ఆ దేవుని మహాప్రసాదంలో టమోటా, బంగాళాదుంప వాడడం నిషేధం, ఎందుకు?-why are tomatoes and potatoes prohibited in puri jagannatha temple mahaprasad ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఆ దేవుని మహాప్రసాదంలో టమోటా, బంగాళాదుంప వాడడం నిషేధం, ఎందుకు?

ఆ దేవుని మహాప్రసాదంలో టమోటా, బంగాళాదుంప వాడడం నిషేధం, ఎందుకు?

HT Telugu Desk HT Telugu
Oct 23, 2023 10:43 AM IST

జగన్నాథుని మహాప్రసాదం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి రోజూ అయిదు సార్లు జగన్నాథునికి ప్రసాదాన్ని నివేదిస్తారు. ఇక పండుగల సమయంలో 56 నుంచి 64 పిండి వంటలు వండుతారు.

పూరీ జగన్నాథ ఆలయం
పూరీ జగన్నాథ ఆలయం (PTI)

మనదేశంలోని అత్యంత విశిష్టమైన ఆలయాలలో ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయం ఒకటి. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు జగన్నాథ రూపంలోని శ్రీ కృష్ణుడిని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో శ్రీ కృష్ణుడు తన అన్న బలభద్రుడు, చెల్లెలు సుభద్రా దేవితో కలిసి కనిపిస్తాడు. ఈ ఆలయం చాలా ప్రసిద్ధమైనది. రోజులో ఏ సమయంలో చూసినా, ఆకాశంలో సూర్యుడు ఎక్కడా ప్రకాశిస్తున్నా... ఆలయం నీడ మాత్రం కనిపించదు. ఇది ఆ ఆలయ నిర్మాణంలోని అద్భుతంగా కొంతమంది చెబుతూ ఉంటే, మరికొంతమంది ఆ అద్భుతం దేవుని మహిమగా భావిస్తారు మరికొందరు.

వీటికి అనుమతి లేదు

జగన్నాథుని మహాప్రసాదం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి రోజూ అయిదు సార్లు జగన్నాథునికి ప్రసాదాన్ని నివేదిస్తారు. ఇక పండుగల సమయంలో 56 నుంచి 64 పిండి వంటలు వండుతారు. వందల ఏళ్లుగా ఇలాగే ప్రసాదాన్ని చేసి ఆ దేవదేవునికి అర్పిస్తున్నారు. ఈ ప్రసాదంలో దాదాపు అన్ని రకాల పదార్థాలు కలిపి వండుతారు. కానీ బంగాళదుంపలు, టమోటోలు కలిపి వండరు. ఆ రెండు విదేశీ వస్తువులుగా భావిస్తారు. బంగాళాదుంపలు మన దేశానికి చెందినవి కాదని, పెరూలో పండాయని నమ్ముతారు. అలాగే టమోటోలు మన స్వదేశీ పంట కాదని భావిస్తారు. వీటితో పాటూ క్యాబేజీ, కాలీ ఫ్లవర్ కూడా విదేశీ పంటలుగానే అనుకుంటారు. అందుకే వాటిని కూడా ప్రసాదాల్లో కలవకుండా చూసుకుంటారు. ఉల్లి, వెల్లుల్లి కూడా ప్రసాదాల్లో వాడడం నిషేధించారు.

వంటకం కూడా విభిన్నం

మహాప్రసాదం తయారీ చాలా ముఖ్యమైనది. ప్రసాదం వండడం కూడా వెరైటీగా ఉంటుంది. ఒక కుండపై మరో కుండ పెట్టి నిలువుగా నిలబెడతారు. అలా ఏడు మట్టి కుండలను నిలబెడతారు. కట్టెల పొయ్యి మీదే వండుతారు. పైభాగంలో ఉన్న కుండలో మొదట వండుతారు. ఆ తరువాత మిగిలివనవి వండుతారు. ఇక్కడ వంటను లక్షీదేవి పర్యవేక్షిస్తుందనే భక్తుల నమ్మకం. అందుకే చాలా పవిత్రంగా వండుతారు. దాదాపు 500 మంది కలిపి వంటగాళ్లు, వారికి సాయంగా 300 మంది సహాయకులు ఉంటారు. తిరుపతి తర్వాత ఆ స్థాయిలో పాకశాలను కలిగి ఉన్న ఆలయం పూరీ జగన్నాథ్.

ఇక్కడ స్వామికి ప్రసాదించే ముఖ్యమైనది, ఆరోగ్యకరమైనది ‘ఒబాడా’. ఇదే మహాప్రసాదం. అన్నం, పప్పు, రకరకాల కూరగాయలతో వండి కూర, తీపిగా ఉండే రసం, పాయసం వంటివన్నీ ఈ మహాప్రసాదంలో ఉంటాయి. అలాగే రసమలై, అరిసె, చక్కోరి, కక్కరా, బాల్సా వంటి స్వీట్లు కూడా ఈ మహాప్రసాదంలో భాగమే. ఈ ప్రసాదం మిగిలిపోతే ఎండలో ఎండబెడతారు. అది ఎండు అన్నంగా మారిపోతుంది. దీన్ని నిర్మాయిల్ అంటారు. దీన్ని పూరీ మార్కెట్లలో అమ్ముతారు. దీన్ని తింటే ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉన్నాయని చెబుతుంది ఆయుర్వేదం.

WhatsApp channel