Kavitha Arrest in Liquor Scam : కవితే కీలక సూత్రదారి...! ఈడీ కస్టడీ పిటిషన్ లో కీలక విషయాలు
Delhi Liquor Scam Updates: లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు రిమాండ్ విధించింది ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు. కవితను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో ఈడీ వేసిన పిటిషన్ లో పలు కీలక విషయాలను ప్రస్తావించింది.
MLC Kavitha Custody Petition : ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక(Delhi Liquor Scam) పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత కొద్దిరోజులుగా దూకుడు పెంచిన ఈడీ… తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను(Kavitha Arrest) అరెస్ట్ చేసింది. ఇదే సమయంలో ఢిల్లీకి తరలించి శనివారం కోర్టులో ప్రవేశపెట్టింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం… కవితకు రిమాండ్ విధించింది. కవితను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ లో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో….. కవిత కీలక సూత్రదారిగా ఉన్నారని అభియోగం మోపింది. ఆధారాలను ధ్వంసం చేసినట్లు గుర్తించామని కూడా పేర్కొంది. ఈ మేరకు కోర్టులకు పలు ఆధారాలను సమర్పించింది.
కీలక విషయాలు…
ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ఇతర వ్యక్తులతో కలిసి రూ 100 కోట్ల అవినీతికి కుట్ర పన్నినట్లు ఈడీ తన కస్టడీ పిటిషన్ లో ప్రస్తావించింది. కిక్‌బ్యాక్ చెల్లింపులో ఆమె క్రీయాశీలకంగా పాల్గొందని….. ఆపై మనీలాండరింగ్‌కు అనుకూల పరిస్థితులను కల్పించిందని తెలిపింది. ఇండో స్పిరిట్స్‌ని తన గుప్పిట్లో పెట్టుకుని తద్వారా రూ 192.8 కోట్ల అక్రమంగా డబ్బు ఆర్జించిందని అభియోగం మోపింది. “2021-22 ఎక్సైజ్ పాలసీ అమలులో చట్టవిరుద్ధంగా ప్రయోజనం పొందేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు అక్రమంగా చెల్లింపు చర్యలలో పాల్గొంటుంది. ఆమె బినామీ అయిన అరుణ్ పిళ్లై ద్వారా ఇండో స్పిరిట్స్‌లో భాగస్వామిగా ఉన్నారు. చెల్లించిన పెట్టుబడిని తిరిగి అక్రమంగా ఆదాయాన్ని సంపాదించడానికి ప్రయత్నించారు. వాస్తవానికి కవిత రూ100 కోట్ల పివోసి బదిలీలో ఆమె సిబ్బంది, సహచరులు అభిషేక్ బోయిన్‌పల్లి, బుచ్చి బాబు ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు చెల్లించింది” అని ఈడీ వివరించింది.
లిక్కర్ పాలసీ రూపకల్పనలో అంతర్గతంగా కవిత పాల్గొందని ఈడీ ప్రస్తావించింది. ఫలితంగా పొందే లాభాలలో ఇండో స్పిరిట్స్‌లో తన బినామీ అరుణ్ పిళ్లై వాటాను అంతిమంగా కవిత పొందేలా కిక్‌బ్యాక్ పథకానికి కుట్రకు తెరలేపిందని చెప్పింది. అభిషేక్ బోయిన్‌పల్లి ఆదేశాల మేరకు దినేష్ అరోరా కార్యాలయం నుండి నగదుతో కూడిన రెండు భారీ బ్యాగ్‌లను వినోద్ చౌహాన్‌కు అందించినట్లు కవిత సిబ్బందిలో ఒకరు 2023 ఆగస్టు 8న ప్రకటనలో వెల్లడించారని ఈడీ గుర్తు చేసింది. కవితతో పాటు సౌత్ గ్రూప్‌లోని ఇతర సభ్యులు అయిన శరత్ రెడ్డి, రాఘవ్ మాగుంట మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఆప్ అగ్రనేతలతో కలిసికుట్ర పన్నారని పేర్కొంది. రూ 100 కోట్ల వరకు అక్రంగా చెల్లించారని…. దీనికి బదులుగా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అమలులో అక్రమంగా లబ్ది పొందారని పిటిషన్ లో రాసుకొచ్చింది. కవిత మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు తేలటంతోనే అరెస్ట్ చేసినట్లీ ఈడీ కోర్టుకు తెలిపింది.
ఇవాళ్టి నుంచి కస్టోడియల్ విచారణ….
మరోవైపు ఇవాళ్టి నుంచి కవితను(Kavitha Arrest) విచారించనుంది ఈడీ. ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు కస్టోడియల్ విచారణ కొనసాగుతుంది. అఫ్రూవర్లుగా మారిన వారి నుంచి సేకరించిన సమాచారాన్ని కవిత ద్వారా ధ్రువీకరించుకునే అవకాశం ఉంది. సాయంత్రం ఆరు గంటల తర్వాత కవిత లాయర్లను కలిసే అవకాశం కల్పించింది కోర్టు.
ఇక ఇవాళ కేటీఆర్, హరీశ్ రావుతో పాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి బయల్దేరారు. న్యాయనిపుణులతో సంప్రదింపులు జరపనున్నట్లు తెలిసింది. సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని సమాచారం.
మరోవైపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 21న విచారణకు రావాలని కేజ్రీవాల్ ను ఆదేశించింది. బెయిల్ ఇచ్చిన గంటల వ్యవధిలోనే 9వ సారి ఈడీ నోటీసులు జారీ చేసింది.
సంబంధిత కథనం