Break Relationship Silence| మీ మధ్య మాటలు లేవా? మౌనాన్ని బద్ధలు కొట్టి, బంధాన్ని కాపాడుకోండి, ఇవిగో టిప్స్!-distance doesn t separate people silence does here are the tips to break silence and save relationship ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Distance Doesn't Separate People, Silence Does, Here Are The Tips To Break Silence And Save Relationship

Break Relationship Silence| మీ మధ్య మాటలు లేవా? మౌనాన్ని బద్ధలు కొట్టి, బంధాన్ని కాపాడుకోండి, ఇవిగో టిప్స్!

Manda Vikas HT Telugu
Dec 21, 2022 07:28 PM IST

Break Relationship Silence: ఏ బంధంలో అయినా కమ్యూనికేషన్ అనేది ఉండాలి. ఇద్దరి మధ్య చాలా కాలంగా మాటలకు బదులు మౌనం పెరిగితే, వారి మధ్య దూరం కూడా పెరుగుతుంది. దగ్గరవ్వటానికి ఈ చిట్కాలు పాటించండి.

Relationship Silence
Relationship Silence (Pexels)

తుపాకీ నుంచి వచ్చే తూటా కంటే శక్తివంతమైనది నోటి మాట. ఒక్కమాటతో గుండెలు విరిగిపోవచ్చు, మనసులు చెదిరిపోవచ్చు, మనుషులు విడిపోవచ్చు. అయితే ఈ మాటకంటే కూడా శక్తివంతమైనది, భరించలేని బాధ కలిగించేది మౌనం. మన ప్రియమైన వారి నిశబ్దం కూడా కొన్నిసార్లు భయపెడుతుంది. ఎప్పుడూ మనపై అరుస్తూనో లేదా బిగ్గరగా మాట్లాడుతూనో ఏదో ఒకటి చెప్పేవారు ఒక్కసారిగా మాట్లడటం మానేసి మౌనంగా ఉంటే, వారి మౌనం కూడా గుండెలను దహించివేస్తుంది. మన స్నేహితులు, ఆత్మీయులు, భార్యాభర్తలు మనతో మాట్లాడటం మానేసి వారి పనులు వారు చేసుకుంటూ ఉంటే, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి నుంచి వచ్చే సమాధానం మౌనమే అయితే ఆ భావోద్వేగాల ఉప్పెనను ఆపడం ఎవరి తరం కాదనిపిస్తుంది. నిజానికి వారి మౌనం మిమ్మల్ని ఎంత బాధిస్తుందో, మౌనంగా ఉండే వారు అంతకంటే వెయ్యి రేట్లు బాధను అనుభవిస్తారు. వారి లోపల ఉబికే లావాను మనసులోనే అణిచిపెట్టుకుంటారు. కానీ ఇలా ఎంతకాలం? చివరకు ఈ మౌనం ఎక్కడకు దారితీస్తుంది?

మౌనానికి హద్దు ఉంటుంది. కొన్ని నిమిషాలు, గంటల పాటు లేదా కొన్ని రోజులు మౌనం వహించి ఆ తర్వాత మళ్లీ కలిసిపోతే ప్రేమ పెరుగుతుంది. మాటలు మధురమవుతాయి. కానీ, ఆ మౌనం నెలలు గడిచినా వీడకపోతే అదేదో తీవ్రమైన సమస్యే అయి ఉంటుంది. కొంతమంది భార్యాభర్తలు నెలలు, సంవత్సరాలు గడిచినా మాట్లాడుకోరు. ఇది చివరకు బంధం విచ్ఛిన్నానికి కూడా దారితీయవచ్చు.

ఒత్తిడికి, అనారోగ్యకరమైన అలవాట్లకు దారి తీస్తుంది. ఇలాంటి మౌనం వల్ల ఆత్మహత్యలు చేసుకునేవారూ ఉన్నారు. కాబట్టి నిశ్శబ్దాన్ని కూడా జాగ్రత్తగా ఛేదించాల్సి ఉంటుంది.

