Water Fasting । నీటి ఉపవాసంతో వేగంగా బరువు తగ్గవచ్చు.. ఇదేమిటో తెలుసుకోండి!
Water Fasting: ఉపవాసం అంటే ఏమిటో మీకు తెలుసు. అయితే మీకు నీటి ఉపవాసం గురించి తెలుసా? దీని గురించి వివరణ ఇక్కడ తెలుసుకోండి.
Water Fasting: ఉపవాసం అంటే అంటే ఏమిటో మీకు తెలుసు, ఒక నిర్ధిష్ట సమయం పాటు ఆహారాన్ని తీసుకోకుండా ఉండటం. ఉపవాసంలో ఉన్నవారు కొంతమంది ఫలాహారంగా కూడా ఏదైనా తీసుకుంటారు. అయితే మీకు నీటి ఉపవాసం గురించి తెలుసా? నీటి ఉపవాసం చేయడం ద్వారా మీరు వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుందని తాజా పరిశోధనలో తేలింది. అంతేకాకుండా అధిక రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది, కొలెస్ట్రాల్ ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంటుంది పరిశోధన ఫలితాలు వెల్లడిస్తున్నాయి. చికాగోలోని యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో నీటి ఉపవాసాలు పలు రకాల జీవక్రియ ప్రయోజనాలు అందిస్తాయని రుజువైంది. ఇంతకీ నీటి ఉపవాసం అంటే ఏమిటి? నీరు తాగకుండా ఉండటమా? దీని గురించి వివరణ ఇక్కడ తెలుసుకోండి.
నీటి ఉపవాసం అంటే ఏమిటి?
నీటి ఉపవాసం అంటే కేవలం నీరు మాత్రమే తాగడం. నీటి ఉపవాసంలో ఉన్నప్పుడు నీరు తాగడం మినహా మరేఇతర పానీయాలు తాగటం గానీ, అల్పాహారాలు తీసుకోవడం గానీ చేయకూడదు. పూర్తిగా నీటి మీదే ఆధారపడాలి. ఆకలి వేసిన ప్రతీసారి నీటితో కడుపు నింపుకోవడం ద్వారా ఆహారం తీసుకోవడం పరిమితం చేయడం.
కేవలం రోజులో నీరు మాత్రమే తాగటం ద్వారా మీ శరీరంలో కేలరీలు పెరగవు. స్వల్పకాలం పాటు ఈ రకమైన ఉపవాసం చేయడం ద్వారా ఎటువంటి తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు కనిపించలేదని పరిశోధకులు పేర్కొన్నారు. డయాబెటీస్ ఉన్నవారికి కూడా ప్రతికూల ప్రభావాలు కనిపించలేదని తెలిపారు.
తమ అధ్యయనంలో భాగంగా ఐదు రోజుల పాటు నీటి ఉపవాసం ఉన్నవారు తమ బరువులో 4 శాతం నుంచి 6 శాతం వరకు తగ్గారు. ఏడు నుండి 10 రోజులు ఉపవాసం ఉన్నవారు దాదాపు 2 శాతం నుండి 10 శాతం వరకు బరువు తగ్గారు, అదేవిధంగా 15 నుండి 20 రోజులు నీటి ఉపవాసం ఉన్నవారు 7 శాతం నుండి 10 శాతం వరకు శరీర బరువును కోల్పోయినట్లు తేలిందని గుర్తించారు.
ఆకలి వేసినపుడు నీరు తాగి ఆకలిని తీర్చుకునే పద్ధతి చాలా కాలంగా ఆచరణలో ఉంది. నీటి ఉపవాసం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఉదాహరణకు, ఇది కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే ఆటోఫాగీని ప్రేరేపిస్తుంది, అంటే మీ శరీరంలో పాత కణాలను విచ్ఛిన్నం చేసి, వాటిని రీసైకిల్ చేయడంలో సహాయపడుతుంది.
అయితే నీటి ఉపవాసం అందరికీ అనుకూలమైనది అని చెప్పడం లేదు. బరువు తగ్గాలనుకునే వారందరికీ ఈ నీటి ఉపవాసం చేయమని సిఫార్సు చేయడం లేదు. ఎందుకంటే నీటిని మాత్రమే తీసుకోవడం ద్వారా శరీరానికి అందాల్సిన పోషకాలు అందవు, ఇది అనారోగ్యకరమైన రీతిలో బరువు తగ్గడానికి దారితీస్తుంది. అలాగే రక్తపోటు కూడా పడిపోయి లోబీకి దారితీయవచ్చు.
ఇది మాత్రమే కాదు, కేవలం నీరు మాత్రమే తాగితే డీహైడ్రేషన్ కు దారితీయవచ్చు. ఇది వినటానికి విచిత్రంగా ఉన్నప్పటికీ నీరు మాత్రమే తాగటం వలన ఆ నీరు శరీరంలో నిల్వ ఉండకపోవచ్చు, తినే ఆహారం ద్వారా కూడా నీరు లభిస్తుంది. అది శరీరంలో నీటిని నిల్వ ఉంచుతుంది, కాబట్టి ఆహారం లేకపోతే నిర్జలీకరణం, ఇతర అనారోగ్యాలకు దారితీయవచ్చును అని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
సంబంధిత కథనం