Analysis On T Congress Internal Fight: డిగ్గీరాజా వచ్చాడు, వెళ్లాడు.. మరి సమస్యల సంగతేంటి..?
Telangana Congress Seniors vs Juniors Issue : కాంగ్రెస్ హైకమాండ్ పంపిన డిగ్గీరాజా వచ్చారు... నేతలతో మాట్లాడారు..! 'అంతా ఓకే.. నో ప్రాబ్లమ్' అంటూ ఓ స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. పని ముగించుకొని హస్తినకు వెళ్లిపోయారు. మరి నిజంగానే టీ కాంగ్రెస్ లో అంతర్గత ఫైట్ సమసిపోయిందా..? ట్రబుల్ షూటర్ గా వచ్చిన డిగ్గీరాజా... పని ఫినిష్ చేశాడా..? నేతలంతా లైన్ లోకి వచ్చినట్లేనా..? అనే విషయంలో మాత్రం ఎక్కడో క్లారిటీ మిస్ అయినట్లు అనిపిస్తోంది.
Telangana Pradesh Congress Internal Fight Issue: తెలంగాణ కాంగ్రెస్.... ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ కుదిపేస్తూనే ఉంటుంది. నేతల మధ్య డైలాగ్ లు పేలుతూనే ఉంటాయి. అంతలోనే కలుస్తారు.. మరోవైపు విమర్శలు గుప్పిస్తుంటారు..! ఏది చేసినా వారికే చెల్లుతుంది. ఏ నేత ఎటువైపు ఉంటారో కూడా కరెక్ట్ గా అంచనా వేయలేం...! ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్పలేం..! అలా సాగే టీ కాంగ్రెస్ రాజకీయాల్లో... కొత్త కమిటీల చిచ్చు రేగింది. విషయం కాస్త జూనియర్లు, సీనియర్లు(ఒరిజినల్ వర్సెస్ వలస) అనే స్థాయికి వెళ్లింది. అంతేనా.. పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీరును ఖండిస్తున్న సీనియర్లు.. ఏకంగా 'సేవ్ కాంగ్రెస్' అంటూ ఓ నినాదాన్ని కూడా ఎత్తుకున్నారు. ఇంతలోనే రేవంత్ వర్గం నుంచి రాజీనామాల రూపంలో రీసౌండ్ రానే వచ్చింది. పరిస్థితిని గమనించిన పార్టీ హైకమాండ్ ఢిల్లీ నుంచి డిగ్గీరాజాను రంగంలోకి దింపింది. వెంటనే ట్రబుల్ షూటర్ గా ఆయన హైదరాబాద్ రానే వచ్చారు.. పరిస్థితిని స్వయంగా చూశారు.. తిరిగి వెళ్లిపోయారు కూడా..! మరి తలెత్తిన వివాదం సద్దుమణిగినట్టేనా..? లీడర్లంతా కలిసిపోయారా..? సమైక్య రాగంతో అడుగులు వేస్తారా..? అసలు డిగ్గీరాజా మిషన్ ఎంత వరకు పని చేసింది..? వంటి ప్రశ్నలు మాత్రం హస్తం కేడర్ ను ఆలోచనలో పడేస్తున్నాయి.
నిజానికి ఢిల్లీ దూతగా వచ్చిన దిగ్విజయ్ సింగ్ తీరు చూస్తుంటే 'నేను వచ్చాను, నేను చూశాను, నేను పరిష్కరించాను' అన్నట్లు కనిపించింది. హైకమాండ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆయన... అప్పగించిన మిషన్ ను విజయవంతంగా పూర్తి చేశారని మాత్రం స్పష్టంగా చెప్పలేం. నేతలతో స్వయంగా మాట్లాడిన డిగ్గీరాజా... రెబల్స్ కు ఓ వార్నింగ్ మాత్రం ఇచ్చినట్లు కనిపించింది. జూనియర్లు, సీనియర్లు అనే విధానం పార్టీలో లేదని స్పష్టం చేస్తూనే.... అంతా సద్ధుమణిగినట్లు, సమస్యేమీ లేదన్నట్లూ ఓ ప్రకటన ఇచ్చి హస్తినకు వెళ్లిపోయారు. కానీ తన రెండు రోజుల పర్యటనలో అసలు సమస్యలను గుర్తించటంలో విఫలమయ్యారనే విశ్లేషణలు మాత్రం తైరపైకి వస్తున్నాయి. కేవలం అసంతృప్త నేతల ఫిర్యాదులను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని చెబుతూ చేతులు దులుపుకున్నట్లు స్పష్టమవుతోంది.
