BRS Kokapet Land : కోకాపేటలో బీఆర్ఎస్ కు 11 ఎకరాలు, సీక్రెట్ గా కేటాయించారని ప్రతిపక్షాల విమర్శలు!-hyderabad ts govt allotted 11 acres in kokapet to brs excellence center ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Hyderabad Ts Govt Allotted 11 Acres In Kokapet To Brs Excellence Center

BRS Kokapet Land : కోకాపేటలో బీఆర్ఎస్ కు 11 ఎకరాలు, సీక్రెట్ గా కేటాయించారని ప్రతిపక్షాల విమర్శలు!

Bandaru Satyaprasad HT Telugu
May 20, 2023 07:41 PM IST

BRS Kokapet Land : కోకాపేటలో బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర ప్రభుత్వం 11 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే కేటాయింపు పూర్తయిన తర్వాతే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేటాయింపుపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

బీఆర్ఎస్ కు కోకాపేటలో స్థలం
బీఆర్ఎస్ కు కోకాపేటలో స్థలం

BRS Kokapet Land : భారత రాష్ట్ర సమితి(BRS)కి తెలంగాణ ప్రభుత్వం కోకాపేటలో 11 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ కేటాయింపులు మొత్తం పూర్తయిన తర్వాత విషయం బయటకు తెలిసింది. కోట్ల విలువ చేసే భూమిని బీఆర్ఎస్ పార్టీకి అక్రమంగా కేటాయించారని ప్రతిపక్షలు విమర్శలు చేస్తున్నాయి. కోకాపేటలో ఎకరం 50 కోట్లు పైగా పలికే ప్రాంతం అని, అలాంటి చోట బీఆర్ఎల్ పార్టీకి అత్యంత సీక్రెట్ గా 11 కేటాయించారని విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో సంచలనంగా మారుతోంది. వందల కోట్ల విలువ చేసే స్థలాన్ని కేవలం రూ.37.53 కోట్లకు బీఆర్ఎస్ కు కేటాయించేందుకు కేసీఆర్ కేబినెట్ అంగీకారం తెలిపింది. కొత్త సచివాలయంలో గురువారం జరిగిన కేబినెట్​భేటీలో ఈ వ్యవహారాన్ని క్లియర్ చేయారని ఆరోపణలు వస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

అంతా సీక్రెట్ గానే జరిగిందన్న విమర్శలు

కేబినెట్​నిర్ణయాలను మీడియాకు తెలిపిన మంత్రులు బీఆర్ఎస్​కు కోకాపేటలో 11 ఎకరాలు కేటాయించిన విషయాన్ని ప్రస్తావించకపోవడంతో వివాదం మరింత ముదురేటట్లు అయింది. అధికార పార్టీకి స్థల కేటాయింపు కాబట్టి అంతా రహస్యంగా జరిగిపోయిందన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ వాదన మాత్రం మరోలా ఉంది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రీసోర్స్ డెలవప్మెంట్ సెంటర్ పెడతామని బీఆర్ఎస్ చెబుతోంది. అందుకోసం 11 ఎకరాలు కావాలని బీఆర్ఎస్ పార్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి.

ఇటీవల ఎకరం రూ.50 కోట్లకు విక్రయం

ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కోకాపేటలో 239, 240 సర్వే నెంబర్లలోని 11 ఎకరాల భూమిని హెచ్ఎండీఏ ద్వారా కేటాయించాలని ఈ నెల 16న సీసీఎల్ఏకు ప్రతిపాదించారు. కలెక్టర్ ప్రతిపాదనలతో మే 17న సీసీఎల్ఏ ఆ ఫైల్ ను తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ అథారిటీకి పంపింది. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం బీఆర్ఎస్ కు స్థలం కేటాయించాలని అథారిటీ సిఫారసులు ఇచ్చింది. శుక్రవారం బీఆర్ఎస్‌కు రూ.37.53 కోట్లకు 11 ఎకరాల భూమిని కట్టబెడుతూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇనిస్టిట్యూట్ పెడతామని ప్రభుత్వం స్థలాన్ని రహస్యంగా కేటాయించడంపై జోరుగా చర్చ జరుగుతోంది. కోకాపేటలో ఇటీవల నిర్వహించిన వేలంలో ఒక్కో ఎకరం రూ.50 కోట్లకు అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. అంటే 11 ఎకరాలకు సుమారు రూ.550 కోట్లు అవుతుంది. కానీ ఈ భూమిని రూ.37.53 కోట్లకే బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ ప్రభుత్వం కట్టబెట్టిందని విమర్శలు వస్తున్నాయి. 2008లో కాంగ్రెస్ పార్టీకి భూమి కేటాయించినట్లే బీఆర్ఎస్ కు ఇస్తున్నామని సర్క్యులర్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

IPL_Entry_Point