Delhi Liquor scam: లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా..
Delhi liquor policy case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నవంబర్ 2వ తేదీన ఈడీ విచారణకు హాజరు కాకూడదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయించుకున్నారు.
Delhi Liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో నవంబర్ 2న విచారణకు హాజరుకావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు అక్టోబర్ 30న ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే, ఈడీ విచారణకు కేజ్రీవాల్ నవంబర్ 2న హాజరు కావడం లేదు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మధ్య ప్రదేశ్ ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల తరఫున నవంబర్ 2న ఆయన ప్రచారంలో పాల్గొంటున్నారు.
ఎంపీలో ప్రచారం..
అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థుల ప్రచారం కోసం గురువారం మధ్య ప్రదేశ్ లో కేజ్రీవాల్ పర్యటించనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తనకు ఈడీ సమన్లు జారీ చేయడాన్ని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఆ సమన్లను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈడీ సమన్లు రాజకీయ ప్రేరేపితమని విమర్శించారు. కేంద్రం విపక్ష నేతలపై చేపడ్తున్న కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనకు ఈడీ సమన్లు జారీ చేసిందన్నారు.
ప్రచారం చేయకుండా..
మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తనను ప్రచారంలో పాల్గొనకుండా అడ్డుకోవడమే ఈ సమన్ల వెనుక ఉద్దేశమన్నారు. ‘‘సమన్ నోటీసు చట్టవిరుద్ధం. అది రాజకీయ ప్రేరేపితమైనది. బీజేపీ సూచన మేరకు నోటీసు పంపారు. నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా చేయడానికే నోటీసులు పంపారు. ఈడీ వెంటనే నోటీసును ఉపసంహరించుకోవాలి’’ అని అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈ ఏడాది ఏప్రిల్‌లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సమన్లు జారీ చేసింది. అయితే, గతేడాది ఆగస్టు 17న సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ లో కేజ్రీవాల్‌ను నిందితుడిగా పేర్కొనలేదు.