Vamu Rasam Recipe: వారానికి ఒకసారి వామురసం తింటే పొట్ట క్లీన్ అవ్వడం ఖాయం, ఇదే రెసిపీ
Vamu Rasam Recipe: వారానికి ఒకసారి వాము రసం తినడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉన్నాయి.
Vamu Rasam Recipe: ఆహారం అధికంగా తినడం వల్ల, సరిగా ఉడకని ఆహారాలు తినడం వల్ల... జీర్ణ సమస్యలు వస్తూ ఉంటాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి వారానికి ఒకసారి అయినా వాముతో చేసిన వంటకాలను తినాలి. ముఖ్యంగా వాము రసాన్ని వారానికోసారి తినడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. దీనివల్ల పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. వామురసం చేయడం చాలా సులువు. వేడివేడిగా ఈ వాము రసాన్ని తింటే టేస్టీగా ఉంటుంది. వామురసం రెసిపీ ఎలాగో చూద్దాం.
వాము రసం రెసిపీకి కావలసిన పదార్థాలు
వాము - ఒకటిన్నర స్పూను
ఉల్లిపాయ - ఒకటి
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
పచ్చిమిర్చి - రెండు
కరివేపాకు - గుప్పెడు
చింతపండు - చిన్న నిమ్మకాయ సైజులో
బెల్లం తురుము - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
ఆవాలు - అర స్పూను
జీలకర్ర - అర స్పూను
వెల్లుల్లి - మూడు రెబ్బలు
ఎండుమిర్చి - రెండు
నూనె - రెండు స్పూన్లు
పసుపు - అర స్పూను
వాము రసం రెసిపీ
1. ఒక గిన్నెలో అర లీటర్ నీళ్లు వేయండి.
2. దానిలో చింతపండు, ఉప్పు, పసుపు పొడి, తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయల ముక్కలు వేయండి.
3. ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టి 20 నిమిషాల పాటు మరిగించండి.
4. తరువాత కొత్తిమీర ఆకులను, కరివేపాకులను కూడా వేసి మరిగించండి.
5. ఒక టీ స్పూను బెల్లం తరుగును, కొత్తిమీర తరుగును వేయండి.
6. ఇప్పుడు ఒక స్పూను వామును వేసి చిన్న మంట మీద 20 నిమిషాలు పాటు మరగనివ్వండి.
7. ఇప్పుడు ఈ రసానికి పోపు పెట్టేందుకు వేరే కళాయిని తీసుకొని స్టవ్ మీద పెట్టండి.
8. ఆ కళాయిలో ఒక స్పూన్ నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి చిటపటలాడించండి.
9. తర్వాత వీటిని తీసుకెళ్లి వాము రసంలో కలపండి. అంతే వాము రసం సిద్ధమైపోతుంది.
10. పిల్లలతో సహా ఇంటిల్లిపాది వారానికి ఒక్కసారైనా ఈ వాము రసాన్ని తినడం చాలా అవసరం.
వాము రసం తినడం వల్ల పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. పొట్ట నొప్పి, గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అతిసారం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణ సమస్యలు తగ్గడం వల్ల అధిక బరువు సమస్య తగ్గుతుంది. బరువు వేగంగా పెరగడం అనేది అదుపులో ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా ఉంటుంది. మహిళలు ఖచ్చితంగా వామును అప్పుడప్పుడు తింటూ ఉండాలి. ఇది నెలసరి సమయంలో వచ్చే నొప్పిని, తిమ్మిరిని తగ్గిస్తుంది. అలాగే చంటి పిల్లల తల్లులు వామును తినడం వల్ల వారిలో పాల ఉత్పత్తి పెరుగుతుంది. వాములో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువ. కాబట్టి శరీరానికి బ్యాక్టీరియా, వైరస్ తో పోరాడే శక్తిని ఇస్తుంది. ఇది చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అప్పుడప్పుడు వామును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జలుబు, దగ్గు, ఉబ్బసం వంటివి రాకుండా ఉంటాయి.
టాపిక్