Relationship Tips । అత్తాకోడళ్ల మధ్య అనుబంధం బాగుండాలంటే మార్గాలివే!
Relationship Tips: ప్రతీ ఇంట్లో అత్తాకోడళ్ల మధ్య గొడవలు రావడం, విబేధాలు తలెత్తడం సహజం. ఈ పరిస్థితి రాకుండా వారి మధ్య మంచి అనుబంధం ఏర్పడాలంటే ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి.
Relationship Tips: ఒక వ్యక్తి జీవితంలో ప్రతి బంధమూ ప్రత్యేకమైనదే. ఇందులో ప్రత్యేకించి అమ్మాయిల జీవితం గురించి మాట్లాడితే పెళ్లి వరకు తన తల్లిదండ్రులతో పాటు పుట్టినింట్లో పెరిగితే, పెళ్లి తర్వాత తన కన్నవారిని, పుట్టినిల్లును విడిచి అత్తమామల ఇంటికి వస్తుంది. తన భర్తతో తన నూతన జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఆ తర్వాత అందరూ ఆ అమ్మాయికి కొత్తవారే. తన జీవితంలో అనేక కొత్త సంబంధాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ సంబంధాలలో అత్తాకోడళ్ల మధ్య ఏర్పడే బంధం చాలా సున్నితమైనది. దాదాపు వందకు తొంభైతొమ్మిది ఇళ్లల్లో అత్తాకోడళ్ల మధ్య గొడవలు జరగటం మన సమాజంలో సర్వసాధారణం.
ఈ గొడవలు కూడా ఒకరోజుతో సమసిపోయేవి కాదు, డైలీ సీరియల్‌లా ప్రతిరోజూ సాగుతాయి. ఒకవైపు టీవీలో సీరియళ్లు, మరొక వైపు నిజజీవితంలో గొడవలు రెండూ జోడెడ్ల బండిలాగా సమాంతరంగా సాగుతాయి. సీరియల్ కథ మీ ఇంట్లో జరుగుతుందా, లేక మీ ఇంట్లో కథనే సీరియల్‌గా తీస్తున్నారా? అన్నంతగా చిత్రవిచిత్రంగా ఉంటుంది పరిస్థితి. ఈ అత్తాకోడళ్ల మధ్యలో అటు భార్య వైపు నిలబడాలో లేక ఇటు అమ్మ మాటకు ఎదురు చెప్పాలో తెలియక చాలా మంది భర్తలు ఫ్రస్ట్రేషన్‌తో రగిలిపోతారు. అత్తాకోడళ్ల గొడవలు లేని ఇల్లు స్వర్గం కంటే గొప్పది. అయితే ఈ గొడవలను కాస్త సీరియస్‌గా ఆలోచించాలి. అత్తాకోడళ్ల మధ్య అనుబంధం పెరిగితే ప్రతీ ఇల్లు బృందావనమే అంటున్నారు మనస్తత్వ నిపుణులు.
గొడవలు ఎందుకు జరుగుతాయి?
పెళ్లి తర్వాత, ఆమె అత్తమామల ఇల్లు ఏ అమ్మాయికైనా పూర్తిగా కొత్త ప్రదేశం, తాను పెరిగిన వాతావరణానికి పూర్తిగా విభిన్నం. కొత్తగా వచ్చిన కోడలు సహజంగానే తెలిసో, తెలియకో కొన్ని తప్పులు చేస్తుంది. ఈ ఇంటి కట్టుబాట్లు, సాంప్రదాయాల విషయాలపై అవగాహన లేకుండా తనకు నచ్చిన విధంగా చేసుకుపోతుంది. ఇలాంటివి అత్తకు నచ్చకపోయినా, లేదా తన చెప్పుచేతల్లో కోడలు ఉండాలని చూసినా లేదా తన కొడుకు ప్రేమ తనకు దూరం కాకూడదనే ప్రయత్నంలో అత్త ముందుగా ప్రతిస్పందిస్తుంది. ఇది అతిగా మారినపుడు తిరుగుబాటు మొదలవుతుంది. ఇక్కడే అనేక గొడవలకు నాంది పలుకుతుంది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుంది.
