Revanth Reddy Vs Seniors: కమిటీలపై రేవంత్ టార్గెట్‌గా సీనియర్ల అసంతృప్తి
Revanth Reddy Vs Seniors: ఏఐసీసీ టీపీసీసీకి కొత్త కమిటీలు ప్రకటించడం వాటిపై సీనియర్లు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం.. రాష్ట్ర కాంగ్రెస్ లో మరో గందరగోళానికి దారితీసింది. జంబో కార్యవర్గం కూర్పుకు ఆ ఒక్కడే బాధ్యుడనేలా సీనియర్ల వ్యాఖ్యానిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ టార్గెట్‌గా ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు.
Revanth Reddy Vs Seniors: తెలంగాణ కాంగ్రెస్ ని (Telangana Congress) అంతర్గత పోరు వెంటాడుతోంది. ఒక సమస్య సమసిపోయిందని అనుకుంటుండగానే మరొకటి వచ్చిపడుతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచితీరాలనే సంకల్పానికి.. ప్రధాన నేతల మధ్య విభేదాలు, ఐక్యత లేమి.. ఆటంకాలు సృష్టిస్తున్నాయి. రేవంత్ రెడ్డి (Revanth Reddy) పీసీసీ అధ్యక్షుడయ్యాక పార్టీ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలపై సీనియర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇన్నాళ్లు కలిసి పనిచేసిన నేతలు కూడా పరోక్షంగా టీపీసీసీ చీఫ్ ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇటీవల ఏఐసీసీ(AICC) ప్రకటించిన కమిటీలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పలువురు నేతలు చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
టీపీసీసీ (TPCC) కార్యవర్గ విస్తరణను కొన్నాళ్లు పెండింగ్ లో పెట్టిన అధిష్టానం.. ఇటీవలే జంబో టీమ్ ఏర్పాటు చేసింది. 24 మంది ఉపాధ్యక్షులు, 84 మంది ప్రధాన కార్యదర్శులు, 40 మంది పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు, 18 మంది రాజకీయ వ్యవహారాల కమిటీ, 26 మంది డీసీసీ అధ్యక్షులను ప్రకటించింది. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించిన స్టార్ కాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డికి (Komatireddy Venkat reddy) కొత్త కార్యవర్గంలో చోటు కల్పించలేదు. మిగతా సీనియర్లందరికీ ఏదో ఒక కమిటీలో స్థానం లభించింది. అయితే.. ఈ జాబితా వెలువడగానే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనుచరులకు ప్రాధాన్యం దక్కిందనే వాదనలు వచ్చాయి. ఆయన వెంట నిత్యం ఉండేవారికి మంచి అవకాశాలు కల్పించారనే ఆరోపణలు మొదలయ్యాయి. ఏ పార్టీలో అయినా కొత్త కమిటీలు, పదవులు భర్తీ చేసినప్పుడు అసంతృప్తులు సహజమే. కానీ, అందుకు బాధ్యుడు ఆ ఒక్కడే అనేలా తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు ఉన్నాయి.
జంబో కార్యవర్గ ప్రకటన వెలువడిన వెంటనే చాలా మంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్ నాయకురాలు కొండా సురేఖ పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ పదవికి రాజీనామా చేశారు. పార్టీలు మారిన వారికి రాజకీయ వ్యవహారాల కమిటీలో స్థానం కల్పించి, తనను ఎగ్జిక్యూటివ్ కమిటీకే పరిమితం చేయడం బాధ కలిగించిందని చెప్పారు. ఈ మేరకు రేవంత్ కి లేఖ రాశారు.
పదవుల అలకలపై స్పందించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క... కమిటీల కూర్పునకు తనని పిలవలేదని.. ఈ విషయమై రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ ను అడిగితే తెలుస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీసీసీ చీఫ్, సీఎల్పీ నేత ఇద్దరూ ముఖ్యమనేమని పేర్కొంటూ.. పార్టీ వ్యవహారాల్లో తమకు ప్రాధాన్యం కల్పించడం లేదని పరోక్షంగా చెప్పారు.
మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ అసమ్మతి స్వరాన్ని పెంచి.. పార్టీలో కోవర్టులకే ప్రాధాన్యం లభిస్తోందని, కోవర్టు రాజకీయాలతో టీ కాంగ్రెస్ కు నష్టం కలుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవర్టిజం అనే జబ్బుతో కాంగ్రెస్ పార్టీ బాధ పడుతోందన్నారు. కాంగ్రెస్‌లో ఉంటూ, కాంగ్రెస్ పార్టీ పాట పాడుతూ ప్రభుత్వానికి పరోక్షంగా మద్దతిచ్చే శక్తులు పార్టీలో ఉన్నాయని విమర్శించారు. భారత్ జోడో యాత్రను విజయవంతం చేసిన వారికి పదవులు దక్కలేదని ఆరోపించారు. ఎవరి సారథ్యంలో పదవుల పంపకం జరిగిందంటూ రాజనరసింహ వేసిన ప్రశ్న సూటిగా రాష్ట్ర సారథికేనా ?
ఎలాంటి అసంతృప్తి ఉన్నా, పార్టీ వేదికలపై పంచుకోవాలని, బహిరంగంగా విమర్శలు చేయవద్దని రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ సందర్భంగా నేతలకు హెచ్చరిక జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ మాటలను రాష్ట్ర నాయకులు అంత సీరియస్ గా తీసుకోలేదని ప్రస్తుత ఆరోపణలు చూస్తుంటే స్పష్టం అవుతోంది. కార్యవర్గ కూర్పు పూర్తిగా రేవంత్ స్కెచ్ ప్రకారమే జరిగిందన్నట్లుగానే సీనియర్ల మాటలు ఉన్నాయి. పార్టీ మారిన వారికి పదవులు ఇచ్చారనే ఆరోపణ.. పరోక్షంగా పీసీసీ చీఫ్ ని ఉద్దేశించి చేసినట్లుగానే కనిపిస్తోంది. మొత్తంగా, ఈ పరిస్థితిలో కాంగ్రెస్ అధిష్టానం సీనియర్ల అసంతృప్తిపై ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది. ముఖ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని కమిటీలో మార్పులు చేస్తుందా ? లేక రేవంత్ ఆగే బడో అని హామీ ఇస్తుందా ? ఈ మొత్తం పరిణామాలను చూస్తుంటే.. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి సారథ్యం ఒక్క అడుగు ముందుకి.. రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారినట్లు కనిపిస్తోంది.