Liver Health: ఆల్కహాల్ అలవాటు లేని వారిలో కూడా కాలేయం చెడిపోతోంది, ఎందుకిలా?-liver deterioration even in non alcoholics why is it happening ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Liver Health: ఆల్కహాల్ అలవాటు లేని వారిలో కూడా కాలేయం చెడిపోతోంది, ఎందుకిలా?

Liver Health: ఆల్కహాల్ అలవాటు లేని వారిలో కూడా కాలేయం చెడిపోతోంది, ఎందుకిలా?

Haritha Chappa HT Telugu
Aug 29, 2024 02:00 PM IST

Liver Health: మద్యపానం ఉన్నవారిలో కొన్నాళ్లకు లివర్ చెడిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఆల్కహాల్ తాగని వారిలో కూడా కాలేయం పాడవుతోంది. ఇలా ఎందుకు జరుగుతుందో చెబుతున్నారు వైద్య నిపుణులు.

పెరిగిపోతున్న కాలేయ సమస్యలు
పెరిగిపోతున్న కాలేయ సమస్యలు (Pixabay)

Liver Health: మద్యపానం, ధూమపానమే అన్ని రోగాలకు కారణంగా ఎక్కువమంది చెబుతారు. అది నిజమే కావచ్చు, కానీ ఆ అలవాట్లు లేని వారు కూడా రోగాల బారిన పడుతున్నారు. దీనికి కారణం వారి జీవనశైలి, అధిక కేలరీలు ఉండే ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి వాటి వల్ల కూడా తీవ్రవ్యాధులు వారిలో వస్తున్నాయి. ఎంతో మందిలో ఆల్కహాల్ తాగే అలవాటు లేకపోయినా వారికి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తున్నట్టు తేలింది.

కాలేయంలో కొవ్వు పేరుకుపోయి

నిజానికి ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఊబకాయంతో బాధపడుతున్న వారికి వస్తుంది. అలాగే మద్యపానం అధికంగా ఉన్నవారిలో కూడా కనిపిస్తుంది. కాలేయంలో కొవ్వు అధికంగా పేరుకుపోవడం వల్ల ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ బారిన పడతారు. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఆల్కహాల్ ఫ్యాటీ లివర్ డిసీజ్, ఇక రెండోది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. మద్యపానం ఎక్కువగా చేయడం వల్ల వారి కాలేయంలో కొవ్వు పేరుకుపోతే దాన్ని ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. మద్యపానం అలవాటు లేకపోయినా కూడా కాలేయంలో కొవ్వు పేరుకుపోతే దాన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని పిలుస్తారు.

ఈ రెండు సమస్యలు కూడా తీవ్రమైనవే. ప్రాథమికంగా పెద్దగా ఎలాంటి లక్షణాలను చూపించదు. వ్యాధి ముదిరే కొద్ది మాత్రం లక్షణాలు తీవ్రంగా బయటపడతాయి. కాలేయం పూర్తిగా దెబ్బ తినే అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ తాగుతున్నవారు ఆ మద్యం వల్ల లివర్ డిసీజ్ బారిన పడతారు. కానీ ఆల్కహాల్ అలవాటు లేని వారు ఎందుకు పడుతున్నారో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

మద్యపానం చేయకపోయినా కొందరికి మధుమేహం, అధిక రక్తపోటు, జీర్ణ సమస్యలు, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు వంటివి ఉంటాయి. ఈ సమస్యల వల్ల కూడా కాలేయంలో కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంది.

ఇలాంటి ఆహారాలు తింటే

ఊబకాయుల్లో, మధుమేహం, హైబీపీ, అధిక కొలెస్ట్రాల్, జీవక్రియ సమస్యలతో బాధపడే వారిలో ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆల్కహాల్ అలవాటు లేకపోయినా అధికంగా కొవ్వు నిండిన ఆహారాలు తినడం, జంక్ ఫుడ్ తినడం, కూల్ డ్రింకులు, చక్కెర నిండిన పదార్థాలు తినడం, వ్యాయామం చేయకపోవడం, డీప్ ఫ్రై చేసిన ఆహారాలను అధికంగా తినడం వల్ల ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చినా కూడా ప్రాథమికంగా లక్షణాలు కనిపించవు. కాబట్టి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

కనిపించే లక్షణాలు

ఆల్కహాల్ అలవాటు లేకపోయినా కొన్ని రకాలు లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్తపడవాలి. బరువు హఠాత్తుగా తగ్గిపోవడం, తీవ్రంగా అలసిపోయినట్టు అనిపించడం, చర్మంతో పాటు కళ్ళు కూడా పసుపు రంగులోకి మారడం, పొత్తికడుపులో కుడివైపు నొప్పి వస్తూ పోవడం వంటివి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ లక్షణాలు.

ఫ్యాటీ లివర్ డిసీజ్‌కు చికిత్స సమయానికి తీసుకోవడం చాలా అవసరం. ఇది రాకుండా ముందుగా జాగ్రత్త పడితే ఎంతో మంచిది. కొవ్వు నిండిన ఆహారాలను దూరంగా పెట్టాలి. పంచదార, కూల్ డ్రింకులు, ఉప్పు తగ్గించుకోవాలి. పండ్లు, కూరగాయలు తినేందుకు ప్రయత్నించాలి. బయట దొరికే చిరుతిండి పూర్తిగా మానేయాలి. వ్యాయామం చేయాలి. అధిక బరువును తగ్గించుకోవాలి.

టాపిక్