Lok Sabha Election 2024 : పార్లమెంట్ బరిలో 'గాంధీ' వర్సెస్ 'కవిత'...? బిగ్ ఫైట్ తప్పదా..?-if gandhi family contests as an mp from telangana there is a chance that kavitha will contest from brs ,elections న్యూస్
తెలుగు న్యూస్  /  Elections  /  If Gandhi Family Contests As An Mp From Telangana There Is A Chance That Kavitha Will Contest From Brs

Lok Sabha Election 2024 : పార్లమెంట్ బరిలో 'గాంధీ' వర్సెస్ 'కవిత'...? బిగ్ ఫైట్ తప్పదా..?

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 05, 2024 04:07 PM IST

Lok Sabha Election in Telangana 2024 : పార్లమెంట్ ఎన్నికల కోసం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ కసరత్తును ప్రారంభించాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణ నుంచి గాంధీ కుటుంబం బరిలో ఉండే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అలర్ట్ అవుతోంది. అందుకు ధీటుగా కవితను దింపాలని చూస్తోంది.

లోక్ సభ ఎన్నికలు - గాంధీ వర్సెస్ కవిత..?
లోక్ సభ ఎన్నికలు - గాంధీ వర్సెస్ కవిత..?

Telangana Lok Sabha Election 2024 : తెలంగాణ గడ్డపై తొలిసారిగా జెండా ఎగరవేసిన కాంగ్రెస్… వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే దూకుడును ప్రదర్శించాలని చూస్తోంది. మెజార్టీ సీట్లను గెలుచుకోని తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించాలని భావిస్తోంది. ఇప్పటికే ఆ దిశగా కసరత్తు చేయటమే కాకుండా… ఈ ఎన్నికల్లో సోనియాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని రాష్ట్ర నాయకత్వం తీర్మానం కూడా చేసింది. ఈ పరిణామం కాస్త రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి గాంధీ కుటుంబం తరపున ఎవరో ఒకరు పోటీ చేస్తారనే వాదన రోజురోజుకూ బలపడుతూ వస్తోంది. అందుకు తగ్గట్టుగానే… ఇటీవలే జరిగిన టీపీసీసీ సమీక్షలో కూడా ఏకగ్రీవ తీర్మానం చేయటం ఇందుకు బలం చేకూర్చింది. ఈ పరిణామాలను గమనిస్తున్న ప్రతిపక్ష బీఆర్ఎస్…. పార్లమెంట్ ఎన్నికలపై అలర్ట్ అయ్యే ప్రయత్నాలను మొదలుపెట్టింది. నేతలతో సన్నాహక సమావేశాలను నిర్వహిస్తోంది. అయితే నిజంగానే గాంధీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా బరిలో ఉంటే ఎలా అనే దానిపై కూడా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

గాంధీ వర్సెస్ కవిత…?

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియాగాంధీ పోటీ చేయాలని రాష్ట్ర నాయకత్వం కోరుతోంది. ఆ దిశగా గట్టిగా ప్రయత్నాలను చేస్తోంది. అయితే ఇందుకు సోనియా అంగీకరిస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఇలా కుదరకపోతే… ప్రియాంకగాంధీని మరో ఆప్షన్ గా నైనా బరిలో దించితే బాగుంటుందని రాష్ట్ర నాయకత్వం అభిప్రాయపడుతుంది. ఈ క్రమంలో సోనియాగాంధీ పోటీపై ప్రాథమికంగా లెక్కలు వేసుకుంటున్న బీఆర్ఎస్… అందుకు తగ్గట్టుగానే ప్రిపేర్ అయ్యే పనిలో పడింది. అలాకాకుండా ప్రియాంక గాంధీ బరిలో ఉన్నా… బలమైన అభ్యర్థిని దించాలని భావిస్తోంది.

తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన బీఆర్ఎస్ కు వచ్చే పార్లమెంట్ ఎన్నికలు కఠినంగా మారాయని చెప్పొచ్చు. ఇందుకు కారణాలు లేకపోలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిచిన బీఆర్ఎస్… ఆ తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఊహించని షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 3 పార్లమెంట్ స్థానాలను గెలుచుకోగా… బీజేపీ ఏకంగా నాలుగు గెలుచుకొని సత్తాను చాటాయి. ఈ పరిణామం అప్పట్లో బీఆర్ఎస్ కు పెద్ద షాక్ గా మారింది. ప్రస్తుతం ప్రతిపక్ష స్థానంలో ఉన్న బీఆర్ఎస్… వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుస్తుందనే అనే దానిపై అంచనా వేయటం కూడా కష్టంగానే మారింది. ఓవైపు తెలంగాణ కాంగ్రెస్ సరికొత్త జోష్ తో ఉండగా… మరోవైపు బీజేపీ కూడా తెలంగాణపై గట్టిగానే గురి పెట్టింది. ఈ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ఎక్కవ సీట్లను గెలుచుకోవాలని చూస్తోంది. ఈ పరిస్థితుల్లో నిజంగానే గాంధీ కుటుంబం తెలంగాణ నుంచి పోటీ చేస్తే…. బీఆర్ఎస్ కు మరో సవాల్ అనే చర్చ మొదలైంది.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి గాంధీ కుటుంబం బరిలో ఉంటే… ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రధానంగా మెదక్, మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానాలు తెరపైకి వస్తున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓడిపోయిన రేవంత్ రెడ్డి(ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి)… 2019లో మల్కాజ్ గిరి పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిచారు. ఇక 1980లో మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి ఇందిరాగాంధీ పోటీ చేసి విజయం సాధించారు.

ప్రస్తుతం మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ బలంగా ఉండగా… మల్కాజ్ గిరి పరిధిలోనూ అదే పరిస్థితి ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చాలా జిల్లాలో వెనకబడిన బీఆర్ఎస్… గ్రేటర్ పరిధిలో మాత్రం సత్తా చాటింది. దీనికితోడు కేసీఆర్ సొంత జిల్లా అయిన మెదక్ లో పట్టును నిలుపుకోగలిగింది. ఇక్కడ హరీశ్ రావు అత్యంత కీలకంగా వ్యవహరించారు. అయితే గాంధీ కుటుంబం నుంచి ఎవరైనా తెలంగాణలో(మెదక్) పోటీ చేస్తే… ఆ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉంటుందని టీపీసీసీ భావిస్తోంది.

గాంధీ కుటుంబం తెలంగాణ నుంచి పోటీ చేస్తే బీఆర్ఎస్ నుంచి కవితను బరిలో దించాలని గులాబీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా గెలిచిన కవిత… 2019లో బీజేపీ అభ్యర్థి అర్వింద్ చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఓవైపు రెండు జాతీయ పార్టీలు బలమైన ప్రత్యర్థులుగా ఉన్న నేపథ్యంలో…. బీఆర్ఎస్ కు ఈ ఎన్నికలు అతిపెద్ద సవాల్ గా మారనున్నాయి. ఇక గాంధీ కుటుంబం నిజంగానే తెలంగాణ నుంచి బరిలో ఉంటుందా లేదా అనేది తేలాల్సి ఉంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రావొచ్చు. పోటీనే ఖరారైతే… తెలంగాణ వేదికగా సరికొత్త రాజకీయం జరగటం ఖాయమనే చెప్పొచ్చు….!

WhatsApp channel