TPCC New Committes : ఒరిజినల్ వర్సెస్ వలస.. టీ కాంగ్రెస్ లో ఆరని కమిటీల చిచ్చు
Revanth reddy Vs Senior Leaders: ఇటీవల పార్టీ అధినాయకత్వం ప్రకటించిన కొత్త కమిటీలు తెలంగాణ కాంగ్రెస్ లో కల్లోలం సృష్టిస్తున్నాయి. పలువురు లీడర్లు అసంతృప్తి రాగం వినిపిస్తుంటే… తాజాగా పార్టీలోని సీనియర్లు భేటీ కావటం.. తామే ఒరిజినల్ లీడర్లమంటూ కామెంట్స్ చేయటం హాట్ టాపిక్ గా మారింది. పరోక్షంగా పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని మరోసారి టార్గెట్ చేసినట్లు అయింది.
Telangana Pradesh Congress New Committees Issue: తెలంగాణ కాంగ్రెస్.... ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ కుదిపేస్తూనే ఉంటుంది. నేతల మధ్య డైలాగ్ లు పేలుతూనే ఉంటాయి. అంతలోనే కలుస్తారు.. మరోవైపు విమర్శలు గుప్పిస్తుంటారు..! ఏదీ చేసినా వారికే చెల్లుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా అంచనా వేయలేం. అలా సాగే తెలంగాణ కాంగ్రెస్ లో తాజాగా మరో అంశం చిచ్చు రేపింది. నూతనంగా ప్రకటించిన కమిటీల చిచ్చు ఆరటం లేదు. పార్టీ అధ్యక్షుడు రేవంత్ టార్గెట్ గా... సీనియర్లు ఏకమయ్యే పనిలో పడ్డారు. ఒరిజినల్ కాంగ్రెస్.. వలస కాంగ్రెస్ అనే వాదన కూడా తెరపైకి తీసుకువస్తున్నారు. ఫలితంగా పార్టీలో అసలేం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది.
తాజా పరిణామాల నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో సీనియర్లు భేటీ అయ్యారు. ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీ, కోదండరెడ్డి, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు తదితరులు హాజరయ్యారు. చాలాసేపే ఈ భేటీ కొనసాగింది. అనంతరం మీడియాతో మాట్లాడిన పలువురు నేతలు... పదవులు అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధినాయకత్వంతో మాట్లాడుతామని చెప్పుకొచ్చారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు అన్యాయం చేసి వలస వచ్చిన వారికి పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్‌ను కాపాడుతున్న తమపై కోవర్టులు అంటూ సోషల్ మీడియాలో ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు.
దాదాపు సీనియర్ నాయకులంతూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పరోక్షంగా విమర్శలు కురిపించారు. కొత్త కమిటీలలో 108 మంది ఉంటే అందులో 50 మంది వలస వచ్చిన వారే అని నిలదీశారు. వలస వచ్చిన వారి నుండి కాంగ్రెస్ ను సేవ్ చేయాలనే మేము చూస్తున్నామంటూ వ్యాఖ్యలు చేశారు. అసలు కాంగ్రెస్ నాయకులం తామే అంటూ స్పష్టం చేశారు. వలస వాదులతో కాంగ్రెస్ కు నష్టం జరుగుతుందన్న సదరు నేతలు... త్వరలోనే ఢిల్లీకి వెళ్తామని చెప్పుకొచ్చారు. సేవ్ కాంగ్రెస్ నినాదంతో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. కుట్రపూరితంగా పార్టీని నాశనం చేసే చర్యలను అడ్డుకుంటామని అన్నారు.
మరోవైపు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి... భట్టికి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. సీనియర్లకు కోమటిరెడ్డి మద్దతు ప్రకటించారని సమాచారం. మొత్తంగా కొత్తగా నియమించిన కమిటీలు... టీ కాంగ్రెస్ ను కుదిపేస్తున్నట్లే కనిపిస్తోంది. ఇదే సమయంలో రేవంత్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు నేతలు. ఈ నేపథ్యంలో కమిటీల విషయంలో అధినాయకత్వం ఏమైనా మార్పులు చేస్తుందా..? తాజా పరిస్థితులు ఎలాంటి పరిణామాలవైపు దారి తీస్తాయనేది చూడాలి.