Boddemma Song Lyrics : బొడ్డెమ్మ పండుగ గురించి మీకు తెలుసా? కనీసం ఈ పాటైనా తెలుసుకోండి
Boddemma Songs : కొన్ని కొన్ని విషయాలు ముందు తరాలకు వెళ్తాయి. మరికొన్నేమో మెల్లమెల్లగా కనుమరుగవుతాయి. కొన్నేళ్ల కిందట బతుకమ్మ పండగకు ముందు బొడ్డెమ్మ ఆడేవారు. ఇప్పుడున్న వారిలో చాలామందికి బొడ్డెమ్మ గురించి తెలియదు. కొన్ని ఊర్లలో మాత్రమే ఆడుతున్నారు.
బొడ్డెమ్మ పండుగ ప్రకృతి పండుగ. ఇటు మట్టితోనూ, అటు పూలతోనూ జరిపే పండుగ. బొడ్డెమ్మను తయారుచేయడంలోనూ ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధానం ఉంటుంది. బతుకమ్మ పండుగకు ముందు ఇది వస్తుంది. భాద్రపద మాసంలో వచ్చే మహాలయ అమావాస్యకు ముందు బహుళపంచమి నుంచి 9 రోజులు ఈ పండుగ నిర్వహిస్తారు. మరికొందరు 5 రోజులు, 3 రోజులు దశమి, ద్వాదశి నుంచి కూడా చేస్తారు. ఇది ప్రాంతాన్ని బట్టి మారుతుంది. ఈ పండుగను బొడ్డెమ్మ పున్నమి అంటారు. బాలికలు, పెళ్లి కాని అమ్మాయిలు మాత్రమే బొడ్డెమ్మ ఆడుతారు.
బొడ్డెమ్మను తయారుచేయడం కూడా ఆసక్తికరంగా అనిపిస్తుంది. చతురస్రాకారంలో ఉన్న చెక్క పీటను తీసుకుంటారు. అడవి నుంచి పుట్టమన్ను తెస్తారు. పుట్టమన్ను ఎందుకంటే.. ఎవరి కాలి అడుగూ పడదని నమ్మకం. అంత పవిత్రంగా చేయాలని అర్థం. మట్టిని మెత్తగా చేసుకుని పీట మీద గుండ్రంగా పైకి ఐదు వరుసలు వచ్చేలా చేయాలి. పైన గోపురం ఆకారం పెట్టాలి.
ఆ పైన ఒక చిన్న మట్టిపాత్ర పెట్టాలి. అందులో పసుపు గౌరమ్మ ఉంచాలి. దీపం కూడా ముట్టించాలి. బొడ్డెమ్మను ఆడే ప్రదేశం పేడ నీళ్లతో అలికి.., ముగ్గువేసి అందులో పెట్టాలి. సాయంత్రం పూట బొడ్డెమ్మ ఆడుతుంటారు. ఈ సందర్భంగా కొన్ని పాటలు పాడుతారు. అందులో ఒకటి మీకోసం HT Telugu సేకరించింది.
బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్..
నీ బిడ్డ పేరేమి కోల్..
నా బిడ్డ నీలగౌరు కోల్..
నిచ్చెమల్లె చెట్టేసి కోల్..
చెట్టుకు చెంబేడు కోల్..
నీళ్లనూ పోసి కోల్..
కాయల్లు పిందేలు కోల్..
గనమై కాసెను కోల్..
అందుట్ల ఒక పిందే కోల్..
ఢిల్లీకి పాయెనూ కోల్..
ఢిల్లీలో తిప్పరాజు కోల్..
మేడా కట్టించే కోల్..
మేడాలో ఉన్నదమ్మా కోల్..
మేలిమి గౌరి కోల్..
మేలిమ్మి గౌరికి కోల్..
మీది బుగిడీలు కోల్..
అనుపకాయ కొయ్యండి కోల్..
అమరా గంటీలు కోల్..
చిక్కుడుకాయ కొయ్యండ్రి కోల్..
చిత్రాల వడ్డాణం కోల్..
నుగ్గాయ కొయ్యండి కోల్..
నూటొక్కా సొమ్ములు కోల్..
అన్ని సొమ్ములు పెట్టి కోల్.. అద్దంలో చూసెను కోల్..
అద్దంలో గౌరమ్మ కోల్..
నీ మెుగుడెవరమ్మా కోల్...
దేవస్థానం బోయిండు కోల్..
దేవూడయ్యిండు కోల్..
శివలోకం బోయిండు కోల్..
శివుడే అయ్యిండు కోల్..
యమలోకం పోయిండు కోల్..
యుముడే అయ్యిండు కోల్..
సేకరణ : HT Telugu