Graha dosha pariharalu: గ్రహ బాధలు తొలగిపోవడానికి పఠించాల్సిన స్తోత్రాలు ఏంటి?
Graha dosa pariharalu: నవగ్రహ బాధలతో ఇబ్బంది పడుతున్నారా? పెళ్లి కావడం ఆలస్యం అవుతుందా? అయితే ఈ స్తోత్రాలు పఠించండి. మీ గ్రహ బాధలు తొలగిపోతాయని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.
Graha dosha pariharalu: ఈ సృష్టిలో భూమిమీద జన్మించిన ప్రతి ప్రాణికి గ్రహప్రభావాలు ఉంటాయి. ఆ గ్రహ ప్రభావాలను అనుసరించే ఫలితాలు పొందాలని, ఆ ప్రభావాల ఫలితాలను దేవతలు కూడా భూమి మీద ప్రాణుల రూపంలో సంచిరించినపుడు వాటి ప్రభావాలు అనుభవించాల్సి వస్తుందని రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలు తెలుపుతున్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఈ గ్రహ బాధలు తొలగడానికి మానవులను రక్షించడానికి కలియుగంలో పఠించడానికి స్తోత్రాలు కొన్ని స్తోత్రాలు ఉన్నాయని చిలకమర్తి తెలిపారు.
గురు దక్షిణామూర్తి స్తోత్రం
గురుబలం లేనివారి కొరకు గురు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయాలి. జాతకంలో బృహస్పతికి సంబంధించిన దోషాలు తొలగడానికి, గురుబలం పెంచుకోవడానికి, నవగ్రహ బాధలు తొలగడానికి, శని బాధలనుండి కూడా విముక్తి పొందడానికి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించినట్లయితే వారికి ఉన్న సకల గ్రహ దోషాలు బాధలు తొలగుతాయని చిలకమర్తి తెలిపారు.
ఆదిత్య హృదయం పారాయాణం
ఇది సూర్యునికి సంబంధించినది. ఈ ఆదిత్య హృదయం రామ రావణ యుద్ధ సమయంలో అగస్త్య మహర్షి రామునికి ఉపదేశించాడు. దీనిని రోజూ ప్రాతః సమయమున పఠించుట వలన ఆయురారోగ్యాలను, అప్టైశ్వర్యాలను పొందుతారు. మనిషిలో దాగి ఉన్న కామ, క్రోధాది అంతః శత్రువులను నాశనం చేస్తుంది.
రుణ విమోచక అంగారక(కుజ) స్తోత్రం
జీవితంలో మనకు ఎదురైన అనేక ఇబ్బందులకు అప్పులు చేస్తూ ఉంటారు. వాటిని తీర్చలేక ఇబ్బందులు పడుతుంటే రుణ విమోచక అంగారక(కుజ) స్తోత్రం నలబై ఒక్క రోజులు పారాయణ చేస్తూ, నవగ్రహాలకు రోజూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చెయ్యాలి. చివరి రోజు కందులు, ఎరుపు రంగు వస్త్రం, ధనాన్ని దక్షిణగా పెట్టి, కుజునకు మీ పేరు మీద అష్టోత్తరం చేయించండి. మీ అప్పులు తప్పక తీరుతాయని చిలకమర్తి తెలిపారు.
విష్ణు సహస్ర నామ స్తోత్రం
ఈ స్తోత్రాన్ని నలబై ఒక్క రోజులు పారాయణ చెయ్యండి. సాయంత్రం వేళ రోజూ చేస్తే ఇంకా మంచిది. చివరి రోజు విష్ణు ఆలయానికి వెళ్లి గోత్ర నామాలతో స్వామికి అష్టోత్తరం చేయించండి. మీ బాధలు తగ్గి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. మీకు సంతానం కలగడానికి శ్రీ కాళహస్తి వెళ్లి రాహు, కేతు, కుజ గ్రహాలకు “సర్ప దోష నివారణ పూజ” చేయండి. సంతాన గోపాలకృష్ణ వ్రతం నియమ నిబంధనలతో ఒకసారి మీ ఇంటిలో చెయ్యండి. వీలుంటే రెండు శాంతి ప్రక్రియలు చేస్తే ఇంకా మంచిది. తప్పక సంతానం కలుగుతుంది.
రుక్మిణీ కళ్యాణం
వివాహం జరగడానికి మీరు రుక్మిణి కళ్యాణం పారాయణ చెయ్యండి. నలభై ఒక్క రోజులు, నవగ్రహాల చుట్టూ రోజుకి నలభై ఒక్క ప్రదక్షిణలు చేసి చివరి రోజు నవగ్రహాలకు పూజ చెయ్యండి. నవగ్రహాలకు తిరిగే మొదటిరోజు మీ కోరిక చెప్పుకొని మొదలు పెట్టండి. తప్పక వివాహం జరుగుతుంది.
ధన ఇబ్బందులు తొలగిపోవడానికి
ధన ఇబ్బందులు తొలగడానికి మాస శివరాత్రి రోజున శివుడికి ఏకన్యాస రుద్రాభిషేకం చెయ్యండి. అలాగే ఎనిమిది మాస శివరాత్రులు శివుడికి రుద్రాభిషేకాలు చేయించండి. మీ ధన ఇబ్బందులు తప్పక తొలిగి పోతాయి. ధనం బాగా సంపాదించాలి అనుకున్నవారు నిత్యమూ “శ్రీ సూక్తము” పారాయణ చేయవలెను.
హనుమాన్ చాలీసా
హనుమంతుడు కల్పవృక్షం లాంటి వాడు. కల్పవృక్షాన్ని ఆశ్రయించిన అన్ని కోరికలు క్షణంలో నెరవేరతాయి. అటువంటి కల్పవృక్షం దరికి చేర్చగల చక్కని సులభమైన మార్గం హనుమాన్ చాలీసా. ఈ హనుమాన్ చాలీసాను సాక్షాత్తు పరమేశ్వరుని ఆదేశానుసారం శ్రీ గోస్వామి తులసీదాసు గారు రచించారు. ఈ హనుమాన్ చాలీసాను రోజుకి పదకొండు పర్యాయములు చొప్పున మండలం( నలభై రోజులు) పారాయణం చేసిన సర్వ కార్యసిద్ధి కలుగును అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.