T Congress Internal Fight: రంగంలోకి డిగ్గీ రాజా.. అంతా సెట్ చేస్తారా..?-digvijay singh meeting with telangana congress leaders at hyd over internal fight issue ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  T Congress Internal Fight: రంగంలోకి డిగ్గీ రాజా.. అంతా సెట్ చేస్తారా..?

T Congress Internal Fight: రంగంలోకి డిగ్గీ రాజా.. అంతా సెట్ చేస్తారా..?

HT Telugu Desk HT Telugu
Dec 22, 2022 07:46 AM IST

Telangana Conngress Latest News: కొత్త కమిటీల చిచ్చుతో రెండు వర్గాలుగా విడిపోయింది తెలంగాణ కాంగ్రెస్. గత కొద్దిరోజులుగా నేతల మధ్య డైలాగ్ లు పేలుతున్నాయి. ఈ అంశంపై ఫోకస్ పెట్టిన ఆ పార్టీ అధినాయకత్వం... సీనియర్ నేత అయిన దిగ్విజయ్ సింగ్ ను రంగంలోకి దింపింది.

హైదరాబాద్ చేరుకున్న దిగ్విజయ్ సింగ్
హైదరాబాద్ చేరుకున్న దిగ్విజయ్ సింగ్ (twitter)

Telangana Pradesh Congress New Committees Issue: తెలంగాణ కాంగ్రెస్.... ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ కుదిపేస్తూనే ఉంటుంది. నేతల మధ్య డైలాగ్ లు పేలుతూనే ఉంటాయి. అంతలోనే కలుస్తారు.. మరోవైపు విమర్శలు గుప్పిస్తుంటారు..! ఏదీ చేసినా వారికే చెల్లుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా అంచనా వేయలేం. అలా సాగే తెలంగాణ కాంగ్రెస్ లో తాజాగా కమిటీల అంశం చిచ్చు రేపిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి టార్గెట్ గా... సీనియర్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒరిజినల్ కాంగ్రెస్.. వలస కాంగ్రెస్ అనే వాదన కూడా తెరపైకి తీసుకువచ్చారు. ఇదే సమయంలో టీడీపీ నుంచి పార్టీలోకి వచ్చిన నేతలు.. వారి పదవులకు కూడా రాజీనామాలు ఇచ్చారు. దీంతో పార్టీలో అసలు ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేతను రంగంలోకి దింపింది కాంగ్రెస్ అధినాయకత్వం. ఈ క్రమంలో హైదరాబాద్ చేరుకున్న దిగ్విజయ్ సింగ్... ఇవాళ నేతలతో విడివిడిగా చర్చించనున్నారు.

ఆ నేతలతో చర్చలు..

బుధవారం సాయంత్రం ఆయన హైదరాబాద్ చేరుకున్నారు డిగ్గీ రాజా(దిగ్విజయ్ సింగ్). హోటల్ తాజ్ కృష్ణలో బస చేసిన ఆయనను... బుధవారం ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి కలిశారు. పార్టీకి సంబంధించిన పలు అంశాలు, కమిటీలు, ఇటీవల కాలంలో చెలరేగిన అసంతృప్తులు సహా రాష్ట్ర నాయకత్వంపై చర్చించారు. ఈ సందర్భంగా.. కోమటిరెడ్డి వెంకట రెడ్డి నుంచి దిగ్విజయ్ పలు సూచనలు తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు ఇటీవల ఏఐసీసీ ప్రకటించిన కమిటీలపై అసంతృప్తితో ఉన్న సీనియర్లతో దిగ్విజయ్ సింగ్ గురువారం ఉదయం 10 గంటల తర్వాత భేటీ కానున్నారు. వారి అభ్యంతరాలను అడిగి తెలుసుకోనున్నారు. ఉమ్మడి భేటీ తర్వాత... ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడతారని తెలుస్తోంది. సేవ్ కాంగ్రెస్ అంటూ సీనియర్లు అసమ్మతి రాగం ఎత్తుకోవడంతో.. కమిటీ పదవులకు రాజీనామా చేసిన 12 మంది నేతలతో కూడా దిగ్విజయ్ సింగ్ సమావేశమయ్యే అవకాశం ఉంది. వీరిలో ఎమ్మెల్యే సీతక్క కూడా ఉన్నారు. అందరి అభిప్రాయాలను తెలుసుకుని.. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, సమస్యలను సరిదిద్దేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధిష్టానానికి దిగ్విజయ్ నివేదిక అందించనున్నారు.

పార్టీ దూతగా వచ్చిన డిగ్గీ రాజా ముందు తమ వాదనలు వినిపించేందుకు సీనియర్లతో పాటు రేవంత్ వర్గం కూడా సిద్ధమైపోయింది. ప్రధానంగా గత కొద్దిరోజులుగా పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, కొత్త కమిటీల నియామకం వంటి అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. రేవంత్ తీరుపై సీనియర్లు ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉండగా... పార్టీ కోసం కష్టపడుతున్న విధానాన్ని డిగ్గీకి వినిపించేందుకు రేవంత్ వర్గం చూస్తోంది. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఇవాళ్టి సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరుకాకపోవచ్చని సమాచారం.

మొత్తంగా ట్రబుల్ షూటర్ గా పేరున్న డిగ్గీరాజా.. టీ కాంగ్రెస్ నేతల అంతర్గత పోరును సెట్ చేస్తారా..? లేక బంతిని అధిష్టానం కోర్టులోకి పంపిస్తారా..? అనేది చూడాలి.

Whats_app_banner