World Embryologist Day 2022 । అసలు IVF అంటే ఏమిటి? సంతానం కలగాలంటే ఏం చేయాలి?-world embryologist day 2022 know what is ivf and when you need it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  World Embryologist Day 2022 Know What Is Ivf And When You Need It

World Embryologist Day 2022 । అసలు IVF అంటే ఏమిటి? సంతానం కలగాలంటే ఏం చేయాలి?

Manda Vikas HT Telugu
Jul 25, 2022 11:45 AM IST

సంతానం లేని వారికి సంతానం కలిగేలా ఇప్పుడు వివిధ రకాల వైద్యవిధానాలు అందుబాటులో ఉన్నాయి. జూలై 25ను IVF దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అసలు ఈ IVF అంటే ఏమిటి? డాక్టర్లు ఏం చెబుతున్నారు? ఇక్కడ తెలుసుకోండి.

World IVF Day
World IVF Day (Unsplash)

ఈ సృష్టిలో ప్రతిజీవి అద్భుతం, ప్రతి పుట్టుక అద్వితీయం. అయితే సృష్టికి ప్రతిసృష్టిలా మానవుడి మేధోశక్తి ఎన్నో అద్భుతాలను సృష్టించింది. ఇందులో వైద్య రంగంలో వంధ్యత్వానికి చికిత్స చేయడం ఈ యుగంలో గొప్ప పురోగతిగా పరిగణించవచ్చు. పూర్వం సంతానం లేని వారు తమకు జీవితంలో తల్లిదండ్రులు అయ్యే యోగం లేదని సరిపెట్టుకునేవారు. కానీ ఇప్పుడు వైద్యశాస్త్రం మరింత అభివృద్ధి చెందింది. కృత్రిమంగా గర్భధారణ చేసే వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయి.

1978న జూలై 25వ తేదీన ఇంగ్లండ్‌లో లూయిస్ బ్రౌన్ కృత్రిమ గర్భధారణ (IVF- In vitro fertilization) పద్ధతిలో జన్మించిన మొదటి బిడ్డ అయ్యారు. లూయిస్ బ్రౌన్ అనే మహిళకు ఇప్పుడు 44 సంవత్సరాలు. ఆమె ఒకరిని పెళ్లి చేసుకొని, ఇద్దరు పిల్లలతో హాయిగా జీవనం సాగిస్తున్నారు. సంతానోత్పత్తి చికిత్స రంగంలో అతిపెద్ద విజయం. ఈ విజయానికి గుర్తుగా ప్రతీ ఏడాది జూలై 25న ప్రపంచ ఎంబ్రియాలజిస్ట్ దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జులై 25న ప్రపంచ ఎంబ్రియాలజిస్ట్ డే (World Embryologist Day )గా జరుపుకుంటారు. ఇదే IVF dayగా కూడా ప్రాచుర్యం పొందింది.

అసలు IVF అంటే ఏమిటి?

సంతానం లేనివారు IVF కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. మరి IVF అందరికీ అవసరం అవుతుందా?

సంతానం లేని భార్యాభర్తలు IVF ద్వారా సంతానం పొందాలనుకుంటే ముందుగా IVF ప్రక్రియను అర్థం చేసుకోవడం చాలా అవసరం. బిడ్డ జన్మించాలంటే వీర్య కణాలు అండంతో కలవాలి. అప్పుడు అది పిండంగా రూపాంతరం చెందుతుంది. ఈ విషయంలో ఇబ్బందులు ఉన్నప్పుడు IVF విధానం ద్వారా ల్యాబ్‌లో అండకణాలను సంగ్రహించటం, స్పెర్మ్ నమూనాను మెరుగుపరచడం చేస్తారు

ఇంకా సరళంగా చెప్పాలంటే ఆడవారి నుంచి అండకణాలను, మగవారి నుంచి వీర్యకణాలను సేకరించి వాటిని ల్యాబ్‌లో ఫలదీకరణ చేయడం.

IVF ఎప్పుడు అవసరం?

అయితే సంతానం కలగని వారందరికీ IVF అవసరం లేదు. వైద్యులను సంప్రదిస్తే వారు అసలు సమస్య ఎక్కడ ఉందనేది ముందుగా గుర్తిస్తారు. ఆ మేరకు సహజసిద్ధంగానే గర్భం ధరించేలా తగిన చికిత్స, ఔషధాలు అందిస్తారు. ఎవరికైతే సహజ సిద్ధంగా గర్భధారణ కలగడానికి అవకాశం లేకుండా ఉంటుందో వారికి మాత్రమే చివరి ప్రత్యామ్నాయంగా IVF అవసరం అవుతుంది. ముఖ్యంగా ఆడవారిలో ఫెలోపియన్ నాళాలు మూసుకుపోయినపుడు, అండ కణాలు తక్కువగా ఉన్నప్పుడు అలాగే మగవారిలో స్పెర్మ్ నాణ్యత తక్కువగా ఉన్నప్పుడు ఇది అవసరం అవుతుంది.

ఢిల్లీ ఎయిమ్స్ నుంచి గైనకాలజిస్ట్, డాక్టర్. అర్చన ప్రకారం 35 ఏళ్లు పైబడిన ఆడవారు గర్భం ధరించటంలో ఇబ్బందులు ఎదుర్కొంటునపుడు లేదా మగవారిలో వీర్య కణాల సంఖ్య అత్యల్పంగా ఉంటుందో వారికి మాత్రమే IVF అవసరం అవుతుందని సూచిస్తున్నారు.

Watch This Video:

సరైన పోషకాహారం తీసుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించటం ద్వారా సహజ పద్ధతుల్లోనే గర్భధారణ కలగటానికి అవకాశం ఉంటుంది. సంతానం కలగటానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసి విఫలమైనపుడు మాత్రమే IVF మార్గాన్ని ఎంచుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం