Dissident in TPCC : సీనియర్ల సేవ్ కాంగ్రెస్ నినాదం ! మొదటికే మోసం ?
Dissident in TPCC : తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నేతల “సేవ్ కాంగ్రెస్” నినాదం.. పార్టీలో కలకలం రేపుతోంది. ఓ వైపు ఇతర పార్టీలు చేరికలతో బలాన్ని పెంచుకోవాలని చూస్తుంటే… టీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడాన్ని తప్పుపడుతున్నారు. అధికారంలోకి రావాలన్న లక్ష్యాన్ని వదిలి… పార్టీలో పై చేయి కోసం జరుగుతున్న పంచాయతీలు.. హస్తం పార్టీని నైరాశ్యంలోకి నెడుతున్నాయి !
Dissident in TPCC : తెలంగాణ కాంగ్రెస్ లో అదే గందరగోళం. అదే అనిశ్చితి. అసెంబ్లీ ఎన్నికలకు సమయం కొద్దిగానే ఉన్నా.. ఇంకా పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు పుల్ స్టాప్ పడటం లేదు. టీపీసీసీ ఓ వైపు హాత్ సే హాత్ జోడో యాత్రకు సన్నద్ధం అవుతుంటే.. మరో వైపు సీనియర్లు "సేవ్ కాంగ్రెస్" అంటూ కొత్త నినాదం అందుకుని పార్టీ శ్రేణులని మరోసారి అయోమయంలో పడేశారు. సహజంగా... అధికార పార్టీ, ప్రభుత్వం నుంచి వచ్చే దాడులు, ఇబ్బందులు, ఆపరేషన్ ఆకర్ష్ లను ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలు ఏకమవుతారు. పార్టీని కాపాడుకుందామని ఐక్య నినాదాలు చేస్తారు. కానీ ఇటీవల తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేతలు చేసిన సేవ్ కాంగ్రెస్ నినాదం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. వలస నేతల నుంచి పార్టీని కాపాడాలంటూ కోరుతూ అధిష్టానానికి తమ అసమ్మతి రాగాన్ని వినిపించేందుకు సీనియర్లు ఆ నినాదాన్ని ఎత్తుకున్నారు. అయితే... బహిరంగంగా వారు చేసిన ప్రకటనలే ప్రజల్లో పార్టీపై ఉన్న కాస్త విశ్వాసాన్ని తగ్గిస్తాయన్న విషయాన్ని సీనియర్లు ఎలా మరిచారు ? నిజమైన కాంగ్రెస్.. వలస కాంగ్రెస్ అంటూ.. తమలో తామే అడ్డుగోడలు నిర్మించుకుని .... ప్రత్యామ్నాయం కోసం చూస్తోన్న తెలంగాణ ఓటరుకి ఏ సందేశం పంపుతున్నారు ?
ఇటీవల విడుదలైన అవతార్ - 2 సినిమాలో మెట్కాయిన్లు అనే సముద్ర తెగ ఉంటుంది. హీరో, అతడి కుటుంబం ఆశ్రయం కోరుతూ మెట్కాయన్ల దగ్గరికి వచ్చినప్పుడు మొదట్లో వ్యతిరేకిస్తారు. కానీ తర్వాత వారిని తమరిలో ఒకరిగా గుర్తిస్తారు. శత్రువులపై అంతా కలిసి పోరాడి విజయం సాధిస్తారు. హీరో జేక్ మరియు అతడి కుటుంబాన్ని బయటి వారిగానే ట్రీట్ చేస్తే.. వారిలో ఐక్యత సాధ్యమయ్యేది కాదు. శత్రువు ఆటకట్టించడంలో విఫలమయ్యేవారు. కానీ మెట్కాయిన్లు అలా చేయలేదు. బయట నుంచి వచ్చినా, వారినీ తమలో ఒకరిగా ఆదరణ చూపి ఆశ్రయం కల్పించారు. శత్రువు దౌర్జన్యాలపై ఉమ్మడిగా పోరాడి .. తమ ఉనికిని, ప్రకృతి సంపదను కాపాడుకున్నారు. ఇలాంటి ఐక్యతే.... తెలంగాణ కాంగ్రెస్ లో లోపించింది. సమష్టి బలంతో రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ పై పోరాడాల్సిన టీ కాంగ్రెస్ సీనియర్లు... వలస కాంగ్రెస్, నికార్సైన కాంగ్రెస్ అనే అడ్డుగోడలు నిర్మిస్తున్నారు. అంతా కలిసి సాగాల్సిన చోట.. వేర్వేరు బాటలు వేసి శ్రేణుల్లోను గందరగోళం సృష్టిస్తున్నారు. వెరసి.. నేతల ఈ తీరుతో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకీ దిగజారుతోంది.
