CM Revanth Reddy : పారదర్శకతతో ఉద్యోగ నియామకాలు, టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
CM Revanth Reddy : టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. యూపీఎస్సీ సహా ఇతర రాష్ట్రాల నియామక బోర్డులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
CM Revanth Reddy : టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. ఉద్యోగ నియామకాలు, ప్రవేశ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న యూపీఎస్సీతో పాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరును అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు, నోటిఫికేషన్లకు సంబంధించి మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఉద్యోగ నియామకాలలో పారదర్శకత
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... యూపీఎస్సీతో సహా పలు రాష్ట్రాలకు ఉన్నతాధికారుల బృందాన్ని పంపి అక్కడి నియామక ప్రక్రియలపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించి సమర్పించాలని ఆదేశించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు అత్యంత పారదర్శకతతో చేపట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకాలకు సుప్రీం కోర్టు జారీ చేసిన సూచనలు, ఆదేశాలకు అనుగుణంగా పూర్తి పారదర్శకమైన మార్గదర్శకాలను రూపొందించాలని సీఎం ఆదేశించారు. టీఎస్పీఎస్సీ కు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, కావాల్సిన సిబ్బందిని ఇతర సదుపాయాలను వెంటనే కల్పించాలని అధికారులను ఆదేశించారు.
పేపర్ల లీకేజీ విచారణపై ఆరా
టీఎస్పీఎస్సీ ఇప్పటి వరకూ చేపట్టిన నియామకాలు, మిగిలిన నియామకాలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆరా తీశారు. గ్రూప్-1, ఏఈఈ పరీక్షల పేపర్ల లీకేజీ వ్యవహారంపై సీఎం ప్రశ్నించారు. ఈ కేసు పురోగతి, విచారణ, తదుపరి కార్యాచరణ సహా అన్ని అంశాల గురించి పోలీసు అధికారుల వివరాలు తీసుకున్నారు. ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ అయిన ఇతర పరీక్షల తేదీలు, నిర్వహణపై సమావేశంలో చర్చించినట్లు సమచారం. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
విద్యాశాఖపై సమీక్ష
పదో తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గతంలో జరిగిన పేపర్ లీకేజీలు, ఇతర ఇబ్బందులను సీఎం ప్రస్తావించారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురవ్వకుండా సాఫీగా పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని వర్సిటీల పనితీరుపై సవివరమైన నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ జూనియర్ కళాశాలలు అవసరం నివేదిక ఇవ్వాలన్నారు. ముఖ్యంగా బాలికల కోసం జూనియర్ కళాశాలలు ఎక్కడ అవసరమో పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు.