Rudrabhishekam: రుద్రాభిషేకం అంటే ఏమిటి? దీని విశిష్టత ఏమిటి? అది ఎలా ఆచరించాలి?
Rudrabhishekam: శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు చేసే రుద్రాభిషేకం చేయడం చాలా మంచిది. ఈ అభిషేకం ఎలా చేయాలి? దీని విశిష్టత ఏంటి? ఎలా ఆచరించాలి అనే వివరాల గురించి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా తెలియజేశారు.
Rudrabhishekam: ధర్మబద్ధమైన కోర్కెలు పొందడానికి ఆయుః దీర్ఘాయుష్షు, ఆరోగ్యము, ఐశ్వర్యము పొందడానికి రుద్రాభిషేకం చాలా ఉత్తమమైనదని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
శివుడు భోళాశంకరుడని, అభిషేక ప్రియుడని, ఐశ్వర్య ప్రదాత అని కోరిన వెంటనే కోర్కెలు తీర్చేవాడు. అలాంటి శివానుగ్రహం పొందడానికి ఇహలోకములో ఉన్న కోరికలు పొందడానికి రుద్రాభిషేకం ఉత్తమమైనదని చిలకమర్తి తెలిపారు. అనారోగ్యముతో బాధపడేవారు, గ్రహ బాధలు, గ్రహ పీడలు ఉండేటువంటివారు రుద్రాభిషేకం చేసుకోవడం మంచిదని చిలకమర్తి తెలిపారు. ఈ రుద్రాభిషేకాన్ని ఏ రోజైనా ఆలయాలలో గాని శివాలయాలలో గాని గోశాలలో గాని లేదా స్వగృహమునందు కూడా ఆచరించుకోవచ్చు. అయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొన్ని ప్రత్యేక రోజులలో రుద్రాభిషేకం వంటివి చేసుకోవడం విశేషమైన ఫలదాయకమని చిలకమర్తి చెప్పారు.
సంవత్సరంలో మహా శివరాత్రి రోజు, మాసములలో మాస శివరాత్రి రోజు, శ్రావణ, కార్తీక మాసం వంటి విశేషమైన మాసములలో చేసుకోవచ్చు. అలాగే వారాలలో సోమవారం రోజు, తిథులలో ఏకాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులలో రుద్రాభిషేకాలు చేసుకోవడం చాలా విశేషమని చిలకమర్తి తెలియచేశారు. మహాన్యాపూర్వక రుద్రాభిషేకం రెండు విధములుగా చేసుకొనవచ్చును.
శివాలయమునకు వెళ్ళి తమ గోత్రనామములతో ఇతరులచేత చేయించుకొనుట, అభిషేకానంతరం తీర్ధ ప్రసాదములను స్వీకరించుట ఒక పద్ధతి. అయితే ఇందులో స్వయంగా అభిషేకం చేసుకొన్న తృప్తి లభ్యం కాదు. అందువలన చాలామంది తామే తమ ఇంటిలోనే రుద్రాభిషేకం చేసుకోవాలని కోరుకుంటున్నారు. అయితే కొందరు ఇంట్లో రుద్రాభిషేకం చేసుకొనకూడదని అంటున్నారు. కానీ అది అంతగా పట్టించుకొనవలసినమాట కాదు.
భగవంతుని అర్చించే విధానాలలో రుద్రాభిషేకం ఒకటి. అందుచేత ఇంట్లో చేసుకొనటంలో ఎలాంటి దోషం ఉండదు. అనేక పూజావ్రతాదులు ఇంట్లోనే చేసుకొంటున్నాము. ఇది కూడా అంతే. కేవలం భగవంతునిపై భక్తి, వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యమని చిలకమర్తి తెలియచేశారు.