మళ్లీ అధికారం కోసం శ్రమిస్తున్న బీఆర్ఎస్... ఎలాగైనా అధికారంలోకి రావాలని కలలు కంటున్న బీజేపీ... కాంగ్రెస్ నేతలపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తున్నాయి. ఆ పార్టీ నుంచి వచ్చిన నేతలకు మంత్రి పదవులూ ఇస్తున్నాయి. కానీ కాంగ్రెస్ లో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారంటూ అంతర్గత పంచాయతీ నడుస్తోంది. టీపీసీసీ నూతన కమిటీల్లో టీడీపీ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యం ఇచ్చారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తదితర సీనియర్ నేతలు.... ఆరోపిస్తున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధిష్టానం జీ23 నేతల అసమ్మతి రాగం వినిపించినట్లుగానే... రాష్ట్ర స్థాయిలో జీ 9 నేతలు... టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్గం టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నూతన కమిటీల ఏర్పాటులో కనీసం తమని సంప్రదించలేదని, తమ అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోలేదన్నది వారి ఆరోపణ. అందుకే... తాము అసలు టీపీసీసీ నూతన కమిటీలను గుర్తించడం లేదని వ్యాఖ్యానించారు. రేవంత్ టార్గెట్ గా కార్యాచరణపై కసరత్తు చేస్తున్న సీనియర్ నేతలు.. గాంధీభవన్ లో ఆదివారం జరిగిన టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశానికి దూరంగా ఉన్నారు. అయితే.. జీ 9 గా పేర్కొంటున్న సీనియర్లు మినహా... మిగతా ప్రధాన నేతలంతా ఈ సమావేశానికి వచ్చారు. దేశవ్యాప్తంగా తలపెట్టిన హాత్ సే హాత్ జోడో యాత్రను తెలంగాణలో ఎలా కొనసాగించాలనే అంశంపై ఈ సమావేశం చర్చించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ ఆధ్వర్యంలో... వచ్చే ఏడాది జనవరి 2 నుంచి జూన్ 2 వరకు తెలంగాణలోని 99 నియోజకవర్గాల మీదుగా ఈ యాత్ర చేపట్టాలని నిర్ణయించి... అసమ్మతి నేతలకు షాక్ ఇచ్చింది. మరి... ఏఐసీసీ నిర్ణయానికి అనుగుణంగా జరిగిన విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి డుమ్మా కొట్టి.. సీనియర్ నేతలు ఏం సాధించినట్టు ? ఏఐసీసీ అనుమతి లేకుండా రేవంత్ పాదయాత్ర ప్రకటన చేస్తారా ? సీనియర్ నేతల అసంతృప్తి అధిష్టానానికి ఇప్పటి వరకు చేరకుండా ఉంటుందా ?
