Travel tips for summer season: వేసవిలో ప్రయాణమా? ఈ జాగ్రత్తలు మర్చిపోకండి
Travel tips for summer season: మామూలు సమయాల్లో ప్రయాణం అంటేనే చాలా ఏర్పాట్లు చేసుకుంటాం. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. ఇక వేసవిలో ప్రయాణం అంటే ఆరోగ్య పరంగా, అందం విషయంలో మరిన్ని ఎక్కువ జాగ్రత్తలు అవసరం. అలా తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చదవండి.
సొంత కార్లో లేదా బస్సు, రైల్లో మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకున్నా కొన్ని చిట్కాలు మాత్రం మరిచిపోకండి. ఎందుకంటే వేసవిలో శక్తి త్వరగా క్షీణించినట్టు అనిపిస్తుంది. ప్రయాణ సమయంలో నీరు, ఆహారం, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ప్రయాణానికి వీలుగా కొలాప్సబుల్ వాటర్ బాటిల్స్:
వేసవిలో శరీర ఆరోగ్యం నీళ్లతో ముడిపడి ఉంటుంది. శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. నీరెంత ముఖ్యమో తెలిసినా మనం తాగడం మాత్రం మర్చిపోతుంటాం. ఒక ముఖ్య కారణం ప్రయాణాల్లో ఉన్నపుడు తరచూ బాటిల్ చేతిలో పట్టుకోలేక పోవడం. దానికి మంచి పరిష్కారం కొలాప్సబుల్ లేదా సాఫ్ట్ వాటర్ బాటిల్స్. బాటిల్లో నీరున్నంత వరకే వీటిని చిన్నగా మడిచేసుకోవచ్చు. చేతిలో సులువుగా అమరిపోతాయి. నీళ్లు అయిపోగానే బ్యాగులో మడిచి పెట్టేయొచ్చు. అలాగే మీ సొంత వాహనంలో ప్రయాణం చేస్తే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాటర్ బాటిల్లు తప్పకుండా ఇంటి నుంచే నింపి తీసుకెళ్లండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, అటు ఖర్చు కూడా తగ్గుతుంది. శరీర ఆరోగ్యంతో పాటు చర్మ ఆరోగ్యం కూడా ముఖ్యమే. కనీసం ఎస్పీఎఫ్ 30 ఉన్న సన్‌స్క్రీన్ తప్పక వాడాలి. రెండు గంటలకోసారి రాసుకుంటూ ఉండటం కూడా మరిచిపోవద్దు.
ఇలాంటి బట్టలు వేసుకోండి:
ముదురు రంగు బట్టల జోలికి వెళ్లకండి. తెలుపు మరియు లేత రంగులకే ప్రాధాన్యం ఇవ్వండి. లోదుస్తులు కూడా లేత రంగులవే ఎంచుకోండి. ఎడారి ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా ఇలా ఎండ వేడిమి నుంచి తమను తాము కాపాడుకోడానికి పైనుంచి కింది దాకా శరీరాన్ని కప్పి ఉంచే వదులైన వస్త్రాల్నే వేసుకుంటారు. కానీ మనలో చాలా మంది మాత్రం బయట వేడిగా ఉంది కదాని చాలా వరకు షార్ట్స్, స్లీవ్‌లెస్ డ్రెస్సులు వేసుకుంటారు. నిజానికి వీటివల్ల మన శరీరం యూవీ కిరణాల భారిన పడి ట్యాన్ అవుతుంది. చర్మం ఎరుపెక్కడం, దద్దుర్లు లాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి అలాంటి బట్టలు వేసుకుంటున్నప్పుడు తప్పకుండా సన్‌స్క్రీన్ రాసుకోవాల్సిందే. లాంగ్ స్కర్టులు, వదులుగా ఉండే ప్యాంట్లు, బిగుతుగా లేని కాటన్ కుర్తాలు.. ఈ వేసవి ప్రయాణాల్లో చక్కని ఎంపిక.
కార్ డిక్కీలో ఇవి పెట్టకండి:
ఇది తెలిసిన విషయమే అయ్యుండొచ్చు. కానీ మర్చిపోయే విషయం కూడా. మీరు ఏమైనా మందులు వాడుతున్నట్లయితే వాటిని మీరు కార్లో కూర్చునే చోటే ఉంచండి. డిక్కీలో ఎక్కువ వేడి ఉంటుంది కాబట్టి మందులు పాడయ్యే అవకాశం ఉంది. అలాగే వండి వెంటతీసుకెళ్లే ఆహార పదార్థాలు ఏమైనా ఉన్నా కూడా అతి వేడి వల్ల అవి త్వరగా పాడైపోతాయి. వాటిని చల్లని ప్రదేశంలో మీతో పాటు ఉంచండి.
సంబంధిత కథనం
టాపిక్