Saunf mixture: రెస్టారెంట్లో సోంపులో కలిపి ఇచ్చే ఈ చక్కెర పలుకులు ఏంటో తెలుసా?-why saunf and mishri mixture is given in restaurants after food ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Saunf Mixture: రెస్టారెంట్లో సోంపులో కలిపి ఇచ్చే ఈ చక్కెర పలుకులు ఏంటో తెలుసా?

Saunf mixture: రెస్టారెంట్లో సోంపులో కలిపి ఇచ్చే ఈ చక్కెర పలుకులు ఏంటో తెలుసా?

Koutik Pranaya Sree HT Telugu
Jun 25, 2024 02:30 PM IST

Saunf mixture: రెస్టారెంట్లో బిల్ కట్టేశాక సోంపు, చక్కెర పలుకులు కలిపి ఇస్తారు. ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించారా? అది చక్కెరా? లేదా ఇంకేంటో వివరంగా తెల్సుకోండి.

సోంపు, పటికబెల్లం
సోంపు, పటికబెల్లం

ఒంట్లో వేడి చేసినప్పుడు ఇంట్లో ఉండే పెద్దవాళ్లు పటికబెళ్లం లేదా గడి చక్కెర తినమని చెబుతారు. దీనికి ఒంట్లో వేడి తగ్గించే లక్షణం ఉంటుందంటారు. మనకు రెస్టారెంట్లో సోంపుతో ఇచ్చేది కూడా ఆ పటిక బెల్లం పలుకులే. ఈ పటిక బెల్లానికి, మామూలు పంచదారకు ఉన్న తేడా ముందు తెల్సుకుందాం.

చక్కెరను చెరకు రసం నుంచి తయారు చేస్తారు. అయితే చక్కెర తయారీకి చాలా ప్రాసెసింగ్ జరుగుతుంది. పోషకాలు తక్కువుంటాయి. ఒక పటిక బెల్లం కూడా చెరకు రసం నుంచే తయారవుతుంది. కానీ ఎక్కువగా ప్రాసెసింగ్ జరగదు. ప్రాసెసింగ్ చేయని చక్కెర రూపమే పటిక బెల్లం.

అందుకే ఇందులో పోషకాలు,మినరళ్లు ఉంటాయి. చక్కెర కన్నా ఆరోగ్యానికి మంచిది. ఆయుర్వేద వైద్యం ప్రకారం పటిక బెల్లం ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. రుచిలో కూడా చక్కెర కన్నా తేడా ఉంటుంది. దీన్ని మిష్రి అనీ, క్యాండీ షుగర్ లేదా రాక్ షుగర్ అనీ, కొన్ని ప్రాంతాల్లో గడి చక్కెర అని పిలుస్తారు.

రెస్టారెంట్లో సోంపుతో కలిపి ఎందుకిస్తారు?

ఆహారం తొందరగా జీర్ణం అవడానికి సోంపు తింటామని తెల్సిందే. అచ్చం అలాగే పటిక బెల్లానికి కూడా ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసే శక్తి ఉంది. అందుకే రెస్టారెంట్లలో భోజనం అయ్యాక రెండూ కలిపి ఇస్తారు. అలాగే రెస్టారెంట్లలో మసాలాలున్న ఆహారం కడుపునిండా తిన్న తర్వాత కాస్త బద్దకంగా అనిపిస్తుంది. ఏ పనీ చేయాలనిపించదు. ఈ సోంపు, పటికబెల్లం కలిపి తినడం వల్ల శక్తి పుంజుకుని కొత్త ఉత్తేజం వచ్చినట్లు అనిపిస్తుంది. మౌత్ ఫ్రెషనర్ లాగా కూడా పని చేస్తుంది. ఇంట్లో తిన్న తర్వాత కూడా ఇలా పటికబెల్లం కలిపిన సోంపు తినొచ్చు. 

పటిక బెల్లం లాభాలు:

1. దగ్గు, గొంతులో గరగర నొప్పి ఉంటే పటికబెల్లం వాడొచ్చు. పటిక బెల్లం, మిరియాల పొడి, నెయ్యి కలిపి పేస్ట్ లాగా చేయాలి. రాత్రి పూట పడుకునే ముందు దీన్ని తింటే సమస్య తగ్గుతుంది. లేదా నీళ్లలో పటిక బెల్లం పొడి, మిరియాల పొడి కలుపుకుని తాగినా ఉపశమనం అనిపిస్తుంది.

2. నీళ్ల విరేచనాలు తగ్గకపోతే.. కొద్దిగా పటిక బెల్లం పొడిచేసి, అరటిపండుతో అద్దుకుని తింటే ఫలితం ఉంటుందని చెబుతారు.

3. భోజనం త్వరగా జీర్ణమవడానికి, ఆహారం తిన్న వెంటనే కొన్ని పటిక బెల్లం పలుకులు నోట్లో వేసుకుంటే.. జీర్ణ ప్రక్రియ వేగవంతం అవుతుంది.

4. దగ్గు, జలుబు చేసినప్పుడు నిప్పుల మీద కొద్దిగా పసుపు, పటిక బెల్లం పొడి వేసి దాన్నుంచి వచ్చిన పొగ పీలిస్తే కాస్త ఉపశమనం ఉంటుంది.

5. శరీరంలో వేడి చేసి మలంలో రక్తం కనిపించినప్పుడు కాస్త జీలకర్ర, పటికబెల్లం కలిపితింటే ప్రయోజనం ఉంటుంది.

పంచదార కన్నా దీంట్లో పోషకాలు ఎక్కువ. దీన్ని వంటల్లో కూడా వాడుకోవచ్చు. కొన్ని రకాల స్వీట్ల తయారీకి కూడా వాడతారు. కానీ మితంగా వాడితేనే ఎక్కువ లాభాలు పొందొచ్చు. పోషకాలు ఎక్కువున్నాయని తీపి కోసం దీన్ని ఎక్కువగా వాడకూడదు. తీపి ఎంతయినా తీపే..

 

Whats_app_banner