కాంగ్రెస్ అధిష్ఠానం.. రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించిన నాటి నుంచి పార్టీలో అసంతృప్త జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. కొందరు అడపాదడపా బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నా... మళ్లీ సైలెంట్ అయిపోతున్నారు. పరిస్థితి సద్దుమణిగిందని అనుకున్నప్పటికీ... సందు దొరికిన ప్రతీసారి రేవంత్ పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, కలుపుకొనిపోవడం లేదని నిరసన గళం వినిపిస్తున్నారు. ముసుగులో గుద్దులాటలా, నివురుగప్పిన నిప్పులా వివాదం తీవ్రంగానే ఉంది. కానీ... తాజాగా కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన టీపీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీల ప్రకటన పెను వివాదానికి దారితీసింది. అధిష్ఠానం తమను సంప్రదించకుండానే కమిటీల్ని కూర్చిందంటూ సీనియర్లు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఓ అడుగు ముందుకేసి... అసలైన కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్యత ఇవ్వలేదని, వలస వచ్చిన వారికే పదవులు ఇచ్చారని ఆగ్రహాన్నంతా వ్యక్తం చేశారు. సీనియర్ నేతల ఈ ఆరోపణలపై రేవంత్ వర్గం తీవ్రంగా స్పందించింది. ఎమ్మెల్యే సీతక్క సహా టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన 12 మంది నేతలు పీసీసీ కమిటీల్లో తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖ విడుదల చేశారు. పదవుల పేరుతో పంచాయతీలు పెట్టుకోవడం పార్టీకి నష్టం చేస్తుందని.. ఐక్యంగా పోరాడి బీఆర్ఎస్ ను ఓడించాలని లేఖలో పేర్కొన్నారు. నికార్సైన కార్యకర్తలుగా పార్టీ గెలుపు కోసం పని చేస్తామని ప్రకటించి... సీనియర్లకు కౌంటర్ ఇచ్చారు.
దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చి.. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా తెలంగాణలో కాంగ్రెస్ పట్ల కృతజ్ఞతా భావం ఉంది. అయితే దాన్నిఓట్లుగా మలుచుకోవాలంటే మాత్రం.. సమర్థవంతమైన నాయకత్వం కావాలి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఒక ప్రైమ్ ఫేస్ ఉండాలి. ప్రస్తుతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సీనియర్లలో ఎంత మంది రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూప కలుగుతారు ? వీరిలో ఎంత మంది ఇతర నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులని తమ చరిష్మాతో గెలిపించగలరు ? ఈ లెక్కలేవి బేరీజు వేసుకోకుండా కేవలం వలస నేతలు అన్న సాకు చూపి... బలమైన నాయకత్వాన్ని పార్టీకి దూరం చేస్తే ఎవరికి నష్టం ? కొత్త వాళ్లతోనే పార్టీకి సమస్య అంటే.. మరి ఎనిమిదేళ్లలో వరుస ఓటములకు కారణం ఎవరు...? సేవ్ కాంగ్రెస్ అంటూ సీనియర్లు చేస్తున్న ఉద్యమం.... కాంగ్రెస్ కంటే.... టీఆర్‌ఎస్, బీజేపీకి అస్త్రాలుగా మారే ప్రమాదం లేదా...? ఈ విషయం పార్టీ పెద్దలకు అర్థం కావడం లేదా...? పార్టీ ఎదుగుతుంటే... కిందకు తొక్కే పన్నాగాలు ఎవరివి..? అందులో పావులుగా మారుతున్నదెవరు....? అంటూ... రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు.. రేవంత్ కూడా అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. సీనియర్ నేతలపై సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వెరసి.. అటు సీనియర్లు, ఇటు రేవంత్ టీం... ఇద్దరు మొండి పట్టుదలకు పోయి... రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పాతాళంలోకి నెట్టేస్తున్నారని సగటు కాంగ్రెస్ అభిమానులు ఆవేదన చెందుతున్నారు.
ఈ మొత్తం పరిణామాలను ఆసక్తిగా పరిశీలిస్తోంది.. బీజేపీ పార్టీ. ఏ చిన్న అవకాశం వచ్చినా, దాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని రాష్ట్రంలో బలపడేందుకు ఉపయోగించుకుంటున్న కమలం నేతలు... కాంగ్రెస్ లో ప్రస్తుతం కొనసాగుతోన్న పంచాయతీపై కన్నేశారు. రియల్ కాంగ్రెస్ అంటూ అధిష్టానం, రాష్ట్ర నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సీనియర్లకు ఎర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిలో ఒకరో ఇద్దరో తమ గూటికి వస్తే.. చేరికల జోరు పెరుగుతుందని ఆశిస్తున్నారు. మరి... బీజేపీ ఆశలు నెరవేరుతాయా ? కాంగ్రెస్ లో ముదిరి పాకాన పడిన పదవుల పంచాయతీపై అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుంది ? రేవంత్ రెడ్డి అండ్ టీం.. మరియు సీనియర్ నేతల మధ్య ఎలా సయోధ్య కుదుర్చుతుందో చూడాలి !