How Tablet works?: జబ్బు ఎక్కడుందో ట్యాబ్లెట్‌కు ఎలా తెలుస్తుంది? అక్కడికే వెళ్లి ఎలా పని చేస్తుంది?
How Tablet works?: నోటి ద్వారా వేసుకున్న మాత్రకు మన శరీరంలో ఎక్కడ సమస్య ఉందో ఎలా తెలుస్తుంది? ఈ ప్రశ్న మీకూ ఉంటే అసలు మాత్ర ఎలా పని చేస్తుందో వివరంగా తెల్సుకోండి.
సోషల్ మీడియాలో ఒక ప్రశ్న తెగ వైరల్ అవుతోంది. మనం వేసుకున్న ట్యాబ్లెట్‌కు 💊 ఏ పార్ట్ దగ్గరికి వెళ్లి పనిచేయాలో ఎలా తెలుస్తుంది అనేదే ప్రశ్న. దీనికి జవాబులు భలే గమ్మత్తుగానూ ఇస్తున్నారు కొందరు. దాని తయారీదారు ట్యాబ్లెట్ చెవిలో మంత్రం చెప్పి పంపిస్తారని ఒకరు కామెంట్ చేస్తే, లోపలికి వెళ్లాక ట్యాబ్లెట్ గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకుంటుందని ఇంకొకరు.. ట్యాబ్లెట్‌లో అంతర్గతంగా రూట్ మ్యాప్ ఫిక్స్ చేస్తారని మరి కొందరు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
అసలు నిజంగానే మనం వేసుకున్న ట్యాబ్లెట్ లోపలికి వెళ్లాక ఎలా పనిచేస్తుందో తెల్సుకోవాలని మాత్రం చాలా మంది అనుకుంటున్నారు. మీకూ ఆసక్తి ఉంటే చదివేయండి.
ట్యాబ్లెట్ ఇలా పనిచేస్తుంది:
ఆరోగ్య సమస్యకు ఇచ్చిన మాత్రలు, మందులు, టానిక్.. నోటి ద్వారానే శరీరం లోపలికి చేరతాయి. ఆహారం తీసుకుంటే అదెలా ప్రయాణిస్తుందో మందు కూడా అంతే. జీర్ణాశయంలోకి చేరుకుంటుంది. అక్కడ విచ్ఛిన్నమై జీర్ణమైన మందులు రక్తంలోకి కలుస్తాయి. ఈ రక్తం చిన్న ప్రేగుల నుంచి హెపాటిక్ పోర్టల్ వెయిన్ అనే నాళం ద్వారా కాలేయానికి చేరుతుంది.
కాలేయంలో శుద్ధి చేసిన రక్తమే శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా అవుతుంది. కాలేయంలో ఈ ట్యాబ్లెట్ తాలూకు సమ్మేళనాలు కూడా మరింత విచ్ఛిన్నం అవుతాయి. అవి మళ్లీ రక్త ప్రసరణలోకి చేరతాయి. ఇలా మందులు ఉన్న రక్తమే శరీరంలోని అన్ని భాగాలకూ, కణజాలాలకు ప్రవహిస్తుంది. దాంతో మందు కూడా ప్రతి భాగానికి చేరుకుంటుంది. అయితే వెళ్లిన ప్రతిచోటా ఈ మందు ప్రభావం చూపదు.
సమస్య ఉన్నచోటే ఎలా పనిచేస్తుంది?
మన శరీరంలో ప్రొటీన్ అణువులుంటాయి. ఇవి కణాల ఉపరితలం మీద, కణాల లోపల కూడా రకరకాల ఆకారాల్లో విభిన్నంగా ఉంటాయి. ఇవే గ్రాహకాలు లేదా రిసెప్టర్లు. మనం వేసుకున్న మందును గ్రహించేది ఇవే. మందులో ఉండే రసాయనాలు కొన్ని రకాల రిసెప్టర్లకు మాత్రమే అతుక్కునేలా తయారు చేస్తారు. అంటే రిసెప్టర్ కేవలం దానికి నప్పే రసాయనాన్ని మాత్రమే గ్రహిస్తుంది అన్నమాట. శరీరం అంతటా మందు అన్ని భాగాల్లోకి ప్రవహించినా కూడా సమస్యకు సంబంధించిన గ్రాహకాలు ఎక్కడుంటే అక్కడ ఎక్కువగా పనిచేస్తుంది. దాని ప్రభావం చూయిస్తుంది.
సైడ్ ఎఫెక్ట్స్:
మందు సరైన మోతాదులో వేసుకుంటేనే ప్రభావం సరిగ్గా ఉంటుంది. వైద్యులు సూచించిన దానికన్నా తక్కువ డోసేజ్ వాడితే రిసెప్టర్లకు మందు అందదు. ఎక్కువగా తీసుకుంటే అవసరం లేని కణాల మీద కూడా పనిచేసి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి ట్యాబ్లెట్ పని చేయాలంటే సరైన మోతాదులో మర్చిపోకుండా వాడాలి.
టాపిక్