహనంపై విహరిస్తారు. ఆన‌వాయితీగా జ‌రిగే దుర్గామల్లేశ్వరుల తెప్పోత్సవానికి ఈసారి బ్రేక్ ప‌డింది. కృష్ణానదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పాటు పైనుంచి సుమారు 40 వేల క్యూసెక్కుల వరద వస్తుండటంతో విహారం రద్దు చేసిన‌ట్లు అధికారుల స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం భక్తులకు కన్నుల పండువగా సాగే హంస వాహనం కృష్ణానది నీటి ప్రవాహంతో రద్దు కావ‌డంతో భ‌క్తులు నిరాశ చెందుతున్నారు.

విజ‌య‌వాడ ఇంద్రకీలాద్రి వ‌ద్ద శ్రీ‌దేవి శ‌ర‌న్నవ‌రాత్రి ఉత్సవాలు చివ‌రి ద‌శ‌కు చేరుకున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ప‌దో రోజు శ్రీ‌రాజ‌రాజేశ్వరీ దేవిగా క‌న‌క‌దుర్గమ్మ భ‌క్తుల‌కు ద‌ర్శన‌మిస్తున్నారు. విజ‌య‌ద‌శ‌మి ఉత్సవాల చివ‌రి రోజు కావ‌డంతో భ‌క్తులు భారీగా ఇంద్రకీలాద్రి వైపు త‌ర‌లివ‌చ్చి అమ్మవారిని ద‌ర్శించుకుంటాన్నారు. ఈసారి భ‌వానీలు ముందుగానే ఇంద్రకీలాద్రికి చేరుకోవ‌డం విశేషం. కొండ దిగువ నుంచి భ‌క్తులు కిట‌కిట‌లాడుతూ “జైదుర్గ...జైజై దుర్గ” నామ‌స్మర‌ణ‌తో ముందుకు సాగుతున్నారు.

Whats_app_banner