KCR BRS Party : క్రిస్మస్ తర్వాత ఈ ఆరు రాష్ట్రాల్లోకి బీఆర్ఎస్
BRS Party : బీఆర్ఎస్ కార్యకలాపాలు ఇతర రాష్ట్రాలకు విస్తరించేందుకు కేసీఆర్ ప్రణాళికలు వేస్తున్నారు. ఇందులో భాగంగా వరుస సమావేశాలు జరగనున్నాయి. డిసెంబర్ చివరి వారంలో రైతు సంఘాల, ఇతర నేతలతో సమావేశాలు ఉండనున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవలే దేశ రాజధానిలో భారత రాష్ట్ర సమితి(bharat rashtra samithi) కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభమైంది. ఇక పార్టీ విస్తరణపై కేసీఆర్(KCR) దృష్టి సారించినట్లు తెలుస్తోంది. డిసెంబర్ నెలాఖరు నుంచి బీఆర్ఎస్ కార్యకలాపాలు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఊపందుకునేలా ప్రణాళికలు చేస్తున్నట్టుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. క్రిస్మస్ తర్వాత దిల్లీలో కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేసి పార్టీ కార్యాచరణను ప్రకటించాలని భావిస్తున్నారు.
డిసెంబర్ చివరి వారంలో దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలతోపాటు ప్రధానంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, హర్యానాలో భారత రాష్ట్ర సమితి (BRS) గేర్లు మార్చేందుకు రెడీ అవుతోంది. పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మార్చేందుకు భారత ఎన్నికల సంఘం(Election Commission) ఆమోదం తెలిపిన నేపథ్యంలో పార్టీ భావజాలాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు పార్టీ నేతలు ప్రయత్నాలు వేగవంతం చేశారు. డిసెంబర్ 14న దిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, కర్ణాటక నుండి హెచ్‌డి కుమారస్వామి పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరు కాగా, రాజకీయ నాయకులు, రైతులు, మేధావులు, ఇతర ప్రముఖులతో సహా వివిధ వర్గాల ప్రజలు తమ మద్దతును అందించారు. వారిలో కొందరు చేరడానికి ఆసక్తిని కూడా వ్యక్తం చేశారు. అయితే పార్టీ ఎజెండాను ప్రకటించే వరకు ఆగాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు.
కేసీఆర్(KCR) ఇప్పుడు పార్టీ విస్తరణ ప్రణాళికలను ఖరారు చేశారు. తదనుగుణంగా, BRS అనుబంధ రైతుల సెల్ భారత రాష్ట్ర కిసాన్ సమితి (BRKS) డిసెంబర్ చివరి నాటికి ఆరు రాష్ట్రాల్లో తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వెంటనే మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశాలో పార్టీ యూనిట్లను తెరుస్తుంది. దీని ద్వారా ప్రజల్లోకి తమ ప్రాధాన్యతలపై గట్టి సంకేతం వెళుతుందని పార్టీ నాయకత్వం అభిప్రాయపడుతోంది. బీఆర్‌ఎస్(BRS)తో రైతులు, సుస్థిర వ్యవసాయానికి ప్రాధాన్యత ఉంటుందని నేతలు అంటున్నారు.
ఇతర రాష్ట్రాలకు చెందిన సిట్టింగ్, మాజీ ఎమ్మెల్యేలతో సహా అనేక మంది సీనియర్ రాజకీయ నాయకులు BRS వైపు తీసుకొచ్చేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నాయకులతో సమన్వయం చేసేందుకు ఓ టీమ్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే కేసీఆర్(KCR)తో కొంతమంది సంప్రదింపులు జరిపినట్టుగా టాక్. దిల్లీలో పార్టీ ఎజెండాను ప్రకటించిన తర్వాత BRSలో చేరికలపై దృష్టి పెడతారు.
అజెండాను కేసీఆర్ ఆవిష్కరించిన వెంటనే తెలంగాణతో పాటు ఆరు రాష్ట్రాల్లో BRKS యూనిట్లు కార్యకలాపాలు ప్రారంభించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రజల్లో పార్టీ అజెండా, మేనిఫెస్టోపై అవగాహన కల్పించేందుకు, నిరుద్యోగ యువత, మహిళలు, ఇతరుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు బీఆర్‌ఎస్ ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు సాహిత్య నిపుణులు, కవులు, ఇతరులతో కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారని పార్టీ ఆ వర్గాలు తెలిపాయి.
దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావడానికి ఆయా రాష్ట్రాల్లోని రాజకీయాలు, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక సహా ప్రాధాన్యతా రంగాలను పార్టీ నాయకత్వం గుర్తిస్తుంది. వివిధ రాష్ట్రాల్లోని స్థానిక భాషల్లో ఆడియో, వీడియో పాటల ద్వారా పార్టీ భావజాలాన్ని వ్యాప్తి చేయాలని నిర్ణయించారు. పార్టీ ప్రాధాన్యతలను ముందుగానే వివరించినప్పటికీ, డిసెంబర్ చివరి వారంలో దిల్లీలో జాతీయ మీడియా ముందు కేసీఆర్.. పార్టీ అజెండాతో పాటు కార్యాచరణ ప్రణాళికను వెల్లడించే అవకాశం ఉంది.
సంబంధిత కథనం