Kokapet Land Auction : కోకాపేట భూములకు రికార్డు ధర.. ఎకరం రూ.100 కోట్లు
Kokapet Land Auction in Hyderabad: కోకాపేట భూముల ధరలు కేక పుట్టిస్తున్నాయి. అంచనాలకు మించి రేట్లు పలుకుతున్నాయి. గురువార హెచ్‌ఎండీఏ చేపట్టిన భూముల అమ్మక ప్రక్రియలో రికార్డుస్థాయి ధర పలికింది.
HMDA Kokapet Lands: భూముల వేలంలో కోకాపేట కేక పుట్టిస్తోంది. ప్రభుత్వం చేపట్టిన వేలం ప్రక్రియలో హాట్ కేకుల్లా ప్లాట్లు అమ్ముడుపోతున్నాయి. అంతేకాదు... రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. గురువారం రెండో విడత కింద భూముల వేలం చేపట్టింది హెచ్ఎండీ. ఫేజ్ 2లో భాగంగా భాగంగా 6,7,8,9 ప్లాట్లకు వేలం వేసింది. గజం ధర సరాసరి రూ.1.5 లక్షలగా ఉంది. ఈ లెక్కన ఎకరం భూమికి రూ. 35 కోట్లుగా ధరను నిర్ణయించింది హెచ్ఎండీఏ. ఈ వేలం ప్రక్రియలో అత్యధికంగా ఎకరం భూమి ధర రూ. 100 కోట్లుగా పలికింది. ప్లాట్ నంబర్ 10కి ఎకరానికి రూ. వంద కోట్ల బిడ్ దాఖలైంది.
గురువారం సాయంత్రం 6 గంటల వరకు 18.47 ఎకరాలకు వేలం నిర్వహించింది హెచ్ఎండీఏ. నియో పోలిస్‌లోని 9, 10, 11, 14 ప్లాట్లకు వేలం కొనసాగింది. మొత్తంగా 45 ఎకరాల్లో ఉన్న ఏడు ప్లాట్‌లతో రూ.3,319 వేల కోట్లను ఆర్జించింది. ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధరనే రూ. 35 కోట్లుగా ఉంది. కోకాపేట నియోపోలీస్ లే అవుట్‌లోని భూముల వివరాలు చూస్తే… ప్లాట్ నెంబర్ ఆరులో 7 ఎకరాల భూమి ఉంది. ప్లాట్ నెంబర్ 7లోని చూస్తే 6.55 ఎకరాలు, 8లో 0.21 ఎకరాలు, ప్లాట్ నెంబర్ 9లో 3.60 ఎకరాలు, ప్లాట్ నెంబర్ 10లో 3.60 ఎకరాలు, ప్లాట్ నెంబర్ 11లో 7.53 ఎకరాలు, ప్లాట్ నెంబర్ 14లో 7.34 ఎకరాల భూమి ఉంది. ఇలా మొత్తం 45.33 ఎకరాల భూమిని వేలం వేసింది హెచ్ఎండీఏ.
కోకాపేటలో మొదటి విడత పూర్తి తర్వాత ప్రస్తుతం రెండో విడత భూముల వేలం చేపట్టింది హెచ్ఎండీఏ. నియోపొలిస్ లే అవుట్‌లోని 45.33 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఏడు ప్లాట్లను ఈ వేలం ద్వారా విక్రయించింది. ఇందుకోసం కంపెనీలు, ట్రస్టులు, రిజిస్టర్డ్ సొసైటీలు, ఆర్థిక సంస్థలు ఈ వేలంలో పాల్గొన్నాయి. జులై 20న ప్రిబిడ్ సమావేశం నిర్వహించారు. జూలై 31 వరకు రిజిస్ట్రేషన్ ఫీజులను స్వీకరించారు. ముందస్తు డిపాజిట్ కింద ఆగస్టు 1లోగా ప్రతీ ప్లాటుకు రూ.5 కోట్లు చెల్లించారు. ఆగస్టు 3న ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో ఈవేలం ప్రక్రియను చేపట్టారు.
కనిపించిన జీవో 111 ప్రభావం...
ఏడాది క్రితం కోకాపేటలో తొలివిడతగా 49 ఎకరాల విస్తీర్ణంలోని ప్లాట్ల విక్రయం చేపట్టింది సర్కార్. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.2వేల కోట్ల ఆదాయం సమకూరింది. ఇప్పుడు రెండో విడత విక్రయాల ద్వారా కూడా అంతే మొత్తంలో ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. నిజానికి, నియో పొలిస్‌తోపాటు గోల్డెన్ మైల్ పేరుతో అభివృద్ధి చేసిన లేఅవుట్లలో భూములు కొనుగోలుకు గత ఏడాది చాలా సంస్థలు పోటీ పడ్డాయి. అత్యధికంగా రూ.60 కోట్లు దాకా చెల్లించి ఎకరం భూమిని కొనుగోలు చేశాయి. అయితే ఈసారి భారీ స్థాయిలో ధరలు రావని అభిప్రాయలు ఉన్నాయి. జీవో 111 ప్రభావంతో... రెండో విడత ఈ-వేలానికి పెద్దగా ఆసక్తి కనబర్చకపోవచ్చనే అభిప్రాయాలు వినిపించాయి. కానీ వాటిని తలకిందులు చేస్తూ… ఏకంగా 3వేల కోట్ల వరకు ఆదాయం సమకూరింది.
సంబంధిత కథనం