Telangana Govt : రాష్ట్రంలో మళ్లీ పోలీస్ కొలువులు - సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు-cm revanth reddy asks officials to take up police recruitment immediately ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Govt : రాష్ట్రంలో మళ్లీ పోలీస్ కొలువులు - సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Telangana Govt : రాష్ట్రంలో మళ్లీ పోలీస్ కొలువులు - సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 16, 2023 09:29 AM IST

CM Revanth Reddy On Police Recruitment : పోలీసు శాఖలోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో పలు శాఖలపై సమీక్షించిన ముఖ్యమంత్రి… అధికారులకు దిశానిర్దేశం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

CM Revanth Reddy News : డా.బీ.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో పోలీస్, వైద్య ఆరోగ్యశాఖలో నియామకాలపై శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో పోలీస్ నియామక పక్రియను వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు జరిగిన ఉద్యోగ నియామకాలపై కూడా నివేదిక ఇవ్వాలన్నారు.

వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సాధ్యమైనంత త్వరగా నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. విధి నిర్వహణలో తీవ్ర పని ఒత్తిడి, ఎక్కువ సమయం విధులు నిర్వహించే పోలీస్, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల విద్య కోసం ప్రత్యేక శ్రద్ధ చూపే అంశంపై సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. పోలీస్ ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్ వరకు ఆర్టీసీలో ఉన్నతాధికారుల నుంచి కండక్టర్, క్రింది స్థాయి ఉద్యోగుల పిల్లలకు ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. కోరుకొండ సైనిక్ స్కూల్ మాదిరిగా ఈ పాఠశాల ఉండాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

నళిని ఉద్యోగంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా

CM Revanth reddy On Ex-DSP Nalini Posting: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినికి తిరిగి ఉద్యోగం ఇవ్వటంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. పోలీస్ శాఖలో అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటని ఆరా తీశారు. నళినికి ఉద్యోగం చేయాలని ఆసక్తి వుంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. పోలీస్ శాఖలో మార్గదర్శకాలకు సంబంధించి అవరోధాలేమైనా వుంటే అదే హోదాలో వేరే శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని సూచించారు.

డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు, పోలీస్ శాఖలో నియామకాల మీద సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా చాలా మంది తిరిగి ఉద్యోగాల్లో చేరిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఇదే నియమం పవిత్రమైన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉన్నత ఉద్యోగాన్ని త్యజించిన నళినికి మాత్రం తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఎందుకు వర్తింపజేయకూడదని అధికారులను సీఎం ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసిన నాయకులకు పదవులు వచ్చినప్పుడు, నళినికి ఎందుకు అన్యాయం జరగాలని అభిప్రాయపడ్డారు. తిరిగి ఉద్యోగంలో చేరడానికి నళిని సుముఖంగా ఉంటే, వెంటనే ఆమెకు ఉద్యోగం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన నళిని… ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. పరకాల ఉపఎన్నికల్లో కూడా పోటీ చేశారు.

Whats_app_banner