World Malaria Day 2023 : దోమలు కుట్టకుండా ఏం చేయాలి?
World Malaria Day 2023 : ఏప్రిల్ 25న మలేరియా దినోత్సవంగా పాటిస్తారు. చిన్న దోమ కాటు కూడా మనిషి ప్రాణాల మీదకు తెస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కొన్ని జాగ్రత్తలతో తీసుకుంటే బయటపడొచ్చు.
ఏప్రిల్ 25వ తేదీ మలేరియా దినోత్సవం. 'Time to deliver zero malaria: invest, innovate, implement' అనే థీమ్‌తో ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు. 2018 నివేదిక ప్రకారం, భారతదేశం జనాభాలో 98 శాతం మందికి మలేరియా(Malaria వచ్చే ప్రమాదం ఉంది. 2030 నాటికి మలేరియా రహిత దేశంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అయితే ప్రజలు కూడా చేతులు కలపాలి.
నిర్లక్ష్యం చేస్తే మలేరియాతో ప్రాణాపాయం తప్పదు. మలేరియాను నియంత్రించడం మున్సిపాలిటీ కర్తవ్యం మాత్రమే కాదు. దోమల నివారణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. అప్పుడే ఈ మలేరియాను పూర్తిగా నిర్మూలించవచ్చు. మలేరియా పరాన్నజీవుల వల్ల కలిగే ఒక రోగం. మనిషి రక్తంలో పరాన్నజీవులు చేరినప్పుడు మలేరియా సోకుతుంది. దోమలు(mosquitoes) కుట్టడం ద్వారా ఇది మనుషులకు వ్యాపిస్తుంది. అయితే ముందస్తుగా కొన్ని చర్యలు తీసుకుంటే.. మలేరియా రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.
దోమలు వృద్ధి చెందడానికి అనుమతించవద్దు
మలేరియా దోమల వల్ల వస్తుంది. ఆడ అనాఫిలిస్ దోమ కుట్టడం ద్వారా మలేరియా వ్యాపిస్తుంది. ఇంటి చుట్టూ నీరు నిలిచి ఉంటే దోమలు అక్కడే కూర్చుని గుడ్లు పెడుతుంటాయి. దోమల బెడద పెరుగుతుంది. వర్షాకాలంలో(Rainy Season) మలేరియా సమస్య ఎక్కువగా ఉంటుంది. వేసవి(Summer)లో కూడా ఇంటి చుట్టూ బకెట్‌లో నీటిని నింపితే, అందులో దోమలు గుడ్లు పెట్టడం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఎండాకాలం అయినా, వర్షాకాలం అయినా ఇంటి చుట్టూ నీరు నిలువకుండా జాగ్రత్తపడాలి.
మలేరియాను నివారించడానికి ఏం చేయోచ్చు?
కొబ్బరి చిప్ప, ప్లాస్టిక్ డబ్బా, బకెట్, టైర్‌లో నీరు నిలువకుండా చూసుకోవాలి.
నీరు నిలిచి ఉండడం వల్ల దోమలు పెరుగుతాయి.
వర్షాకాలానికి ఇంకా నెల రోజుల సమయం ఉన్నప్పటికీ రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చేందుకు గ్రామ పంచాయతీ, మున్సిపల్ కౌన్సిల్‌కు దరఖాస్తు చేసుకోండి.
చెత్తను సక్రమంగా పారవేసేలా చూసుకోవాలి. అలాగే పొడి, పచ్చి చెత్తను వేరు చేయాలి.
నీటితో నింపిన కంటైనర్లలో మూత ఉండాలి .
దోమ కాటును ఎలా నివారించాలి?
దోమలు కుట్టకుండా ఉండాలంటే కిటికీకి దోమతెర, బెడ్‌పై దోమతెర పెట్టాలి.
ఉదయం, సాయంత్రం కిటికీలు, తలుపులు తెరవవద్దు.
పొడవాటి చేతుల బట్టలు ధరించండి.
దోమలు కుట్టకుండా ఉండటానికి స్ప్రే ఉపయోగించండి.
పిల్లలకు కూడా దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి.
దోమ కాటును నివారించడానికి క్రీమ్ లేదా రిపెల్లెంట్ ఉపయోగించండి.
దోమల బెడదను అరికట్టడం ద్వారా మలేరియానే కాకుండా డెంగ్యూను కూడా నివారించవచ్చు.