గొడవలు నివారించడం ఎలా?
అత్తా కోడళ్ల మధ్య అనుబంధం బలపడితే వారి మధ్య గొడవలకు ఆస్కారం ఉండదు. అందుకు వారు కొన్ని మార్గాలను అనుసరించాలి.
తల్లీకూతుళ్ల సంబంధం
అత్త తన కోడలును సొంత కూతురుగా భావించాలి, అదే సమయంలో కోడలు కూడా తన అత్తను అమ్మగా భావించాలి. పొరపాటున ఏదైనా మాట అంటే స్వీకరించాలి. అదే సమయంలో అత్త తన కోడలిపై పరుష పదజాలం ఉపయోగించకూడదు. ఒకరి కష్టసుఖాలు ఒకరు, ఒకరి పనులు ఒకరు పంచుకుంటూ ముందుకు సాగాలి.
సమయాన్ని వెచ్చించండి
ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. మీరు అత్తాకోడళ్ల రిలేషన్‌షిప్‌లో మాధుర్యాన్ని కోరుకుంటే, ఇద్దరూ ఒకరితో ఒకరు సమయం గడపండి.
ఆలోచనలకు ప్రాధాన్యత
ప్రతి ఒక్కరికి వారి స్వంత ఆలోచనలు, అభిప్రాయాలు ఉంటాయి. అత్తాకోడళ్లు ఇద్దరు ఈ విషయంలో ఏకాభిప్రాయంతో ఉండాలి. ఒకరి ఆలోచనలు స్వీకరించాలి, అభిప్రాయాలను గౌరవించాలి. మంచి చెడులు చెప్పుకోవాలి. ఇక్కడ ఒకరినొకరు అర్థం చేసుకోవడం ముఖ్యం.
ఎంపికల విషయంలో జాగ్రత్త
చాలా సందర్భాల్లో అత్త ఒక కొడుకుకి అమ్మగా తన కొడుకుకి ఏది ఇష్టమో దానిని ఎంచుకుంటుంది, భార్యకు తన భర్త విషయంలో మరొక ఎంపిక ఉంటుంది. ఇలాంటివి చాలా సందర్భాలు ఎదురవుతాయి. 'నాది మాత్రమే సరైన ఎంపిక' అని ఏ ఒక్కరు భావించినా అది విభేదాలకు దారితీస్తుంది. కొన్నిసార్లు కోడలి ఎంపికను అత్త ప్రశంసించాలి, కోడలు అత్త ఎంపికను మెచ్చుకోవాలి.
కలిసుండాలి అనే భావన
ఏది ఏమైనా, ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు జరిగినా అత్తాకోడళ్లు ఇద్దరూ కలిసిపోవాలి, ప్రేమగా మాట్లాడుకోవాలి. అనుబంధాన్ని పెంచుకోవాలి. ఇది మన ఇల్లు, కలిసి ఉండాలి అనే భావన ఉండాలి. కోడలు తన మెట్టినిల్లును మొదటి నుంచే పుట్టినిల్లుగా భావించాలి. అత్త తన కోడలుకి ఇదే పుట్టినిల్లు అనే భరోసా ఇవ్వాలి.
చివరగా ఒక్క మాట: ఇక్కడ అందించిన చిట్కాలకు ఎలాంటి గ్యారెంటీ, వారెంటీలు లేవు. అత్తాకోడళ్లు తమ భావోద్వేగాలను అదుపు చేసుకుంటూ గొడవలు జరగవద్దని అనుకున్నప్పుడే ఈ మార్గాలను అనుసరించడం సాధ్యం అవుతుంది.
సంబంధిత కథనం