Hyderabad Property : హైదరాబాద్ లో రెసిడెన్షియల్ ప్రాపర్టీకి భారీ డిమాండ్, ఏటా 15 శాతం పెరుగుతున్న రిజిస్ట్రేషన్లు!
Hyderabad Property : హైదరాబాద్ పరిధిలో రెసిడెన్షియల్ ప్రాపర్టీ విలువ ఏటా వృద్ధి చెందుతోందని నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక పేర్కొంది.
Hyderabad Property : హైదరాబాద్ లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ విలువ ప్రతీ ఏడాది పెరుగుతోందని నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదికలో పేర్కొంది. ఆగస్టు 2023లో 6,493 రెసిడెన్షియల్ ప్రాపర్టీలు రిజిస్టర్ అయ్యాయని తెలిపింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 15 శాతం, నెలవారీగా 17 శాతం రిజిస్ట్రేషన్ల పెరుగుదలను నమోదు చేసిందని పేర్కొంది. ఆగస్టు నెలలో నమోదైన ఆస్తుల విలువ రూ. 3,461 కోట్లుగా ఉందని వెల్లడించింది. ఆస్తుల విలువ కూడా గత ఏడాది కన్నా 22 శాతం, నెలవారీగా 20 శాతం పెరిగిందని వెల్లడించింది.
రూ.25-50 లక్షల పరిధిలో
హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్‌లో హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి నాలుగు జిల్లాలు భాగమై ఉన్నాయి. 2023 ఆగస్టులో హైదరాబాద్‌లో అత్యధికంగా ఆస్తి రిజిస్ట్రేషన్‌లు రూ. 25-50 లక్షల ధర పరిధిలో ఉన్నాయి. మొత్తం రిజిస్ట్రేషన్‌లలో వీటి వాటా 52 శాతంగా ఉంది. రూ. 25 లక్షల కంటే తక్కువ ధర ఉన్న ఆస్తులు మొత్తం రిజిస్ట్రేషన్‌లో 16 శాతం ఉన్నాయి. రూ. 1 కోటి, అంతకంటే ఎక్కువ పరిమాణాలు కలిగిన ఆస్తుల విక్రయాల రిజిస్ట్రేషన్ల వాటా జూలై 2023లో 9 శాతంగా నమోదు అయ్యాయి. ఈ ఏడాది ఆగస్టులో ప్రాపర్టీల డిమాండ్ ఎక్కువగా 1,000-2,000 చదరపు అడుగుల పరిధిలో కేంద్రీకృతమై ఉందని, ఈ పరిమాణంలోనే 70 శాతం రిజిస్ట్రేషన్‌లు అయ్యాయని నైట్ ఫ్రాంక్ నివేదిక పేర్కొంది.
మేడ్చల్-మల్కాజిగిరి గృహ రిజిస్ట్రేషన్లలో అగ్రస్థానం
చిన్న గృహాల (500 -1,000 చదరపు అడుగులు) డిమాండ్ కూడా పెరిగిందని పేర్కొంది. 2022 ఆగస్టులో 15 శాతంగా ఉన్న ఈ తరహా ఇళ్ల రిజిస్ట్రేషన్లు 2023 ఆగస్టులో 16 శాతానికి పెరిగాయని నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదికలో తెలిపింది. ముఖ్యంగా 2,000 చదరపు అడుగుల కంటే పెద్ద ప్రాపర్టీలకు డిమాండ్ పెరిగిందని తెలిపింది. 2022 ఆగస్టులో వీటి రిజిస్ట్రేషన్‌లు 9 శాతం కాగా ఈ ఏడాది ఆగస్టులో 11 శాతానికి పెరిగాయని వెల్లడించింది. జిల్లా స్థాయిలో నిర్వహించిన అధ్యయనం ప్రకారం, మేడ్చల్-మల్కాజిగిరి స్థిరంగా 43 శాతం గృహ విక్రయాల రిజిస్ట్రేషన్‌లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, రంగారెడ్డి జిల్లా 39 శాతం విక్రయాల రిజిస్ట్రేషన్‌తో తర్వాత స్థానంలో ఉంది. దీనికి విరుద్ధంగా 2023 ఆగస్టులో జరిగిన మొత్తం రిజిస్ట్రేషన్లలో హైదరాబాద్ జిల్లా వాటా 17 శాతం మాత్రమే ఉంది. ఈ ఏడాది ఆగస్టులో నివాస ప్రాపర్టీల లావాదేవీల సగటు ధరలు 5.7 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో 6 శాతం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా ధరలు వరుసగా 4%, 2% పెరిగాయి.
నివాస స్థలాలకు పెరిగిన డిమాండ్
ఈ ఏడాది ఆగస్టులో హైదరాబాద్‌లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ అమ్మకాలు ప్రధానంగా 1,000-2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 25 - 50 లక్షలు మధ్య అత్యధిక రిజిస్ట్రేషన్‌లు జరిగాయని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా గృహ కొనుగోలుదారులు ఖరీదైన ఆస్తులను కూడా కొనుగోలు చేశారని తెలిపింది. దీంతో హైదరాబాద్, రంగారెడ్డిలో రెసిడెన్షియల్ మార్కెట్‌లు వృద్ధి సాధించాయి. ఈ ప్రాంతాల్లో 3,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న ఆస్తుల విలువ రూ. 4 కోట్ల కంటే ఎక్కువ ధర పలుకుతున్నాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్ ఎండీ శిశిర్ బైజల్ మాట్లాడుతూ, హైదరాబాద్‌లో హౌసింగ్ మార్కెట్ గణనీయమైన పురోగమనంలో ఉందన్నారు. ముఖ్యంగా అనేక సౌకర్యాలతో ఉన్న ఆధునిక కాంప్లెక్స్‌లలో మెరుగైన నివాస స్థలాలకు డిమాండ్ పెరిగిందన్నారు. ఏప్రిల్ నుంచి వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచాలనే ఆర్బీఐ నిర్ణయం కొనుగోలుదారుల విశ్వాసాన్ని మరింత పెంచిందన్నారు.