Chemotherapy: కీమోథెరపీ అంటే ఏంటి? క్యాన్సర్ చికిత్సకు ఎందుకు భయపడతారు?
Chemotherapy: క్యాన్సర్ కోసం చేసే కీమోథెరపీ అంటే ఏమిటి? ఈ చికిత్స ఎలా ఉంటుంది? చికిత్స తర్వాత, ముందు ఏం జరుగుతుంది? ఈ విషయాలన్నీ తెల్సుకోండి.
క్యాన్సర్, కీమో థెరపీ.. ఈ రెండు పదాలు వణుకు పుట్టించేస్తాయి. వ్యాధి పేరు వింటే భయమెంతో దాని చికిత్స అంటే కూడా అంతే భయపడతారు. క్యాన్సర్ నిర్ధరణ అయ్యాక కూడా చాలా మంది కీమోథెరపీ చేయించుకోడానికి భయపడతారు. అసలు కీమో థెరపీ అంటే ఏంటీ? ఎందుకు అదంటే భయం?
కీమోథెరపీ:
క్యాన్సర్ కణాలను తొలగించడం కోసం కీమో థెరపీ చేస్తారు. అసాధారణంగా ఎదుగుతున్న క్యాన్సర్ కణాలే లక్ష్యంగా ఈ చికిత్స పనిచేస్తుంది. దీంతో వాటిని పూర్తిగా నశించేలా చూస్తారు. లేదా ఎదుగుదలను నియంత్రణలోకి తీసుకువచ్చేలా, మళ్లీ రాకుండా చికిత్స చేస్తారు. అలాగే క్యాన్సర్ రకం, ఏ దశలో ఉంది, రోగి స్థితి బట్టి కీమోథెరపీ చికిత్స ఉంటుంది. కొన్నిసార్లు ట్యూమర్ పరిమాణాన్ని తగ్గించి సర్జరీ ద్వారా తొలగించడానికి కూడా కీమోథెరపీ చేస్తారు.
చికిత్స ఏం చేస్తారు?
కీమోథెరపీలో సూదితో సిరలద్వారా మందును శరీరంలోకి పంపిస్తారు. దీన్నే ఇంట్రా వీనస్ ఇన్ఫ్యూజన్ అంటారు. కొన్ని రకాల క్యాన్సర్లకు నోటి ద్వారా తీసుకునే ట్యాబ్లెట్స్, క్యాప్సుల్స్ ఇస్తారు. లేదంటే కండరాలు, చర్మం కింది భాగంలోకీ మందును ఇంజెక్షన్ ఇస్తారు. కొన్ని సార్లు చర్మం ఉపరితలం మీద రాసుకునే మందుల ద్వారా చికిత్స చేస్తారు. ఇంకొన్నిసార్లు కీమోథెరపీ మందుల్ని నేరుగా కొన్ని శరీర బాగాల్లోకే పంపిస్తారు. మూత్రాశయం, ఉదర కుహరం లాంటి వాటిలోకి నేరుగా మందును ఇవ్వడం దానికి ఉదాహరణ.
కీమోథెరపీ ఎలా పనిచేస్తుంది?
అసాధారణంగా పెరుగుతున్న కణాలే లక్ష్యంగా కీమోథెరపీ చికిత్స చేస్తారు. ఈ కణ విభజనను ఆపడమే చికిత్స లక్ష్యం. కానీ కొన్నిసార్లు వేగంగా పెరిగే మరికొన్ని ఆరోగ్యకర శరీర కణాలనూ కీమోథెరపీ ప్రభావితం చేస్తుంది. ఎముక మజ్జ, జీర్ణ వ్యవస్థ, వెంట్రుకల్లోనూ ఇలా వేగంగా పెరిగే కణాల మీద ఈ మందు పని చేస్తుంది. దాంతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. జుట్టు రాలడం, రక్త కణాల సంఖ్య పడిపోవడం, తల తిరగడం లాంటి సమస్యలు మొదలవుతాయి. అంటే క్యాన్సర్ కణాలు పెరగకుండా ఇచ్చిన చికిత్స వల్ల మరికొన్ని ఆరోగ్యకర కణాల పెరుగుదల కూడా ఆగిపోతుంది.
కీమోథెరపీ తర్వాత ఏమవుతుంది?
దీన్నుంచి కోలుకోడానికి శరీరానికి తగినంత విశ్రాంతి, సమయం కావాలి. కొంతమందిలో దీర్ఘకాలికంగా ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాంతులు, తల తిరగడం, బలహీనత లాంటి లక్షణాలుంటాయి. చికిత్స కన్నా ఈ సైడ్ ఎఫెక్ట్స్ వల్లే చాలా మందికి క్యాన్సర్ అంటేనే భయం పెరుగుతుంది.
- కీమోథెరపీ రోగనిరోధక శక్తిని బలహీన పరుస్తుంది. దాంతో రోగికి ఇన్ఫెక్షన్లు సులభంగా వస్తాయి.
- కీమోథెరపీ వల్ల ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గుతుంది. దీంతో బలహీనత పెరుగుతుంది.
- వాంతులు, తలతిరగడం లాంటి సమస్యలుంటాయి.
- కీమోథెరపీ ప్రభావం వెంట్రుకల మీద పడి జుట్టు రాలిపోతుంది.
- కొన్నిసార్లు గుండె, కాలేయం, కిడ్నీ లాంటి వాటి మీదా ప్రభావం ఉండొచ్చు.
వీటన్నింటినీ వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి మందులు, చికిత్స అందిస్తారు. అందుకే చివరి దశ దాకా వెళ్లిన క్యాన్సర్ రోగులు కూడా దాన్నుంచి బయటపడి ఎన్నో ఏళ్లు ఆరోగ్యంగా బతకగులుగుతున్నారు. కీమోథెరపీ చాలా మందిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఓర్పు పెంచుతుంది. జీవితం విలువ నేర్పుతుంది. చికిత్సతో పాటూ దాని సైడ్ ఎఫెక్ట్స్‌తో రోగి పోరాడి దాన్నుంచి బయటపడగలుగుతున్నాడు. కాబట్టి కీమోకు భయపడకుండా వ్యాధి గుర్తించిన వెంటనే చికిత్సకు ముందుడుగు వేస్తే తొందరగా వ్యాధి నుంచి బయటపడొచ్చు.