ED On Kavitha Arrest : ఆప్ నేతలకు రూ.100 కోట్లు, లిక్కర్ స్కామ్ లో కవితదే కీలక పాత్ర- ఈడీ ప్రకటన
ED On Kavitha Arrest : ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఈడీ ప్రకటన విడుదల చేసింది. దిల్లీ లిక్కర్ పాలసీ(Delhi Liquor Scam)లో లాభపడేందుకు ఆప్ నేతలకు కవిత రూ.100 కోట్లు చెల్లించినట్లు ఈడీ తెలిపింది. ఈ కేసులో ఇప్పటి వరకూ 15 మందిని అరెస్టు చేసినట్లు చెప్పింది.
ED On Kavitha Arrest : దిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో(Delhi Liquor Scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు(Kavitha Arrest)పై ఈడీ ప్రకటన విడుదల చేసింది. దిల్లీ లిక్కర్ కేసులో ఈ నెల 15న కవితను అరెస్టు చేసినట్లు ఈడీ(ED) ప్రకటించింది. న్యూదిల్లీ పీఎంఎల్ఏ కోర్టు ఎమ్మెల్సీ కవితకు 7 రోజుల పాటు ఈడీ కస్టోడియల్ ఇంటరాగేషన్ కోసం రిమాండ్ విధించినట్లు తెలిపింది. ఈ నెల 23 వరకు కోర్టు ఈడీ రిమాండ్(Kavitha Remand) విధించినట్లు ప్రకటించింది.
ఆప్ నేతలకు రూ.100 కోట్లు చెల్లించిన కవిత
మార్చి 15న హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ సోదాలు(ED Raids) నిర్వహించిందని తెలిపింది. ఆ సమయంలో ఈడీ అధికారులను కవిత బంధువులు, సన్నిహితులు అడ్డుకున్నారని తెలిపింది. ఎమ్మెల్సీ కవితతో పాటు మరికొందరు కలిసి దిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కు ప్లాన్ చేశారని ఈడీ విచారణలో తేలిందని ప్రకటించింది. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal), ఆప్ నేత మనీష్ సిసోడియా ఎక్సైజ్ పాలసీ(Delhi Excise Policy) రూపకల్పన, అమలులో అవకతవలకు పాల్పడ్డారని తెలిపింది. ఈ కుట్రలో కవిత పాత్ర కూడా ఉందని ఈడీ విచారణలో తేలిందన్నారు. తమకు అనుకూలంగా లిక్కర్ పాలసీ రూపొందించేందుకు కవిత ఆప్ నేతలకు రూ.100 కోట్లు చెల్లించారని ఈడీ తెలిపింది. అవినీతికి పాల్పడే ఉద్దేశంతో దిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపొందించారని, అక్రమ మార్గంలో ఆప్ నేతలకు నిధులు సమకూరాయని పేర్కొంది.
245 చోట్ల సోదాలు-15 మంది అరెస్ట్
ఎమ్మెల్సీ కవిత(Mlc Kavitha), ఆమె సహచరులు ఆప్ నేతలకు ముందస్తుగా డబ్బులు చెల్లించి, లిక్కర్ స్కామ్ ద్వారా లాభాలు పొందాలని చూశారని ఈడీ ప్రకటనలో తెలిపింది. ఈ కేసులో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబయి సహా 245 చోట్ల సోదాలు నిర్వహించినట్లు ఈడీ తెలిపింది. ఈ కేసులో ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ సహా 15 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొంది. దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకూ రూ. 128.79 కోట్లు తాత్కాలిక అటాచ్‌మెంట్ చేశామని ఈడీ (ED On Kavitha Arrest)తన ప్రకటనలో తెలిపింది. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని వెల్లడించింది.
సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత
ఈడీ అరెస్టుపై ఎమ్మెల్సీ కవిత(Mlc Kavitha) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఉదయం ఆన్ లైన్ లో పిటిషన్ వేశారు. తన పిటిషన్ సుప్రీంకోర్టు విచారణలో ఉండగానే అరెస్టు చేశారని, ఈడీ కోర్టుకు ధిక్కరణకు పాల్పడిందని ఎమ్మెల్సీ కవిత పిటిషన్ లో పేర్కొన్నారు. ఈడీ అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోర్టును విజ్ఞప్తి చేశారు. గత విచారణలో సమన్లు జారీచేయబోమని కోర్టుకు చెప్పిన ఈడీ అక్రమంగా తనను అరెస్టు చేసిందని తెలిపారు. కవిత తరఫున ఆమె న్యాయవాది మోహిత్ రావు సోమవారం ఆన్‌లైన్‌లో పిటిషన్ దాఖలు చేశారు.
సంబంధిత కథనం