Telangana Congress : కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? సేవ్ చేస్తారా? ముంచేస్తారా?
Congress Politics : తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇటీవలే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా బల ప్రదర్శన చేశారు. కొన్నిరోజులు అయిందో లేదో.. మళ్లీ యథావిధిగా పార్టీలో కుమ్ములాటలు మెుదలయ్యాయి.
తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) పార్టీ సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల ప్రకటించిన కమిటీలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి మీద సీనియర్లు కోపంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. రేవంత్ నిర్వహించే కార్యక్రమాల్లో పాలు పంచుకోకూడదని నిర్ణయించుకున్నారు. అంటే ఇక సొంత కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. సేవ్ కాంగ్రెస్(Save Congress) అంటూ.. సీనియర్లు నినాదం ఎత్తుకున్నారు. ఎప్పుడూ అంతర్గత పోరుతో కనిపించే హస్తం పార్టీకి.. ఇది మరో షాక్ లా తగిలింది.
మల్లు భట్టి విక్రమార్క నివాసంలో శనివారం జరిగిన సమావేశానికి ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ లోక్‌సభ సభ్యుడు మధుగౌడ్ యాష్కీ, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తదితర పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పార్టీలో అంత ప్రాధాన్యం ఎందుకని సీనియర్లు మండిపడుతున్నారు. పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నవారి కంటే మిగిలినవారికి ఎలా ప్రాధాన్యత ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల నియమితులైన పార్టీ కమిటీల్లో వలసదారులకే ప్రాధాన్యతం ఇచ్చారని అంటున్నారు.
2021లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తర్వాత పీసీసీ(PCC0 పగ్గాలను రేవంత్‌రెడ్డి పట్టుకున్నారు. 2017 వరకు టీడీపీ(TDP)లోనే రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయన నియామకం సమయంలో కూడా అనుభవజ్ఞులను పక్కనబెట్టి కొత్త వ్యక్తికి ఎలా ప్రాధాన్యత ఇచ్చారనే దానిపై నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇప్పుడు తాజాగా కమిటీలపై మళ్లీ ఇదే చర్చ మెుదలైంది. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నా.. తమపై కోవర్టు ముద్రలు వేస్తున్నారని సీనియర్లు హర్ట్ అవుతున్నారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క తదితర సీనియర్ నేతలపై కోవర్టులు అనే ప్రచారం జరిగింది. దీనిపై కూడా సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు. రేవంత్ పీసీసీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ.. కోవర్టులు అనే పదం ఎక్కువగానే వినిపిస్తుంది. అయితే ఇటు రాష్ట్ర నాయకత్వం.. అటు అధిష్టానం ఎప్పుడూ స్పందించలేదు. రేవంత్ రెడ్డే కావాలనే చేస్తున్నారని ప్రచారం జరిగింది. ఇలాంటి వాటితో తనకు సంబంధం లేదని.. రేవంత్ రెడ్డి(Revanth Reddy) చెప్పారు. కానీ కోవర్టులు లేరని ఎప్పుడూ చెప్పలేదు.
మరో ఆసక్తిక విషయం ఏంటంటే.. పార్టీ వ్యుహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంలో కోవర్టులకు సంబంధించిన సమాచారం వెలుగులోకి వచ్చిందని ప్రచారం జరుగుతుంది. ఈ ఘటనపై ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. తనపై దుష్ప్రచారం చేసే విధంగా తలలు మార్చిన.. మార్ఫింగ్ ఫొటోలు సునీల్ కార్యాలయంలో దొరికాయని ఉత్తమ్ చెప్పుకొచ్చారు. దీనిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ వ్యుహకర్తగా ఉండి.. సునీల్ అలా ఎందుకు చేస్తారని ప్రశ్నలు వస్తున్నాయి.
ఇక ఇటీవలే ప్రకటించిన కమిటీల్లో ఎక్కువగా రేవంత్ రెడ్డికి మద్దతు ఉన్నవాళ్లకే పదవులు వచ్చాయని సీనియర్లు అంటున్నారు. ఇలా ఉంటే పార్టీ తమ చేతుల్లో నుంచి వెళ్తొందని.. బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికోసమే సేవ్ కాంగ్రెస్(Save Congress) నినాదాన్ని సీనియర్లు ఎత్తుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ కమిటీల్లో ఎలాంటి పదవీ.. దక్కని మరో నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkatreddy).. సీనియర్లకు మద్దతు తెలుపుతున్నారు. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. మీ వెంట నేను అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో అంతర్గత పోరు ఉంది. అప్పుడప్పుడు బయటకు కనిపిస్తూ ఉంటుంది. తాజాగా పెద్ద ఎత్తున అసంతృప్తివాదులు బయటకువచ్చారు. వారంతా సీనియర్లే. ఇప్పుడు ఈ అంశంపై చర్చమెుదలైంది. ఇలా పార్టీని రోడ్డు మీదకు తీసుకొస్తే.. నష్టపోయేది మనమేనని కొంతమంది చెబుతున్నారు. ఏదైనా ఉంటే.. కూర్చొని పరిష్కరించుకోవాలని అంటున్నారు. ఇలాంటి ఘటనలే.. మునిగిపోతున్న పడవను ఇంకా మునిగేలా చేస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటివి చూసినప్పుడు కార్యకర్తల్లో గందరగోళం నెలకొంటుందని చెబుతున్నారు. సేవ్ కాంగ్రెస్.. అంటూ పార్టీని ముంచేయోద్దని.. తప్పో.. ఒప్పో కూర్చొని మాట్లాడుకుని.. జనాల్లోకి పార్టీని తీసుకెళ్లాలని కొంతమంది కాంగ్రెస్ నేతలు కామెంట్స్ చేస్తున్నారు.