మార్పుపై క్లారిటీ ఇచ్చేశారు...
పర్యటన ముగింపు సందర్భంగా మీడియాతో మాట్లాడారు డిగ్గీరాజా(దిగ్విజయ్ సింగ్). పార్టీ కోసం అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, గ్రూపులు ఉండకూడదని తేల్చి చెప్పారు. కానీ ఇదే సమయంలో రెబల్స్ డిమాండ్ గా ఉన్న నాయకత్వ మార్పుపై మాత్రం ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మార్పు వంటి నిర్ణయాలు ఉండవంటూ హైకమాండ్ ఆలోచనను నేతలకు చెప్పకనే చెప్పేశారు. ఫలితంగా రేవంత్ రెడ్డిని మార్చే ఉద్దేశ్యం లేదని మాత్రం క్లియర్ కట్ గా చెప్పినట్లు అర్థమవుతోంది.
నేతలకు కౌంటర్ క్వశ్చన్స్!
తాజా పరిస్థితులను పరిష్కరించేందుకు వచ్చిన దిగ్విజయ్... రెబల్స్ కు మాత్రం సూటిగానే కొన్ని ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. పార్టీ బలోపేతం కోసం వారి వంతుగా ఏం చేస్తున్నారు..? వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలను ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నారని అడిగినట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే సదరు నేతల నుంచి సరైన క్లారిటీ కూడా రానట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే పీసీసీ పనితీరు, తలెత్తిన విబేధాల విషయంలో మాత్రం రెబల్స్ కు దిగ్విజయ్ ఓ భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫిర్యాదుల అంశాన్ని హైకమాండ్ సీరియస్ గానే పరిశీలిస్తుందని చెప్పినట్లు సమాచారం. సరిగ్గా ఈ పరిణామాలే రెబల్స్ కు తీవ్ర నిరాశ కలిగించినట్లు అర్థమవుతోంది. ప్రధానంగా ప్రస్తావించిన నాయకత్వ(రేవంత్ రెడ్డి) మార్పు లేకపోవటంతో పాటు ఎప్పటిలాగే అధినాయకత్వం చూసుకుంటుందని చెప్పటం, పైగా రివర్స్ క్వశ్చన్స్ వేయటం వారిని కాస్త ఉక్కిరిబిక్కిరి చేసిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
కలిసి నడుస్తారా..? మళ్లీ అలాగేనా..?
మొత్తంగా డిగ్గీరాజా రావటం, వెళ్లటం కూడా జరిగిపోయింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు పూర్తిగా సద్దుమణిగినట్లేనా..? రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను నేతలంతా కలిసి విజయవంతం చేస్తారా..? అధిష్టానం ఆదేశాలను అనుసరిస్తారా..? ఇలా అనేక ప్రశ్నలు అలాగే మిగిలి ఉన్నాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు...! ఎందకంటే... డిగ్గీ రాజా టూర్ ముగిసిన తర్వాత.. ఏ ఒక్క సీనియర్ నాయకుడు కూడా మీడియా ముందుకు రాలేదు. ఏం జరిగిందనే విషయం కూడా తెలపలేదు. కనీసం రియాక్షన్ కూడా లేదు. కలిసి పని చేస్తామనే ప్రకటనలు కూడా రాలేదు. ఫలితంగా వారిలో అసంతృప్తి జ్వాలలు రగులుతూనే ఉన్నట్లు క్లియర్ కట్ గా అర్థమవుతోంది. మరోవైపు రెబల్స్ లేవనెత్తిన అంశాల విషయంలో రేవంత్ రెడ్డి.. హైకమాండ్ ను ఎలా మెప్పిస్తారనేది కూడా ఇక్కడ ఆసక్తికరంగా మారింది. రెబల్స్ ఆరోపణలకు అధిష్టానం వద్ద సరైన జవాబునిస్తారా..? లేక చతికిలపడిపోతారా..? అనేది కూడా తేలాల్సి ఉంటుంది. ఫైనల్ గా డిగ్గీరాజా టూర్ ముగిసినప్పటికీ... ఒరిజినల్, వలస కాంగ్రెస్ వివాదానికి చెక్ పడినట్లు మాత్రం కనిపించటం లేదు. ఇంకా ప్రశ్నార్థకంగానే మిగిలి ఉన్నట్లు కనిపిస్తోంది. మొత్తంగా రేవంత్ తొలగింపుతోనే ఈ వివాదాలన్నింటికీ చెక్ పడుతుందని రెబల్స్ నేతల తీరును చూస్తే అర్థమవుతోంది.
