TS MLC Elections 2024 : బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ ఛాన్స్ ఎవరికి..?
Telangana MLC Elections 2024 : తెలంగాణలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ఒకటి బీఆర్‌ఎస్‌కు దక్కనుంది. అయితే ఒక్క ఎమ్మెల్సీ పదవి కోసం… చాలా మంది నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.
Telangana MLC Elections 2024 : తెలంగాణ శాసన మండలిలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవుల భర్తీకి ఎన్నికల షెడ్యూలు విడులైన సంగతి తెలిసిందే. ఈ నెల 11వ తేదీన నోటిఫికేషన్ జారీ కానుండగా, 29వ తేదీన ఎన్నిక జరగనుంది. శాసన సభలో ఎమ్మెల్యేల బలాబలాలను పరిగణనలోకి తీసుకుంటే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు చెరో ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో… బీఆర్ఎస్ నుంచి ఈ ఛాన్స్ ఎవరికి దక్కబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
బీఆర్ఎస్ నుంచి ఎవరు..?
ప్రస్తుతం ఖాళీ అయిన రెండు స్థానాలు కూడా బీఆర్ఎస్ కోటాలోనే ఉన్నాయి. కానీ తాజాగా జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీంతో వారు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం... 39గా ఉంది. కాంగ్రెస్ పార్టీకి 64 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఈ లెక్కన ఇరు పార్టీలకు చెరో సీటు దక్కే అవకాశం స్పష్టంగా ఉంది. అయితే ప్రస్తుతం ఈ పదవి కోసం బీఆర్ఎస్ లోని చాలా మంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ... కీలక నేతలు ఎమ్మెల్యే టికెట్లు ఆశించినప్పటికీ దక్కలేదు. చాలా మంది నేతలకు నామినేటెడ్ పదవులతో పాటు ఎమ్మెల్సీ పదవులను కట్టబెడుతామని హామీనిచ్చారు. కానీ బీఆర్ఎస్ అంచనాలు తప్పటంతో ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. ఇప్పుడు హామీనిచ్చిన నేతల్లో ఎవరికో ఒకరికి ఈ సీటు దక్కే అవకాశం ఉంది. ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉండి తమ సీటును త్యాగం చేసిన నేతల పేర్లను పరిగణనలోకి తీసుకుంటారా లేక ఇప్పటి వరకు ఎలాంటి పదవి లేకుండా పార్టీ కోసం నిబద్ధతతో పని చేస్తున్న నేతల పేర్లను పరిశీలిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సీటు కోసం మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, రాజయ్యతో పాటు గంపా గోవర్థన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక వీరే కాకుండా... గవర్నర్ కోటా కింద పేర్లను పంపినప్పటికీ ఆమోదం రాకపోవటంతో నిరాశకు గురైన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను పరిశీలించే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.
వీరితో పాటు పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు కూడా ఎమ్మెల్సీ పదవి కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారంట..! ఇప్పటికే ఈ విషయంపై గులాబీ పార్టీ అధినాయకత్వం కూడా కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. అయితే కేసీఆర్... ఎవరి పేరుకు ఆమోదం తెలపుతారనేది చూడాలి...!
ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో 119 మంది సభ్యులండగా... కాంగ్రెస్ కు 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్ఎస్ కు 39 ఉండగా... బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంఐఎం పార్టీకి 7, సీపీఐ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. ఈనెల 29వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లు లెక్కించనున్నారు.
సంబంధిత కథనం