How To Break Silence In A Relationship- నిశ్శబ్దాన్ని ఎలా ఛేదించాలి?

చాలా కాలం తర్వాత మౌనంగా ఉండి మాట్లాడాలంటే వారికి మాట్లడటానికి మొహమాటం అడ్డువస్తుంది. లేదా వారు ఆ మౌనంతోనే సౌకర్యవంతంగా ఉండగలుగుతారు. బంధాలను దూరం చేసుకోకూడదంటే ఈ నిశబ్దాన్ని వీడాలి. అందుకు నిపుణులు కొన్ని చిట్కాలను పంచుకున్నారు. వాటిని ఇక్కడ తెలుసుకోండి.

1. మీ భాగస్వామి మౌనంగా ఉంటే, వారికి ఒక సందేశం పంపడానికి ప్రయత్నించండి. లేదా ఒకసారి కాల్ చేయండి. వారు మీ కాల్ స్వీకరించలేకపోతే కొంత సమయం వదిలి మళ్లీ కాల్ చేయండి. నవ్వడానికి లేదా ఏడవడానికి సిద్ధంగా ఉండండి. మళ్లీ ఫోన్‌లో రక్షణాత్మక ధోరణిలో మాట్లాడకూడదు.

2. నిశ్శబ్దాన్ని విచ్ఛిన్నం చేయడానికి శక్తివంతమైన మార్గం "క్షమాపణ". బేషరతుగా క్షమాపణ చెప్పండి, ఈ క్షమాపణ చెప్పడానికి అహం అడ్డురావద్దు. మీరు చెప్పే చిన్ని క్షమాపణ ఇద్దరినీ ఏకం చేస్తుంది.

3. వారిని కాఫీకి ఆహ్వానించండి లేదా లంచ్, డిన్నర్ ప్లాన్ చేయండి. కుదిరితే షాపింగ్ కు తీసుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండండి.

4. మౌనంగా ఉన్నవారిపై కోపంతో ప్రతిస్పందించడం మానేయండి. పరిస్థితిపై నియంత్రణ కోల్పోవద్దు. శాంతి, అవగాహనతో సమస్య పరిష్కారమవుతుంది. నెమ్మదిగా మాట్లాడండి, అర్థవంతంగా మాట్లాడండి. వారి భావాలను అర్థం చేసుకోండి. వారి స్థానంలో మిమ్మల్ని మీరు ఊహించుకోండి, పరిష్కారం కనుగొనండి.

5. మీరిద్దరూ మీ మౌనాన్ని పరిష్కరించుకోలేకపోతే, మీ ఇద్దరి మాటలు వినగలిగే వారితో చర్చలు జరపండి. మీ శ్రేయోభిలాషి సహాయం కోరండి. సమస్య కారణాన్ని కనుగొనండి, పరిష్కారం కూడా కనుగొనండి. వారి ద్వారా కలిసిపోయేందుకు ప్రయత్నించండి.

6. తప్పు మీ వైపు ఉంటే, వారితో మీకు బంధం ముఖ్యం అనుకుంటే ఎన్నిసార్లు అయినా కలిసేందుకు మీ ప్రయత్నాలు మీరు చేయండి. మీలో నిజాయితీ ఉంటే మిమ్మల్ని వారు వదులుకోరు.

7. వారు మాట్లాడకపోయినా, మీరు మాట్లాడండి, మాట్లాడుతూ ఉండండి, విషయాలు చెపుతూ ఉండండి. ఒక గట్టి హగ్ ఇవ్వండి, అస్సలు వదలకండి.

మీది భార్యాభర్తల బంధం అయితే కచ్చితంగా కలిసిపోతారు. ఒకవేళ మీది ప్రేమ బంధం లేదా మితృత్వం అయితే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోతే, వారికి మీ అవసరం తీరిపోయినట్లే. మీ జీవితం, మీ పురోగతి గురించి ఆలోచించడం ఉత్తమం.

WhatsApp channel

సంబంధిత కథనం