World Lung Cancer Day: సిగరెట్ తాగకపోయినా ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువే, ఎలాగంటే…
World Lung Cancer Day: ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం ఆగస్టు 1. ఈ సందర్భంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎందుకు వస్తుందో, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో ఊపిరితిత్తులు ఒకటి. చెడు అలవాట్ల వల్ల ఊపిరితిత్తులకు క్యాన్సర్ సోకుతుంది. ప్రతి ఏడాది ఈ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు ‘వరల్డ్ లంగ్ క్యాన్సర్ డే’ దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం. ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రతి సంవత్సరం పది లక్షల మందికి పైగా ప్రాణాలను బలిగొంటోంది. మన దేశంలో ఎక్కువ మందికి సోకుతున్న అత్యంత సాధారణ క్యాన్సర్లలో ఇదీ ఒకటి.
ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు
ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రారంభ సంకేతాలుగా ఛాతీ నొప్పి, దగ్గినప్పుడు రక్తం పడడం, శ్వాస ఆడకపోవడం, హఠాత్తుగా బరువు తగ్గడం వంటివి చెప్పుకుంటారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ కు ప్రధాన కారణాల్లో పొగాకు వినియోగం ఒకటి. ఎవరైతే సిగరెట్లు, పొగాకు ఎక్కువగా కాలుస్తారో వారికి లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే గాలి కాలుష్యం వల్ల కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ రావచ్చు.
భారతదేశంలో, హానికరమైన జీవనశైలి అలవాట్లు, కలుషితమైన గాలికి గురికావడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడం చాలా సాధారణంగా మారింది. ప్రతి సంవత్సరం, ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవాన్ని అవగాహన పెంచడానికి, దాన్ని ఎదుర్కునే పద్ధతులను చెప్పడానికి నిర్వహించుకుంటారు.
ప్రతి సంవత్సరం, ఆగస్టు 1 న ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం జరుపుకుంటారు. ఈ ఏడాది ఈ ప్రత్యేకమైన రోజు గురువారం వస్తుంది.
ఎప్పుడు మొదలైంది?
2012 లో ఫోరం ఆఫ్ ఇంటర్నేషనల్ రెస్పిరేటరీ సొసైటీస్ (ఎఫ్ఐఆర్ఎస్), ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ లంగ్ క్యాన్సర్ (ఐఎఎస్ఎల్సి) ప్రతి సంవత్సరం ఆగస్టు 1 న ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవంగా పాటించాలని నిర్ణయించాయి. అప్పటి నుంచి ప్రతి ఏటా ఆగస్టు 1న ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం యొక్క థీమ్ - ప్రతి ఒక్కరూ క్యాన్సర్ నుంచి రక్షణ పొందాలన్నది.
ఒత్తిడిలో ఉన్నా, ఆనందంలో ఉన్నా కూడా కొంతమంది సిగరెట్ కాలుస్తూ ఉంటారు. నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి దీన్నే మార్గంగా ఎంచుకుంటారు. ఎనభైశాతం ఊపిరితిత్తుల క్యాన్సర్ సిగరెట్ కాల్చడం వల్లే వస్తాయి. నోటి క్యాన్సర్, స్వర పేటిక క్యాన్సర్, అన్న వాహిక క్యాన్సర్, మూత్రిపిండాలు, కాలేయం, గర్భాశయం, పొట్ట క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశాన్ని కూడా ధూమపానం పెంచుతుంది. పొగాకులోని హానికరమైన రసాయనాలు క్యాన్సర్ కారకాలుగా మారుతాయి. అవి డిఎన్ఏను కూడా దెబ్బతీస్తాయి.
ధూమపానం చేయకపోయినా క్యాన్సర్
ధూమపానం అలవాటు లేకపోయినా తరచూ ఆ పొగను పీల్చడం ద్వారా కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడే అవకావం ఎక్కువ. దీన్నే సెకండ్ హ్యాండ్ స్మోకింగ్, పాసివ్ స్మోకింగ్ అంటారు. ఎవరైనా సిగరెట్ కాలుస్తుంటే వారి పక్కన నిల్చున్నవారు కూడా ఆ పొగను పీలుస్తారు. ముఖ్యంగా కొంతమంది పెద్దలు పిల్లల ముందే ధూమపానం చేస్తారు. ఇది వారి ఆరోగ్యాన్ని కూడా చెడగొడుతుంది.
సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ వల్ల చెవి ఇన్ఫెక్షన్లు రావడం, ఆస్తమా, దగ్గు, శ్వాస ఆడకపోవడం, శ్వాసకోశ అంటు వ్యాధులు వంటివి వచ్చే అవకాశం పెరిగిపోతుంది.
ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం 2024: ప్రాముఖ్యత
ఊపిరితిత్తుల క్యాన్సర్ను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు - నాన్-స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ (ఎన్ఎస్సిఎల్సి) మరియు స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ (ఎస్సిఎల్సి). ప్రతి సంవత్సరం, ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా, ఊపిరితిత్తుల క్యాన్సర్ యొక్క సంభావ్య ప్రమాదం, నివారణ చిట్కాలు, జీవనశైలి మార్పులు మరియు చికిత్సా ఎంపికల గురించి చర్చిస్తారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదం, ముందుగానే గుర్తించడం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. క్యాన్సర్ చికిత్సను అందరికీ అందుబాటులో మరియు చౌకగా చేయడానికి ప్రజలు కలిసి మార్గాలను అన్వేషించడానికి ఈ రోజు ఒక అవకాశంగా పనిచేస్తుంది.
చదవండి: ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం: ఊపిరితిత్తుల క్యాన్సర్కు ధూమపానం ఒక్కటే కారణమా?9 అపోహలు
టాపిక్