ఇలా అయితే ఎలా..?
నిజానికి టీ కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలను హైకమాండ్ సీరియస్ గా పరిగణించినట్లు మాత్రం కనిపించటం లేదు. కేవలం డిగ్గీరాజాను రాష్ట్రానికి పంపటం, ఆయన అంతా ఓకే అన్నట్లు చెప్పటం చకచక జరిగిపోయాయి. కానీ క్షేత్రస్థాయిలోని పరిస్థితులను గుర్తించటం లేదా పరిష్కరించటంలో కాంగ్రెస్ అధినాయకత్వం పూర్తిగా వెనకబడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కనీసం రెబల్స్ కోరుకుంటున్నట్లు రేవంత్ రెడ్డిని తొలగించకపోయినప్పటికీ... ఆయన పని తీరును లోతుగా చూడకపోవటం కూడా అంతర్గత కుమ్ములాటలకు మరింత ఆజ్యం పోసినట్లు అవుతోంది. ఇదే సమయంలో రెబల్స్ నేతలకు గట్టి విశ్వాసం కల్పించటంలో కూడా అధిష్టానం విఫలమైనట్లు తాజా పరిస్థితులు అద్దం పడుతున్నాయి. ఇందుకు డిగ్గీరాజా టూరే పెద్ద ఉదాహరణగా కనిపిస్తోంది.
మరోవైపు వచ్చే ఏడాది(2023) తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్రంలోని పరిస్థితులు చూస్తుంటే మాత్రం కాస్త భిన్నంగానే ఉన్నాయి. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ ఉంది. కానీ వచ్చే (2023)ఎన్నికల్లో మాత్రం అలాంటి పరిస్థితి ఉంటుందా..? లేదా అనేది మాత్రం కాస్త డౌట్ గానే ఉంది. ఎందుకుంటే.. గత కొద్దిరోజులుగా తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతూ వస్తోంది. 'మిషన్ తెలంగాణ' పేరుతో ప్రత్యేక ఆపరేషనే నడుపుతూ... కీలక నేతలను కూడా తమ వైపు తిప్పుకుంటోంది. ప్రతిష్టాత్మకమైన ఉపఎన్నికల్లో గెలిచి.. రాష్ట్రంలో కేసీఆర్ కు తామే ప్రత్యామ్నాయమనే విషయాన్ని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లగల్గింది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ లో నెలకొంటున్న తాజా పరిణామాలు బీజేపీకి మరింతగా కలిసి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. హస్తం నేతలు ఏకతాటిపై లేకపోవటాన్ని కూడా కమలదళం క్యాష్ చేసుకునే ప్రయత్నం ముమ్మరం చేస్తోంది. అసంతృప్త నేతలను పార్టీలోకి రప్పించేందుకు పావులు కూడా కదుపుతోంది.
నిజానికి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు అనేవి చాలా సర్వసాధారణం. విపరీతమైన అంతర్గత ప్రజాస్వామ్యానికి పేరుగా ఉండే హస్తం పార్టీలో... ఇలాంటి సంక్షోభాలు ఎన్నో తలెత్తాయి. వాటిని పార్టీ హైకమాండ్ ఎలా హ్యాండిల్ చేయాలో అలా చేసి నేతలను లైన్ లోకి తీసుకువచ్చిన సందర్భాలు బోలెడుగా ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న పరిస్థితులను కూడా పరిష్కరించటం ఆ పార్టీ నాయకత్వానికి పెద్ద సమస్యేమీ కాదనే చెప్పొచ్చు. గత 8 ఏళ్లుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని క్రమంగా కోల్పోతూ వస్తోంది. మరోసారి ఎన్నికలను ఎదుర్కొనే టైం దగ్గరపడుతున్న వేళ ఈ కుమ్ములాటలు పార్టీని ముంచేలా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధినాయకత్వం... స్పష్టమైన విధానంతో అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేతల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించే మార్గాలను అన్వేషిస్తేనే పార్టీ మళ్లీ నిలబడే అవకాశం ఉంటుంది. అంతర్గత కుమ్ములాటలు ఇలాగే కొనసాగితే... ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్రంలో 'హస్తం' ఉనికే ప్రశ్నార్థకం కాక తప్పదనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి...!