రుద్రాభిషేకానికి అవసరమైన సామాగ్రి
పసుపు, కుంకుమ, అక్షతలు, ధవళాక్షతలు, హారతి కర్పూరం, మంచి గంధము (కలిపి పెట్టుకొనవలెను), పుష్పాలు, తమలపాకులు, వక్కలు లేక వక్కపొడి, అరటిపండ్లు లేక ఇతర ఫలాలు, కొబ్బరి కాయలు (కనీసం రెండు), పత్తితో చేసిన వస్త్రం, పత్తితో చేసిన యజ్ఞోపవీతం, విభూతి, బిల్వ దళాలు, ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, గంగోదకం లేక నదీజలం, మామిడి ఆకులు, గంట, పెద్దపీట, గ్లాసులు-3, ఉద్ధరిణలు (చెంచాలు) 3, చిన్న పళ్ళాలు- 3, దీపారాధన కుంది, వత్తులు, నువ్వుల నూనె, అగ్గిపెట్టి, మహానివేదనకు వివిధ వంట కాలతో కూడిన ప్రసాదము. బిందెతో అభిషేక జలం, పానవట్టముతో ఉండదే శివలింగ ప్రతిమ, తుండుగడ్దు (తువ్వాలు), సుగంధ ద్రవ్యాలు (యాలకుల పొడి, కుంకుమ పువ్వు, పచ్చ కర్పూరం (తగుమాత్రంగా), అగరువత్తులు గుచ్చటానికి చిన్న స్టాండు, పండ్ల గుజ్జు మూతతో సహా గిన్నె, చిన్న పళ్ళెంతో బియ్యం, అభిషేకించిన జలం తీసే పాత్ర.
రుద్రాభిషేకం చేసే విధానం
అభిషేకం చేసే ప్రదేశం కొంత విశాలంగా ఉండటం అవసరం. తూర్పు వైపున వీలుకాకపోతే, ఉత్తరం వైపు గోడ దగ్గర యజమాని అంటే అభిషేకం చేసే వ్యక్తి తూర్పు ముఖంగా లేక ఉత్తర ముఖంగా కూర్చొని అభిషేకం చేయాలి. గోడకు దేవుని చిత్రపటాలు ఉంటే మంచిది. గోడకు వీలుకాకపోతే చక్కగా పీటపై కొత్త వస్త్రం (తుండుగుడ్డ వంటిది) పరచి చిత్రపటాలను అలంకరించి గోడకు అనించి ఉంచవచ్చును.
ఒకచిన్న పళ్ళెములో బియ్యము పోసి ఒక తమలపాకును ఉంచి దానిపై పసుపు గణపతిని చేసి కుంకుమను పెట్టవలెను. ఒక గ్లాసులో నీళ్లు పోసి ఉద్ధరిణ (చెంచా) వేసి, ఆ గ్లాసును ఆచమనమునకు ఉపయోగించాలి. ఒక చెంబులో మూడు మామిడి ఆకులు వేసి సగము వరకు నీటిని పోసి అక్షతలు, గంధము వేసి, మూడుపువ్వులు వేసి దానికి మూడు చోట్ల గంధము అద్ది దానిపై కుంకుమను పెట్టవలెను. ఇది కలశ పాత్ర అవుతుంది.
అభిషేకం చేయువారు కూర్చున్న చోటు నుంచి మధ్యమధ్యలో లేవరాదు. అన్ని ఏర్పాట్లు ముందే చేసికొని కూర్చుండవలెను. సంకల్పము చెప్పుకొనునప్పుడు శ్రీశైలము నుండి అభిషేకము చేయుచున్న స్థలము ఉన్నదిశ, తెలుగు సంవత్సరము జరుగుచున్న ఆయన, ముతువు, మాసము, పక్షము మొదలగునవి తెలుసుకొని ఉండి ఆ సమయములో చెప్పవలెను. ఇతరులు కూడా అభిషేక క్రియలో పాల్గొనవచ్చును. అయితే వారు స్నానము చేసి ఉండవలెను.
నమకము చెప్పునప్పుడు ఒకరి తరువాత ఒకరు అభిషేక క్రియలో పాల్గొనవచ్చును. రుద్రాభిషేకము భగవంతునికి ప్రియమైనది. అభిషేక ప్రియో శివః అంటారు. అలాంటి రుద్రాభిషేకాన్ని స్వయంగా చేసుకొని ఆ శివుని కృపకు పాత్రులు అవుతారని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.