Garlic infused oil: బాలింతల్లో కూాడా జుట్టు రాలడం తగ్గించే వెల్లుల్లి నూనె.. ఇలా వాడారంటే మీ జుట్టూ నల్లగా పెరుగుతుంది-benefits of garlic oil know how it stops hair fall and helps hair growth ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Garlic Infused Oil: బాలింతల్లో కూాడా జుట్టు రాలడం తగ్గించే వెల్లుల్లి నూనె.. ఇలా వాడారంటే మీ జుట్టూ నల్లగా పెరుగుతుంది

Garlic infused oil: బాలింతల్లో కూాడా జుట్టు రాలడం తగ్గించే వెల్లుల్లి నూనె.. ఇలా వాడారంటే మీ జుట్టూ నల్లగా పెరుగుతుంది

Koutik Pranaya Sree HT Telugu
Aug 17, 2024 05:00 PM IST

Garlic infused oil: వెల్లుల్లి నూనె గురించి చాలా మందికి తెలీదు. కానీ దాన్ని జుట్టుకు రాసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. జుట్టు వేగంగా పెరుగుతుంది. అనేక సమస్యలను తగ్గించే ఈ వెల్లుల్లి నూనెను ఎలా తయారు చేసుకోవాలి? దాన్నెలా వాడాలి? దాంతో కలిగే లాభాలేంటో వివరంగా తెల్సుకోండి.

వెల్లుల్లి నూనె
వెల్లుల్లి నూనె (freepik)

వెల్లుల్లి జుట్టు ఆరోగ్యానికి అనేక రకాలుగా సాయపడుతుంది. చాలా ప్రాంతాల్లో ప్రసవం తర్వాత కొన్ని నెలల పాటూ మహిళల తలకు ఈ వెల్లుల్లి నూనెను రాస్తారు. ప్రసవానంతరం మహిళల్లో వచ్చే విపరీతమైన హెయిర్ ఫాల్ సమస్యను కూడా వెల్లుల్లి తగ్గిస్తుందని చెబుతారు. మరి అంతటి సుగుణాలున్న నూనెను రోజూవారీ పెట్టుకుంటే మరిన్ని ఫలితాలు పొందొచ్చు. సాధారణంగా ఉల్లిపాయ వల్ల జుట్టుకు జరిగే మేలే మనం పట్టించుకుంటాం కానీ వెల్లుల్లి గురించి తెలీదు. దీనికున్న సుగుణాలన్నీ తెల్సుకోండి.

వెల్లుల్లి నూనె ఎలా తయారు చేయాలి?

ముందుగా ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలను పొట్టుతో సహా తీసుకుని కచ్చాపచ్చాగ దంచుకోవాలి. ఒక రెబ్బ మీద రెండు దెబ్బలు కొట్టండి చాలు. ఇప్పుడు కొబ్బరి లేదా ఆలివ్ లేదా బాదాం నూనెల్లో ఏదో ఒకటి తీసుకోండి. మీకు ఆముదం పెట్టుకునే అలవాటుంటే అదీ వాడొచ్చు. ఈ నూనెలో వెల్లుల్లిని కలిపేసుకోవాలి. స్టవ్ మీద సన్నం మంట మీద ఈ నూనెను మరిగించాలి. వెల్లుల్లి మాడిపోకుండా చూసుకోవాలి. ఒక పది నిమిషాలు కాగాక దింపేయాలి. నూనె మొత్తం చల్లారాక వడకట్టుకుని ఒక గాజు సీసాలో భద్రపర్చుకోవాలి. 

వెల్లుల్లి నూనె ఎలా వాడాలి?

జుట్టు పెరగాలన్నా, జుట్టు రాలడం తగ్గాలన్నా వెల్లుల్లి నూనెను ఎలా ఉపయోగించాలో తెల్సుకోండి. 

1. వెల్లుల్లి నూనెతో మర్దనా:

చేతిలోకి వెల్లుల్లి నూనెను కొద్దిగా తీసుకుని మాడుకు బాగా మర్దనా చేయాలి. కనీసం అరగంట సేపు అలా వదిలేయాలి. తర్వాత గాఢత తక్కువున్న షాంపూతో తలస్నానం చేయాలి. 

2. తేనె, నూనె కలిపి:

వెల్లుల్లి నూనెను ఒక చిన్న గిన్నెలో తీసుకోవాలి. దాంట్లో ఒక చెంచా తేనె కలపాలి. రెండూ బాగా కలిపి జుట్టంతా రాసుకోవాలి. తర్వాత తలస్నానం చేయాలి. 

3. రోజ్‌మేరీ నూనెతో:

వెల్లుల్లి నూనె కొద్దిగా తీసుకుని అందులో రెండు మూడు చుక్కల రోజ్‌మేరీ ఎసెన్షియల్ కలుపుకోవాలి. దాన్ని మాడుకు, జుట్టుకు పట్టించాలి. అరగంటయ్యాక కడిగేసుకుంటే జుట్టు ఆరోగ్యం పెరుగుతుంది. 

4. కలబంద గుజ్జుతో:

కలబంద గుజ్జులో కాస్త వెల్లుల్లి నూనె కలిపి పట్టించారంటే జుట్టు మృదువుగా మారుతుంది. చుండ్రు తగ్గుతుంది. మాడులో జిడ్డు తగ్గిపోతుంది. 

5. గుడ్డుతో:

రెండు గుడ్లు పగలగొట్టాలి. సొనలో చెంచాడు వెల్లుల్లి నూనె కలుపుకోవాలి. దీన్ని జుట్టుకు పట్టించి అరగంటయ్యాక కడిగేసుకోవాలి. 

వెల్లుల్లి నూనెలో ఏముంటాయి?

వెల్లుల్లి నూనె జుట్టుకు నిజంగా ఎందుకు మంచిదో సందేహం ఉంటే అందులో ఉండే పోషకాల గురించి తెల్సుకోవాలి. దాంట్లో ఉండే సల్ఫర్, సెలేనియం జట్టు కుదుళ్లను బలపరుస్తాయి. దాంతో జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అల్లిసిన్ అనే సమ్మేళనం వల్ల మాడుకు రాసినప్పుడు రక్త సరఫరా పెరుగుతుంది. దీంటో కుదుళ్లకు పోషకాలు బాగా అంది జుట్టు ఆరోగ్యవంతం అవుతుంది. అలాగే వెల్లుల్లికి ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి. దీనికి సహజంగానే మాయిశ్చరైజ్ చేసే గుణాలుంటాయి. దాంతో నిర్జీవంగా, పొడిబారిన జుట్టు కూడా మెరుస్తూ ఆరోగ్యంగా అవుతుంది.