Sperm Donation । గర్వంగా వీర్యదానం చేయండి.. ఎవరు అర్హులంటే?
Sperm Donation: వీర్యదానంతో సంతానం కోసం ఆశపడే జంటల కలను నిజం చేయవచ్చు. వీర్యదానం ఎవరు చేయవచ్చు, చేసేందుకు అర్హతలేమి ఇక్కడ తెలుసుకోండి.
మీ అందరికీ రక్తదానం గురించి తెలుసు, అలాగే వీర్యదానం (sperm donation) గురించి కూడా వినే ఉంటారు. ఈ కాన్సెప్ట్ మీద హిందీలో విక్కీ డోనార్, తెలుగులో నరుడా డోనరుడా అనే సినిమాలు కూడా వచ్చాయి. అందులో హీరో వీర్యదానం చేస్తూనే చాలా డబ్బు సంపాదిస్తాడు. అసలు ఈ వీర్యదానం ఏంటి? ఎలా చేయాలి, ఎవరు వీర్యదానం చేసేందుకు అర్హులు? మొదలైన అన్ని విషయాలను ఇప్పుడు చర్చించుకుందాం.
స్పెర్మ్ డొనేషన్ అనేది వీర్యాన్ని సేకరించడం, దానం చేయడం వంటి ప్రక్రియ. వీర్యం అనేది మగవారికి స్కలనం సమయంలో విడుదలయ్యే ఒక ద్రవం. స్పెర్మ్ దానం ప్రక్రియ సాధారణమైనది. గర్భం ధరించాలనుకునే వారికి ఇది సురక్షితమైన, సమర్థవంతమైన ప్రక్రియ. ఇందులో లైంగిక చర్యలో పాల్గొనాల్సిన అవసరం లేకుండా పిల్లల్ని కనవచ్చు.
వీర్యదాత దానం చేసిన వీర్యాన్ని ప్రత్యేక వాతావరణంలో నిల్వ చేస్తారు. అవసరమైనప్పుడు, వైద్యులు శుక్రకణాలను గర్భందాల్చాలనుకునే స్త్రీ పునరుత్పత్తి అవయవాలలోకి పంపించి, ఫలదీకరణకు అవకాశం కల్పిస్తారు. ఈ ప్రక్రియను ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అంటారు. తద్వారా బిడ్డను కనాలనుకునే వారి కలను నిజం చేయవచ్చు.
శుక్రకణాన్ని దానం చేయడం వలన మీరు ఒక జంట వారి పేరెంట్‌హుడ్‌ను ఆస్వాదించడానికి సహాయపడవచ్చు. భర్త లేని స్త్రీలకు బిడ్డను కోరుకునే లేదా దంపతులు మగ వంధ్యత్వాన్ని ఎదుర్కొంటున్న సందర్భాల్లో వారికి వీర్యదానం ద్వారా సహాయం చేయవచ్చు. బిడ్డను కనాలనుకునే స్త్రీ, వీర్యదానం కోసం తనకు కావాలసిన వారిని ఎంచుకోవచ్చు లేదా స్పెర్మ్ బ్యాంక్‌ను సంప్రదించవచ్చు. వీర్యదానం చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతారు. అయితే గ్రహీతలకు తెలుసుకునే హక్కు ఉంటుంది.
Who Can Be A Sperm Donor- ఎవరు వీర్యదానం చేయవచ్చు?
మీరు గుర్తింపు పొందిన స్పెర్మ్ బ్యాంక్‌కు మీ వీర్యాన్ని దానం చేయవచ్చు. వారు కొన్ని టెస్టులు చేస్తారు. అన్నీ సక్రమంగా ఉండి స్క్రీనింగ్ ప్రక్రియలో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే వీర్యదానం చేసే అవకాశం ఉంటుంది. అందుకు ప్రతిఫలంగా మీకు మంచి మొత్తంలో డబ్బును చెల్లిస్తారు కూడా. అయితే వారి టెస్టులలో ఉత్తీర్ణులవడం అంత సులభం కాదు, చాలా అప్లికేషన్లలో 1-5 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధిస్తారు. చాలా షరతులు ఉంటాయి, ఏయే అంశాలు ప్రామాణికమైనవో ఇక్కడ తెలుసుకోండి.
- స్పెర్మ్ దానం చేసే వారి వయస్సు 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. కొన్ని స్పెర్మ్ బ్యాంకులు 39 సంవత్సరాల వరకు కూడా వయసును పరిగణిస్తుంది.
- దాతలకు AIDS, HIV, హెపటైటిస్ B, C, అలాగే సిఫిలిస్ వంటి అంటువ్యాధులు ఉండకూడదు. అంతేకాకుండా ఎటువంటి జన్యుపరమైన లోపాలు, శారీరక సమస్యలు ఉండకూడదు. అచ్ఛమైన మగవారు అయి ఉండాలి, స్వలింగ సంపర్కులకు అయి ఉండకూడదు.
- బ్లడ్ గ్రూప్, బ్లడ్ కౌంట్, బ్లడ్ షుగర్, థైరాయిడ్ పనితీరుకు సంబంధించిన పరీక్షలు ఉంటాయి. అన్నీ 'నార్మల్' గా ఉండాలి.
- ధూమపానం, మద్యపానం, మాదకద్రవ్యాల దుర్వినియోగం, మొదలైన ఎలాంటి వ్యసనాలు ఉండకూడదు. వీటికి సంబంధించి కూడా పరీక్షలు చేస్తారు.
- వీర్యదాత శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉండాలి. సంపూర్ణ ఆరోగ్యంను కలిగి ఉండాలి.
- ఇది చాలా ముఖ్యమైన అంశం. వీర్యదాత సంతానోత్పత్తి ప్రమాణాలు కలిగి ఉండాలి, ఇందుకోసం వీర్యపరీక్షలో నెగ్గాలి. తాన అందించిన వీర్య నమూనాలో ఒక మిల్లీలీటర్‌కు 15 మిలియన్ కంటే ఎక్కువ స్పెర్మ్ కౌంట్ కలిగి ఉండాలి. అంతేకాకుండా శుక్రకణాలు సరైన నిర్మాణం, ఆకృతిని కలిగి ఉండాలి, చలనశీలత కూడా మెరుగ్గా ఉండాలి. కనీసం 40% స్పెర్మ్ కదలిక ఉండాలి.
వీటన్నింటితో పాటు వీర్యదాత అభిరుచులు, విద్యార్హతలు, వ్యక్తిగత అలవాట్లు, ఆసక్తులు, కుటుంబ నేపథ్యం మొదలైన అన్ని విషయాలను పంచుకోమని అడుగుతారు. అన్నీ కుదిరితేనే వీర్యదాతలు కాగలరు.
సంబంధిత కథనం