Non Veg In Monsoon : వర్షాకాలంలో నాన్ వెజ్ ఎందుకు తినొద్దు?
Non Veg In Monsoon : వర్షాకాలంలో మాంసం తినకూడదని ఇంట్లో చెప్పడం మీరు వినే ఉంటారు. దీనికి చాలా కారణాలున్నాయి. మీరు సీఫుడ్, నాన్ వెజ్ ప్రేమికులైతే వర్షాకాలంలో ఎందుకు తినకూడదో తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి సంబంధించినది. వర్షాకాలంలో మాంసం, గుడ్లు, చేపలు ఎందుకు తినకూడదు?
వానాకాలంలోనూ కొంతమంది నాన్ వెజ్(Non Veg) తెగ లాగించేస్తుంటారు. కానీ అన్నికాలల్లో మన జీర్ణవ్యవస్థ ఒకేలాగా ఉండదు. కాబట్టి సీజన్ ను ఆధారంగా ఫుడ్ తీసుకోవాలి. వర్షాకాలంలోనూ నాన్ వెజ్ ఎక్కువగా తింటే కొన్ని రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
కొందరు వర్షాకాలంలోను చేపలు(Fish) ఎక్కువగా తింటారు. కానీ చేపలు వర్షాకాలంలో సంతానోత్పత్తి చేస్తాయి. ఈ సమయంలో వాటి శరీర నిర్మాణం చాలా మార్పులకు లోనవుతుంది. ఈ కాలంలో చాలా బ్యాక్టీరియా(Bacteria), ఆల్గే వాటి శరీరానికి అంటుకునే అవకాశం ఉంది. చేపలు తింటే ఇది మానవులకు వ్యాపిస్తుంది. చాలా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అయితే, మీరు చేపలను కచ్చితంగా తినాలి అనుకుంటే.. చేపలను కొనుగోలు చేసేటప్పుడు కొన్ని అంశాలను గుర్తుంచుకోవాలి. మీరు చేపను నొక్కి చూడాలి. మెత్తగా ఉందా గట్టిగా ఉందా అని పరిశీలించాలి. మొప్పల రంగును కూడా చూడాలి.
బాక్టీరియా, వ్యాధికారక క్రిములు వర్షాకాలంలో పుష్కలంగా ఉంటాయి. గుడ్డులో ఉండే తేమ వాటి పెరుగుదల, వ్యాప్తికి అనుకూలంగా ఉంటుంది. సాల్మొనెల్లా, ఇ-కోలి మీకు సోకే సమయం ఇది. కడుపు నొప్పి, అజీర్ణం, ఫుడ్ పాయిజనింగ్(Food Poisioning)కు కారణమవుతుంది. కాబట్టి గుడ్లు(Eggs) తినకపోవడమే ఉత్తమ పరిష్కారం.
మీరు తప్పనిసరిగా గుడ్లు తినవలసి వస్తే, వాటిని ఇంట్లో ఉడికించడం మంచిది. గుడ్డు తాజాగా ఉందో లేదో తనిఖీ చేయడానికి, దానిని నీటితో నింపిన గిన్నెలో వేయండి. గుడ్డు దిగువన ఉంటే అది తాజాగా ఉంటుంది. కానీ తేలితే మంచిది కాదు. గుడ్లు పగలగొట్టేటప్పుడు లేదా ఉడికించినప్పుడు, అవి అసహ్యకరమైన వాసన రాకూడదు. పచ్చసొన గట్టిగా ఉండాలి. వీలైనంత వరకు బయట వంటకాలు తినడం మానుకోండి.
మంసాహారం(meat) కోసం.. కొంతమంది చికెన్, మటన్ షాపుకు వెళ్తుంటారు. కొన్ని దుకాణాల్లో తాజా మాంసం దొరకదు. కొన్నిసార్లు చనిపోయిన కోడి మంసాన్ని అమ్మవచ్చు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. చికెన్ కొనుగోలు చేసేటప్పుడు, మచ్చలు లేదా తెల్లటి గీతలు ఉన్నాయా అని తనిఖీ చేయండి. ఇది ఇలా ఉంటే, కోడికి వ్యాధి, ఇన్ఫెక్షన్ ఉందని అర్థం. అలాగే మాంసం జిగటగా ఉండకూడదు. తాజా కోడి మాంసం మెరుస్తూ, దృఢంగా ఉంటుంది.
మీరు కొనుగోలు చేసే అన్ని రకాల మాంసాన్ని ఉడికించే ముందు గోరువెచ్చని నీటిలో పసుపు, ఉప్పుతో శుభ్రం చేయాలి. మాంసానికి అంటుకున్న అన్ని మురికి, చెత్తను నీటితో శుభ్రం చేయాలి. కొన్ని సుగంధ ద్రవ్యాలతో ఉడకబెట్టండి. ఇది బ్యాక్టీరియా, వ్యాధికారకాలను చంపడానికి సహాయపడుతుంది.
వర్షాకాలం(Rainy Season)లో ఆహారాన్ని జీర్ణం చేసుకునే శక్తి శరీరానికి తక్కువగా ఉంటుంది. చేపలు తిన్న తర్వాత జీర్ణం కావడానికి సాధారణంగా రెండు రోజులు పడుతుంది. అధిక ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ కారణంగా ఇలా జరుగుతుంది. చికెన్, మటన్ తిన్నా సరిగా అరగదు. అందువల్ల వర్షాకాలంలో మాంసాహారం తినడం వల్ల వాంతులు, వికారం వంటివి వస్తాయి. ఈ కారణాల వల్ల వర్షాకాలంలో మాంసాన్ని తగ్గించాలి.