Diabetes Exercise: డయాబెటిస్‍తో బాధపడే వారు తప్పక చేయాల్సిన ఆరు రకాల వ్యాయామాలు.. వీటితో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి!
Diabetes Exercise: డయాబెటిస్ ఉన్న వారికి వ్యాయామాలు కూడా చాలా మేలు చేస్తాయి. కొన్నిరకాల ఎక్సర్‌సైజ్‍లు మధుమేహంతో బాధపడే వారు ప్రతీ రోజు చేయాలి. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‍లో ఉండేందుకు ఇవి తోడ్పడతాయి.
డయాబెటిస్ (మధుమేహం) కంట్రోల్‍లో ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారంతో కూడిన డైట్ పాటించడం చాలా ముఖ్యం. వ్యాయామం కూడా షుగర్ నియంత్రణలో ఉండడంలో సహకరిస్తాయి. డయాబెటిస్ ఉన్న వారు రెగ్యులర్‌గా కొన్ని రకాల ఎక్సర్‌సైజ్‍లు చేస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉండేలా తోడ్పడతాయి. వీటి ద్వారా పూర్తి ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. మధుమేహం ఉన్న వారు ప్రతీ రోజు చేయాల్సిన ఆరు రకాల వ్యాయామాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి. రేపు (నవంబర్ 14) ప్రపంచ డయాబెటిస్ డే సందర్భంగా ఈ ప్రత్యేక కథనాన్ని చదివేయండి.
బ్రిస్క్ వాకింగ్
బ్రిస్క్ వాకింగ్ అంటే సాధారణం కంటే కాస్త వేగంగా నడవడం. శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గేందుకు ఈ సింపుల్ ఎక్సర్‌సైజ్ ప్రభావవంతగా పని చేస్తుంది. ఇన్సులిన్ సెన్సివిటీని కూడా బ్రిస్క్ వాకింగ్ పెంచగలదు. బ్లడ్ ప్రెజర్ స్థాయిని కూడా అదుపు చేయగలదు. ప్రారంభంలో ప్రతీ రోజు 30 నిమిషాల పాటు బ్రిస్క్ వాకింగ్ చేయాలి. క్రమంగా ఈ ఫాస్ట్ వాకింగ్ సమయాన్ని పెంచుకుంటూ పోవాలి.
రన్నింగ్
డయాబెటిస్ ఉన్న వారికి రన్నింగ్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇది సులువైన ఎక్సర్‌సైజ్ అయినా ఎఫెక్టివ్‍గా ఉంటుంది. పరుగెత్తినప్పుడు కండరాలు సంకోచించి గ్లూకోజ్‍ను వాడుకుంటాయి. అలాగే ఇన్సులిన్ సెన్సివిటీ పెరుగుతుంది. దీంతో రక్తంలో చెక్కర స్థాయి తగ్గుతుంది. ప్రారంభంలో రన్నింగ్ కాస్త నెమ్మదిగానే చేయాలి. వీలైనంత దూరం పరుగెత్తాలి. రన్నింగ్‍కు కొత్త అయితే జాగింగ్ చేయవచ్చు. కాస్త అలవాటయ్యాక పరుగెత్తే దూరాన్ని పెంచుకోవచ్చు.
సైక్లింగ్
సైక్లింగ్ బయట చేసినా.. ఇన్‍డోర్‌లో చేసినా చాలా ప్రయోజనాలు ఉంటాయి. క్యాలరీలు బర్న్ అయ్యేందుకు ఇది చాలా ఉపకరిస్తుంది. బ్లడ్ షుగర్ లెవెళ్లను ఈ సింపుల్ వ్యాయామం కూడా నియంత్రించగలదు. ఆరంభంలో సైకిల్ కాసేపు తొక్కాలి. ఆ తర్వాత ఎక్కువ సమయం చేయవచ్చు.
బాడీవెయిట్ ఎక్సర్‌సైజ్‍లు
పుషప్స్, స్క్వాట్స్, లంజెస్, ప్లాంక్ లాంటి బాడీవెయిట్ ఎక్సర్‌సైజ్‍లు ఇన్సులిన్ సెన్సివిటీని మెరుగుపరచడంతో పాటు కండరాలకు మేలు చేస్తాయి. మొత్తంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గేందుకు సహకరిస్తాయి. ఈ వ్యాయామాలు చేసే సమయంలో గ్లూకోజ్‍ను ఎనర్జీగా కండరాలు వినియోగించుకుంటాయి. డయాబెటిస్ ఉన్న వారు రెగ్యులర్‌గా ఈ బాడీవెయిట్ ఎక్సర్‌సైజ్‍లు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.
పైలట్స్
పైలట్స్ వర్కౌట్లలో వివిధ స్ట్రెచ్‍లు, భంగిమలు ఉంటాయి. పైలట్స్ ఎక్సర్‌సైజ్‍ల వల్ల శరీర ఫ్లెక్సిబులిటీ, సామర్థ్యం పెరుగుతాయి. ఇన్సులిన్ సెన్సివిటీని మెరుగుపచడంతో పాటు ఒత్తిడిని కూడా పైలట్స్ తగ్గిస్తాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉండేందుకు ఈ వ్యాయామాలు సహకరిస్తాయి.
రెసిస్టన్స్ బ్యాండ్ ఎక్సర్‌సైజ్‍లు
రెసిస్టన్స్ బ్యాండ్ సాయంతో చేసే బైసెప్ కర్ల్స్, గ్లుటె బ్రిడ్జెస్, ట్రైసెప్స్ ఎక్స్‌టెన్షన్స్ లాంటి ఎక్సర్‌సైజ్‍లను డయాబెటిస్ ఉన్న వారు చేయాలి. ఇవి చేయడం వల్ల కండరాలు వృద్ధి చెందుతాయి. ఇన్సులిన్ సెన్సివిటీ అధికంగా అవుతుంది. ఈ వ్యాయామాలు చేయడం కూడా కాస్త సులువే. డయాబెటిస్ ఉన్న వారు ప్రతీ రోజు ఈ ఎక్సర్‌సైజ్‍లు చేయడం వల్ల మేలు జరుగుతుంది.